చైనాతో రోదసిలో సై!

రోదసిలో చైనా తన శక్తిని పెంచుకుంటోంది. కో ఆర్బిటాల్​ కిల్లర్​ శాటిలైట్లతో పాటు అల్లంత దూరంలో అంతరిక్షంలో దాడి చేసే క్షిపణులను తయారు చేసుకుంటోంది. మరి, అలాంటి చైనాను ఎదుర్కోవాలంటే మనమూ అంతే దీటుగా ఉండాలి కదా. అందుకే మన శక్తి ఏంటో తెలియజేసేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ కలిసి అంతరిక్ష యుద్ధానికి (స్పేస్​ వార్​) సిద్ధమవుతున్నాయి. యుద్ధమంటే నిజం యుద్ధం కాదు. అక్కడ పొంచి ఉన్న ముప్పును ఎలా ఎదుర్కుంటారో ‘డ్రిల్స్​’ చేసి చూపించబోతున్నారన్నమాట.  రక్షణ శాఖ పరిధిలోని ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఐడీఎస్) గురు, శుక్ర వారాల్లో ‘ఇండ్​స్పేస్​ఎక్స్​’ పేరిట ఈ డ్రిల్స్​ చేయబోతోంది. చైనాను గట్టిగా ఎదుర్కోవాలంటే  మన అంతరిక్ష వ్యవస్థల రక్షణ కోసం ఆయుధాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ‘‘ఈ ఏడాది మార్చి 27న మిషన్ శక్తి ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. దేశం మరింత బలోపేతమయ్యేలా, సురక్షితంగా మార్చేలా ఈ ప్రయోగాన్ని చేసినట్టు ప్రధాని మోడీ అన్నారు. అదే మార్గంలో రోదసిలో ఎదురయ్యే సవాళ్లు, లోపాలను గుర్తించేందుకు ఇండ్‌‌స్పేస్‌‌ఎక్స్‌‌ను నిర్వహించబోతున్నామని ఆయన చెప్పారు” అంటూ  డ్రిల్స్​ గురించి ఓ అధికారి చెప్పారు. స్పేస్‌‌ వార్‌‌ ఆయుధాలు దేశాల ఆర్థిక, సామాజిక రంగానికి ఉపయోగపడే వ్యవస్థలను నాశనం చేయడమే కాకుండా రక్షణ, నిఘా శాటిలైట్లను, కమ్యూనికేషన్‌‌ వ్యవస్థలను జామ్‌‌ చేస్తాయి. అలాంటి వాటిని ఎదుర్కొనేందుకే మన రక్షణ దళాలు ఈ డ్రిల్స్​ చేస్తున్నాయి.

Latest Updates