ఇంటి గొడవే ఇన్వెస్టర్లను ముంచింది

ముంబై : ఇండిగో ప్రమోటర్ల మధ్య గొడవ.. కంపెనీ షేరు ధర కొంపముంచింది. గత రెండు రోజులుగా ఇండిగో షేర్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. ప్రమోటర్ల మధ్య గొడవ బహిర్గతం కాగానే, కంపెనీ షేర్లు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి. గత రెండు సెషన్స్‌‌‌‌లో ఇంటర్‌‌‌‌‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఇన్వెస్టర్లు రూ.9778.36 కోట్ల మార్కెట్ వాల్యును కోల్పోయారు. కంపెనీ షేర్లు 16.7 శాతం మేర పడిపోయాయి. కంపెనీ స్టాక్ రూ.1,313.40 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. అయితే ప్రమోటర్ల మధ్య గొడవతో ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ పరిణామాలు చూడనప్పటికీ.. ఇంటర్‌‌‌‌‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్స్‌‌‌‌పై ఈ గొడవల ప్రభావం ఉంటుందని ఎడిల్‌‌‌‌విస్ ఫైనాన్స్ పేర్కొంది.

గవర్నెన్స్ ఇష్యూలపై మార్కెట్ చాలా సెన్సిటివ్‌‌‌‌గా ఉంటుందని ఎడిల్‌‌‌‌విస్ పేర్కొంది. ఇంటర్‌‌‌‌‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేష్ గంగ్వాల్, రాహుల్​ భాటియాల మధ్య నెలకొన్న సమస్యలను ప్రభుత్వం కూడా పరిశీలించనుంది. కంపెనీలోని గవర్నెన్స్​పై గంగ్వాల్ చేస్తోన్న ఆరోపణలను మార్కెట్స్ రెగ్యులేటరీ పరిశీలిస్తోంది.

భాటియా చేతికి బర్గర్ కింగ్?

ఓ వైపు ఇండిగోలో గొడవలు జరుగుతుంటే.. మరోవైపు రాహుల్ భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్… ఇండియాలోని పాపులర్ బర్గర్ కింగ్ ఫ్రాంచైజీలను దక్కించుకునేందుకు చూస్తోంది. దీని కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఎవర్‌‌‌‌‌‌‌‌స్టోన్ క్యాపిటల్‌‌‌‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్‌‌‌‌ రూ.1,400 కోట్లకు ఖరారు కానుందని తెలుస్తోంది. బర్గర్ కింగ్​ ఫ్రాంచైజ్ రైట్స్ ప్రస్తుతం సింగపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎవర్‌‌‌‌‌‌‌‌స్టోన్ క్యాపిటల్స్ క్యూఎస్‌‌‌‌ఆర్ ఏషియా పీటీఈ వద్ద ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ ఇండియాలో 140 అవుట్‌‌‌‌లెట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.375 కోట్ల విక్రయాలను జరిపింది.