వానొస్తే… సిటీలో వణుకుడే

ఏండ్లు గడుస్తున్నా దొరకని పరిష్కారం

వాన నీళ్లు సాఫీగా పోయేందుకు ఏర్పాట్లు లేవు

లోతట్టు ప్రాంతాల జనం కష్టాలు తీరేదెన్నడు?

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకు విస్తరిస్తూ, జనాభా పెరిగిపోతూ ఉన్న హైదరాబాద్ సిటీని నీటి కష్టాలు వదలట్లేదు. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి ఇబ్బందులు, నల్లాల్లో మురికి నీళ్లు రావడం.. వానాకాలం వచ్చిందంటే రోడ్లు, కాలనీలన్నీ నీట మునిగి చెరువుల్లా మారడం రివాజుగా మారిపోయింది. ఉమ్మడి ఏపీ పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ అధ్వాన్నంగా మారిందని విమర్శలు చేసిన టీఆర్ఎస్ సర్కారు.. పవర్లోకి వచ్చి ఆరేండ్లయినా సిటీలో సమస్యలు అట్లానే ఉండిపోయాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని ప్రకటించిన సర్కారు పెద్దలు.. ఏటా జనం పడుతున్న కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఏటా మంచినీటి కోసం కోట్లలో ఖర్చు

సిటీలో తాగునీటి కోసం 530 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ ఫర్ డే) నీళ్లు అవసరం. ప్రస్తుతం సరఫరా అవుతున్నది 470 ఎంజీడీలు మాత్రమే. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. కొన్నిచోట్ల మూడు, నాలుగు రోజులకోసారి నల్లా నీళ్లు ఇస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో మంచినీటి సరఫరా కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖాళీ బిందెలతో బస్తీ వాసుల ఆందోళన సాధారణమైపోయింది. దానికితోడు డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు సరిగా లేక.. నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయి. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు.

ఇంకుడు గుంతలేవి?

సిటీలో భూగర్భజలాలు అడుగంటడంతో గతేడాది తీవ్రంగా నీటి కొరత ఏర్పడింది. వాటర్ ట్యాంకర్ల కోసం రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేశారు. కానీ వాన నీటి సంరక్షణ, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ కు మాత్రం చర్యలు తీసుకోలేదు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేయకపోతున్నారు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకి నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని వాల్టా రూల్స్ ఉన్నా..  ఆరేండ్లలో అనుమతులు పొందిన వాటిలో 2% ఇండ్లలో కూడా ఇంకుడు గుంతల్లేవని అధికారులే చెబుతున్నారు.

రోడ్లు చెరువులవుతున్నయ్

గ్రేటర్ పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురికి, వాననీటి కాల్వలు ఉన్నాయి. వీటితోపాటు 216 మేజర్ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్లైన్ డ్రెయిన్లు, చిన్న సైజు డ్రెయిన్లు ఉన్నాయి. సిటీలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు నాలాలు, డ్రైనేజీలు పెరగాలి. కొత్తవి కట్టడంతోపాటు ఉన్నవాటిని విస్తరించాలి. కానీ భిన్నంగా నాలాలు కబ్జాల పాలవుతున్నాయి. దాంతో నీళ్లన్నీ రోడ్లు, కాలనీల్లో నిలిచి చెరువుల్లా మారుతున్నాయి.

లోతట్టు ప్రాంతాల సమస్య తీరేదెప్పుడు?

ఏటా వానాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలు నీట మునిగి అవస్థలు ఎదురవుతూనే ఉన్నాయి. మెయిన్ సెంటర్లో ఉన్న సోమాజిగూడలో డ్రెయిన్, ఫీడర్ చానళ్లు మనుగడ కోల్పోవడంతో చిన్న వానకు కూడా నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది. లక్డీకాపూల్ నుంచి రాజ్ భవన్ రోడ్డు వరకు మోకాళ్ల లోతు నీరు నిలుస్తోంది. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఇక సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్ లో రోడ్లపై నిలిచిన వాననీళ్లలో వెహికల్స్ మునిగిపోయే పరిస్థితి ఉంది. కూకట్పల్లి, శిల్పారామం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి చౌరస్తా, రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్, సుదర్శన్నగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఐకియా, కొండాపూర్, దుర్గంచెరువు ఇలా సిటీ వ్యాప్తంగా 116 ప్రాంతాలను గుర్తించి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. వాన నీళ్లు పోయేలా చర్యలు చేపట్టలేకపోయారు. లోతట్టు ప్రాంతాల్లో వాన నీళ్లు నిలవకుండా ఉండేందుకు 250 ఇంజెక్షన్ బోర్ వెల్స్ నిర్మిస్తామని ప్రకటించినా.. 10 శాతం మేర కూడా ఏర్పాటు చేయలేదు.

వాటర్ మేనేజ్ మెంట్ పక్కాగా ఉండాలె..

జనం ఎక్కువగా ఉండే హైదరాబాద్ వంటి సిటీలకు వాన వరద డేంజరే. లోతట్టు ప్రాంతాల్లో ఇంజెక్షన్ బోర్ వెల్స్ ఏర్పాటు చేయాలి. నాలాలపై ఆక్రమణలను తొలగించాలి. చెరువులు, కుంటల్లో పేరుకున్న పూడిక తొలగించి నిల్వ కెపాసిటీ పెంచాలి. ఇంకుడు గుంతలు తవ్వితే.. భూగర్భ జలాలు పెరుగుతాయి.-కల్పన రమేష్, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్

వానాకాలం వస్తే భయమే..

పదెకరాల విస్తీర్ణంలో ఉండే బండ చెరువు కబ్జాలతో నాలుగెకరాలే మిగిలింది. దీన్ దయాళ్ నగర్, సఫిల్ గూడ, షిర్డీ నగర్ వంటి ప్రాంతాల్లోని వరదంతా ఈ చెరువులోకే వస్తుంది. పెరిగిన జనాభాతో బిల్డింగుల నిర్మాణం, నాలాల కబ్జాతో వరద నీళ్లు పోయే అవకాశం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలతో నీళ్లు కాలనీలు, బస్తీలను ముంచుతున్నాయి. వానాకాలం వచ్చిందంటే భయమేస్తోంది. – నాగరాజు, దీన్ దయాల్ నగర్ కాలనీ

Latest Updates