కరోనా పాజిటివ్ వస్తే వెలేసినట్లు చూస్తున్నరు

హోం ఐసోలేషన్​లో ఉన్నవారి ఆవేదన

 పంచాయతీ, మెడికల్​ సిబ్బంది నిర్లక్ష్యం

కరోనా బాధితుల వైపు అనుమానపు చూపులు

 సానుకూలంగా ఉండాలంటున్న సైకాలజిస్టులు

కరోనా పాజిటివ్ వచ్చిందని ఎంజీఎంలో రెండు రోజులు ఉంచుకుని హోం ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని పంపేసిన్రు. కానీ కరోనా వచ్చిందని తెలిసినప్పటి నుంచి మమ్మల్ని ఏదో పాపం చేసినట్టు చూస్తున్నరు. ఆశా కార్యకర్తలు కనీసం మందులిస్తలేరు. మా ఇంటి దగ్గర ఉన్నోళ్లయితే వైరస్ వస్తదేమోనని ఇండ్లకు పరదాలు కట్టుకున్నారు. కొందరు ఇండ్లు ఖాళీ చేసి వేరే దిక్కు పోయిన్రు. అందరూ అనుమానంగా చూస్తుంటే బాదయితుంది..వరంగల్​అర్బన్ ​జిల్లాలో  హోం ఐసోలేషన్​లో ఉన్న ఓ పేషెంట్​ మాటలివి.

వరంగల్​, వెలుగు: కరోనా పాజిటివ్ కన్ఫర్మ్ అయినా డాకర్ట సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే నయమయిపోతుంది. కానీ చుట్టు పక్కల వారు అంటరానివారు అన్నట్టు ప్రవర్తించడం, అనుమానపు చూపులు కరోనా బాధితులను కుంగతీస్తున్నాయి. ధైర్యం చెప్పాల్సిన ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది అటువైపు తొంగి చూడడం లేదు. కరోనా సోకిన వారికి అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నింపవలసిన మెడికల్ , పంచాయతీ సిబ్బంది అసలు వారిని పట్టించుకోవడం లేదు. కరోనా వ్యాపించకుండా ఫిజికల్ డిస్టే న్స్​పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, వాళ్లను మానసికంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బాధితుల పట్ల ప్రేమగా, సానుకూలంగా ఉండాలంటున్నారు.

అసలే పట్టించుకుంటలేరు..

హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి స్పెషల్ మెడికల్ కిట్ ఇచ్చి ఇంట్లోనే ఉండాలని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. వారికి కావాల్సిన నీళ్లు, కూరగాయలు, ఇతర కిరాణ సామగ్రి పంచాయతీ సిబ్బంది సమకూర్చేలా చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, మెడికల్  సిబ్బంది పేషెంట్ల పరిస్థి తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శానిటైజేషన్ పనులు చేయాలి. కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చిన వారి ఇంటి దగ్గర పంచాయతీ, మెడికల్ సిబ్బంది హంగామా చేస్తూ చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. రెండ్రోజులకు ఒకసారైనా వారి ఇంటిని శానిటైజేషన్ చేయడం లేదు. వారి ఇంటికి వెళ్లిన సిబ్బంది తమను అంటరాని వారి కంటే అధ్వాన్నంగా చూస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

 బంధాల మధ్య పరదాలు కడుతున్నరు

కరోనా సిమ్టమ్స్​లేని వారిని ఇంట్లోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కరోనాకు సంబంధించిన అవగాహనలేక పోవడంతో గ్రామస్తులు హోమ్ ఐ సోలేషన్లో ఉన్నవారి పట్ల కటువుగా ఉంటున్నారు. వారిని చూస్తేనే వైరస్ సోకుతుందన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పక్క ఇళ్లలో ఉంటున్న వాళ్లు ఇండ్ల చుట్టూ పరదాలు కట్టుకుంటున్నరు. దీంతో వైరస్ బారిన పడిన వ్యక్తులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నరు. వాళ్లు రక్షణ కోసం కట్టుకుంటున్నట్టు భావిస్తున్న పరదాలు వారి మధ్య సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. కరోనా బాధితుల పక్కన ఉంటున్న కొంతమంది ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా ఆయన కుటుంబాన్ని హోం ఐసో లేషన్లో ఉంచారు. వళ్ల ఇంటి పక్కన ఉన్న రెండు కుటుంబాలు మరో ఏరియాకు షిఫ్ట్​ అయ్యారు. ఫిజికల్ డిస్టె న్స్​పాటించడం, బయటకు వెళ్తే మాస్క్​ పెట్టుకోవడం, సరైన డైట్, మెడిసిన్ తీసుకోవడం వల్ల కోలుకునే అవకాశాలే ఎక్కువ. ఈ సంగతి తెలియక చాలామంది కరోనా పేషెంట్లు బాధపడేలా ప్రవర్తిస్తున్నారు.

కుటుంబ సభ్యులకు వచ్చినట్లే భావించాలి

కరోనా సోకిన వారిని దూరంగా పెట్టడం వల్ల వాళ్లు మరింత ఆవేదనకు గురవుతారు. మన కుటుంబ సభ్యులకు వైరస్ సోకితే ఎలా ప్రవర్తిస్తామో అలాగే బిహేవ్ చేయాలి. అంటరానట్టు ప్రవర్తిస్తే మనోవేదన చెందుతారు. అందరూ కరోనాపై అవగాహన పెంచుకోవాలి. దీనికి గ్రామ స్థాయిలో సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని అందరికీ అర్థం అయ్యేలా వివరించాలి. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ కరోనా బాధితులకు అవసరమైన చేయూతనందించాలి కానీ సమాజం నుంచి వెలిసివేసినట్టు గా ప్రవర్తించకూడదు.

డాక్టర్​జగదీశ్​బాబు, మానసిక వైద్య నిపుణులు, హన్మకొండ

కాలనీలో ఉండొద్దంటూ…

కామారెడ్డి, వెలుగు: ‘ మనం పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో..’ అంటూ ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మాత్రం అవగాహన రావ డంలేదు. కరోనా పేషెంట్ల పట్ల చుట్టు పక్కల వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్ వచ్చినా సిమ్టమ్స్​ లేకుంటే హోం ఇసోలేషన్లో ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వారు తమ కాలనీలో ఉండవద్దని స్థానికులు అడ్డుపడడం పెషేంట్లను కుంగదీస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో ఉంటున్న ఓ వ్యక్తికి గత నెల 24న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన అద్దె ఇంట్లోనే హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. 14 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్​ చేయించుకోగా ఈసారీ పాజిటివ్ వచ్చింది. అద్దె ఇంట్లో సరిగ్గా వెంటిలేషన్ లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని భావించిన ఆయన హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న తన కుటుంబీకుల సొంత ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి అంబులెన్స్​లో అక్కడు వెళ్లిన ఈ  పెషేంటును స్థానికులు అడ్డుకున్నారు. అంబులెన్స్​ను కాలనీలోకి రానియ్యలేదు. హెల్త్ డిఫార్ట్​మెంట్ ఆఫీసర్లు వచ్చి నచ్చజెప్పి పెషేంట్ను ఇంట్లో ఉంచి వెళ్లారు. శనివారం ఉదయమే కాలనీవాసులు ఆయన వెళ్లి పోవాలంటూ ఆందోళన చేశారు. పెషేంట్ తోపాటు, వారి కుటుంబీకులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి బయటకు రానని ఆయన ఎంత చెప్పినా కాలనీ వాసులు పట్టువీడ లేదు. కాలనీవాసులు ఒత్తిడితో కొందరు లీడర్లు కూడా పేషెంటును కాలనీ నుంచి వెళ్లి పోయేలా చూడాలని పోలీసులకు చెప్పినట్టుసమాచారం. కాలనీ వారు ఎంతకూ వినకపోవడంతో చివరకు పెషేంట్ అద్దెకు ఉంటున్న గోదాం రోడ్డులో ని ఇంటికే మళ్లీ వెళ్లాడు. సొంతిల్లు ఉన్న కాలనీ వాసులు వద్దంటే అద్దె ఇల్లే అతన్ని అక్కున చేర్చుకొంది.

 

Latest Updates