IPL రద్దయితే పెద్ద మొత్తంలో నష్టాలు!

ఎట్లయినా నష్టం తప్పదు!
ఐపీఎల్‌పై అదే అనిశ్చితి
వాయిదాతో ఇప్పటికే  ఆదాయానికి గండి
కుదించినా అందరికీ తిప్పలే

ముంబైప్రాణాంతక కరోనా వైరస్‌‌ దెబ్బకు ప్రపంచం మొత్తం గబరా పడుతోంది. ఈ మహమ్మారి ధాటికి అన్ని రంగాలతో పాటు క్రీడారంగం కూడా చాలా దెబ్బతిన్నది.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని పోటీలు ఆగిపోగా.. మైదానాలన్నీ మూగబోతున్నాయి. మన దేశంలో పరిస్థితి చెప్పక్కర్లేదు. స్టేడియాలకు తాళాలు పడగా.. ఆటగాళ్లంతా ఇళ్లకు పరిమితమయ్యారు. మిగతా ఆటల పరిస్థితి ఎలా ఉన్నా.. క్రికెట్‌‌ను కరోనా తీవ్రంగా దెబ్బకొడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థనూ  ఎంతో కొంత ప్రభావితం చేయగల ప్రతిష్టాత్మక ఇండియన్‌‌ ప్రీమియర్​ లీగ్‌‌ (ఐపీఎల్‌‌) పదమూడో ఎడిషన్‌‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల చివర్లో మొదలవ్వాల్సిన లీగ్‌‌ను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. కానీ, పరిస్థితి చూస్తుంటే అప్పుడు కూడా షురూ అవుతుందని చెప్పలేం. వైరస్ వ్యాప్తి దేశంలో జోరందుకోవడంతో మరో నెల రోజులు గడిస్తే గానీ లీగ్‌‌ భవిష్యత్‌‌ను తేల్చలేం. అప్పుడే పూర్తి  స్థాయి టోర్నీ జరుగుతుందా.?  టోర్నీని కుదించాల్సి వస్తుందా? లేక పూర్తిగా రద్దవుతుందా? అనే దానిపై ఒక అంచనాకు రాగలం. ప్రస్తుత పరిస్థితులు బీసీసీఐ, ఐపీఎల్‌‌ యజమానుల ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి.

ఆప్షన్‌‌-ఎ: వచ్చే నెల 15వ తేదీలోపు దేశంలో పరిస్థితులు చక్కబడి మొత్తం 60 మ్యాచ్‌‌లతో జూన్‌‌ తొలి వారం వరకు లీగ్‌‌ నిర్వహించడం.
ఆప్షన్‌‌-బి: ఐపీఎల్‌‌ను కుదించడం. మ్యాచ్‌‌లు, రోజుల సంఖ్య తగ్గించి ‘మినీ ఐపీఎల్‌‌’తో  ఈ సీజన్‌‌ పూర్తి చేయడం.
ఆప్షన్‌‌-సి: కరోనా వైరస్‌‌ వ్యాప్తి అదుపులోకి రాకుండా లీగ్‌‌ నిర్వహించే పరిస్థితి ఏర్పడితే ఈ సీజన్‌‌ను రద్దు చేసుకోవడం.

ఇప్పటికైతే ఈ మూడింటిలో ఏది జరుగుతుందో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా టోర్నీ జరిగే చాన్స్‌‌ లేకపోవచ్చని  ఫ్రాంచైజీ యజమానులు భావిస్తున్నారు. అందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచన చేస్తున్నారు.  కానీ, ఆశలు మాత్రం కోల్పోవడం లేదు. నెల రోజుల్లో పరిస్థితులు మెరుగవ్వాలని కోరుకుంటున్నారు. అయితే, ఇప్పటికే  లీగ్‌‌ వాయిందా పడింది కాబట్టి  పై మూడు ఆప్షన్లలో ఏది జరిగినా ఎంతో కొంత నష్టం జరగడం అనివార్యం.

60 మ్యాచ్‌‌లతో నయమే..

ఆప్షన్‌‌–ఎ ప్రకారం  మొత్తం లీగ్‌‌ జరిగితే  నష్టాలు తక్కువే. కానీ, స్పాన్సర్లు, బ్రాడ్‌‌కాస్టర్ల అడ్వర్‌‌టైజింగ్‌‌ రెవెన్యూపై  మాత్రం కొంత ప్రభావం ఉంటుంది. లీగ్‌‌ ఆలస్యంగా మొదలవడంతో బ్రాడ్‌‌కాస్టర్‌‌కు  ప్రైమ్‌‌–టైమ్‌‌ టీవీ స్పేస్‌‌ దొరకదు. అలాగే, కరోనా దెబ్బకు ప్రజల్లో భయం నెలకొన్నందున స్టేడియాలకు ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువ. అప్పుడు టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కొంత కోల్పోవాల్సి ఉంటుంది. అయితే,  క్రికెటర్లు, మ్యాచ్‌‌ అఫీషియల్స్‌‌, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌, గ్రౌండ్స్‌‌మెన్‌‌కు మాత్రం ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లే చాన్స్‌‌ లేదు.  లీగ్‌‌ పూర్తి స్థాయిలో జరిగితే బ్రాడ్‌‌కాస్టర్‌‌ స్టార్‌‌ స్పోర్ట్స్‌‌, టైటిల్‌‌ స్పాన్సర్‌‌ వివో సహా ప్రధాన స్పాన్సర్ల  నుంచి  ఎప్పట్లాగే బోర్డుకు రూ. 4000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అప్పుడు కాంట్రాక్టు నిబంధనల ప్రకారం బీసీసీఐ, ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలు ఈ మొత్తాన్ని  చెరి సగం పంచుకుంటాయి.  ప్లేయర్లకు ఫ్రాంచైజీలు మొత్తం ఫీజులు (ఒక్కో టీమ్‌‌ రూ. 85 కోట్లు) చెల్లిస్తాయి. మ్యాచ్‌‌ అఫీషియల్స్‌‌, ఇతర ఉద్యోగుల జీతభత్యాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదు.  టికెట్స్‌‌ సేల్ పడిపోతే తప్పితే.. ఫ్రాంచైజీల లోకల్‌‌ రెవెన్యూలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

కుదిస్తే కష్టాలు తప్పవు..

ఆప్షన్‌‌–బి ప్రకారం ముందుకెళ్లాల్సివస్తే  మాత్రం పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. క్రికెటర్లు సహా లీగ్‌‌ వాటాదారులందరిపై దీని ప్రభావం ఉంటుంది. బ్రాడ్‌‌కాస్టర్‌‌ స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ ఈ సీజన్‌‌ కోసం ఇప్పటికే 90 శాతం వ్యాపార ప్రకటనలను బుక్‌‌ చేసుకుంది. లీగ్‌‌ను కుదిస్తే వాటన్నింటినీ సవరించాల్సి ఉంటుంది. ఎన్ని మ్యాచ్‌‌లు జరుగుతాయి, ఎన్ని రోజుల్లో వాటిని పూర్తి చేస్తారనే దానిపై సెంట్రల్‌‌ స్పాన్సర్లు తమ డీల్స్‌‌ను సమీక్షించుకుంటాయి. అప్పుడు ప్రధాన స్పాన్సర్ల ద్వారా బోర్డుకు వచ్చే ఆదాయంలో పెద్ద మొత్తానికి గండిపడుతుంది. అలాగే, మ్యాచ్‌‌లు తక్కువైతే   క్రికెటర్లతో పాటు లీగ్‌‌ భాగస్వాముల ప్రయాణ, వసతి కూడా స్పల్పంగా తగ్గుతుంది. దానివల్ల హాస్పిటాలిటీ (హోటళ్లు), ఎయిర్‌‌లైన్‌‌ ఇండస్ట్రీకి కొంత నష్టం వస్తుంది. అదే సమయంలో  మ్యాచ్‌‌ల లెక్కన క్రికెటర్లు, అధికారులకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది.  ఐపీఎల్‌‌ను కుదిస్తే.. మ్యాచ్‌‌ల సంఖ్య, టోర్నీ జరిగే సమయాన్ని బట్టి..  బ్రాడ్‌‌కాస్టర్స్‌‌, బీసీసీఐ తమకు వచ్చే ఆదాయం, నష్టాన్ని బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాటాదారులు కూడా కొంత ఆదాయాన్ని కోల్పోతారు.  ఆ లెక్కనే క్రికెటర్లకు చెల్లింపులు జరుగుతాయి.

సాధ్యం కాకపోతే.. నిండా మునగాల్సిందే!

ఆప్షన్‌‌–సి లెక్కన ఐపీఎల్‌‌ పూర్తిగా రద్దయితే మాత్రం అందరూ భారీ నష్టం చవి చూడాల్సి వస్తుంది. ఈ నష్టం.. అనేక రకాలుగా ఉంటుంది. లీగ్‌‌ జరగకపోతే.. అడ్వర్‌‌టైజింగ్‌‌, డిస్ర్టిబ్యూషన్​  నుంచి ఎలాంటి ఆదాయం రాదు కాబట్టి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌.. బీసీసీఐకి ఇవ్వాల్సిన రూ. 3,300 కోట్లు చెల్లించదు. అలాగే, టైటిల్‌‌ స్పాన్సర్‌‌ వివో కూడా రూ. 439 కోట్లు ఇవ్వదు. దాంతో పాటు సెంట్రల్‌‌ స్పాన్సర్లు దాదాపు 250 నుంచి 300  కోట్ల వరకూ బోర్డుకు చెల్లించబోవు. సెంట్రల్‌‌ రెవెన్యూ పూల్‌‌ నుంచి బీసీసీఐకి పైసా కూడా రాదు. టోర్నీనే జరగనప్పుడు ఆటగాళ్లకు (ప్రతి జట్టు85 కోట్లు) ఫ్రాంచైజీలు కాంట్రాక్టు ఫీజులు చెల్లించవు. అలాగే, ఈవెంట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీలు, మ్యాచ్‌‌–అఫీషియల్స్‌‌కు  ఫీజులతో పాటు   ఫారిన్‌‌ ప్లేయర్లు లీగ్‌‌లో ఆడినందుకు ఆయా దేశాల బోర్డులకు పదిశాతం  పార్టిసిపేషన్‌‌  ఫీజును కూడా బోర్డు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఫ్రాంచైజీలు స్థానికంగా వచ్చే రెవెన్యూ కూడా కోల్పోతాయి. తమ టీమ్స్‌‌ జెర్సీ స్పాన్సర్‌‌షిప్‌‌తో పాటు ఇన్‌‌స్టేడియా అడ్వర్‌‌టైజింగ్‌‌ (ప్రతి స్టేడియంలో ఒక్కో ఫ్రాంచైజీకి 12 అడ్వర్‌‌టైజింగ్‌‌ బోర్డులు) రైట్స్‌‌తో వచ్చే మొత్తానికి గండిపడుతుంది.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

Latest Updates