మక్కలు కొనకపోతే.. ఎక్కడ అమ్ముకోవాలె

మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్

కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఆందోళన

నేషనల్ హైవేపై బైఠాయింపు, కలెక్టరేట్ ఎదుట ధర్నా

కామారెడ్డి, వెలుగు: మక్కలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సన్నొడ్లకు క్వింటాల్​కు రూ.2,500 చెల్లించాలని, వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్లతో గురువారం కామారెడ్డి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతు సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని టెకిర్యాల్ బైపాస్ వద్ద నేషనల్ హైవేపై 3గంటల పాటు బైఠాయించారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. ఆయన అందుబాటులో లేరని చెప్పడంతో రైతులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లారు. ఈ టైమ్ లో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఓ రైతు స్వల్పంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వచ్చి వినతిపత్రం తీసుకునే వరకూ తాము కదిలేది లేదని రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. చివరికి ఇన్​చార్జి ఆర్డీవో శ్రీను నాయక్, తహసీల్దార్ అమీన్ సింగ్ వచ్చి వినతిపత్రం తీసుకున్న తర్వాత ఆందోళన విరమించారు.

క్వింటాల్ వడ్లకు రూ.2,500 ఇయ్యాలె…

నీళ్ల పారకం, భూములను బట్టి ఏండ్లుగా మక్క పంటనే వేస్తున్నామని రైతులు చెప్పారు. ఇప్పుడు వాటిని సర్కార్ కొనుగోలు చేయబోమంటే ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ముందుగా ప్రకటించిన మద్దతు ధర రూ.1,860కి మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం చెబితేనే సన్నొడ్లు వేశామని, కానీ వర్షాలతో దిగుబడి సగానికి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సర్కార్ చెప్పినట్లే పంట వేశామని, క్వింటాల్ వడ్లకు రూ.2,500 చెల్లించి ఆదుకోవాలన్నారు. వర్షాలకు పత్తి, మక్క, వరి, సోయా పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పత్తి నల్లగా అయిందని.. మక్కలు, వడ్లు మొలకలు వస్తున్నాయని వాపోయారు. ఆఫీసర్లు పొలాల్లోకి వచ్చి పంట నష్టాన్ని అంచనా వేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మద్దతు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్
రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. రైతులతో కలిసి ఆయా పార్టీల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. రైతులు నేషనల్ హైవేపై బైఠాయిం చడంతో వెహికల్స్ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పోలీసులు వాటిని దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాటిని రామారెడ్డి, ఉప్పల్ వాయి, సదాశివనగర్ మీదుగా తాడ్వాయి, బాన్స్ వాడ ఎక్స్ రోడ్డు వైపు మళ్లించారు. అయినప్పటికీ కామారెడ్డి టౌన్ నుంచి వచ్చే బస్సులు, ఇతర వెహికల్స్ ఆగిపోయాయి. రైతుల ఆందోళనతో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనలో బీజేపీ నేతలు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, నాగర్తి చంద్రారెడ్డి, కిసాన్ సెల్ స్టేట్
ప్రెసిడెంట్ అన్వేశ్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు ఎడ్ల రాజిరెడ్డి, కైలాస్ శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

పంట పూర్తిగా దెబ్బతింది.. 

షరతుల సాగు అని చెప్పడంతో రెండకరాల్లో సన్నొడ్లు వేశాను. సీడ్స్ సరిగ్గా లేక తెగులు వచ్చింది. దీనికి తోడు వానలకు పంట పూర్తిగా దెబ్బతింది. సర్కారే ఈ పంట వేయాలని చెప్పినందున సన్నొడ్లకు క్వింటాల్​కు రూ.2,500 చెల్లించాలి.

– సామల గంగారెడ్డి, కుప్రియాల్ 

For More News..

ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌కు చట్టబద్ధత ఉంది.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

దసరాకు ‘ధరణి’ డౌటే! పూర్తి కాని ఆస్తుల నమోదు

మాజీ ఎమ్మార్వో నాగరాజు లాకర్లలో కిలోపావు బంగారం

Latest Updates