కాంగ్రెస్ కరోనా అయితే..టీఆర్ఎస్ ఎయిడ్స్ పార్టీ

  •                 కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 

‘‘కాంగ్రెస్ కరోనా పార్టీ అయితే టీఆర్‍ఎస్‍ ఎయిడ్స్ పార్టీ’’ అని కాంగ్రెస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍, ఎంపీ రేవంత్‍ రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేండ్ల పదవి కోసం టీఆర్‍ఎస్‍లో చేరితే, రాజకీయంగా అలాగే సచ్చిపోతున్నారని అన్నారు. తన అరెస్టును పార్లమెంట్ లో లేవనెత్తిన ఎంపీకి కృతజ్ఙతలు తెలిపారు. కేసీఆర్‍ అవినీతిపై పోరాటం తన వ్యక్తిగతం కాదన్నారు. 2 నెలల క్రితం రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని తనకు బాధ్యతలు అప్పజెప్పారని గుర్తుచేశారు. అందులో భాగంగానే జన్వాడలో కేటీఆర్ అక్రమ ఫామ్ హౌజ్ ను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రజలకు చూపించానన్నారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై నేటి నుంచి ఆధారాలతో సహా బండారం బయటపెడతానన్నారు.

కేసీఆర్ పై పోరాడటానికే కాంగ్రెస్ లోకొచ్చా.. 

ఢిల్లీ వెళ్లనని, ఇక్కడే ఉండి ఇక టీఆర్‍ఎస్‍ అవినీతిపై పోరాటం ఉధృతం చేస్తానన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్‍ఎస్‍పై పోరాడతానన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరింది పదవి కోసమో, డబ్బు కోసమో కాదని, కేసీఆర్ మీద పోరాడేందుకేనని స్పష్టం చేశారు. కేసీఆర్‍పై పోరాటానికి కార్యకర్తలంతా కాంగ్రెస్‍ నేతలపై ఒత్తిడి తేవాలన్నారు. కాంగ్రెస్ అనైక్యత  కేసీఆర్ బలంగా మారుతుందన్నారు. పింక్ మీడియా వక్రీకరించిన కథనాలతో తమ పార్టీ నేతలు కొందరు వారికి తెలియకుండా జరిగిందన్నారనీ, అయినా దాన్ని తప్పుపట్టడం లేదన్నారు. సమాచార లోపం వల్లే తమ పార్టీ నేతలు మాట్లాడారని చెప్పారు. పింక్ మీడియాను బహిష్కరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయం, ఏకాభిప్రాయంతో పోరాటం చేసి ఉంటే బాగుండేదన్నారు.

Latest Updates