సడలింపులు వద్దంటే కేంద్రం ఒకే చెప్పాల్సిందే!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్ డౌన్ ను సడలింపులు లేకుండా యధాతథంగా అమలు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాల్సి ఉంటుందని అంటున్నారు. కూలీలకు, కార్మికులకు ఉపాధి కల్పించేలా.. ఉత్పత్తి రంగానికి మేలు చేకూర్చేలా ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్​లో కేంద్రం కొన్ని సడలింపులు  ఇచ్చింది. కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగిస్తూనే.. సడలింపులపై గైడ్ లైన్స్  జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ చూసిన రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలిస్తే  వైరస్ మళ్లీ విజృభించొచ్చని అంటోంది. తాము ముందుగా నిర్ణయించినట్లే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమలు చేయాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. లాక్ డౌన్ సడలింపులపై కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ చూసిన తర్వాత జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్రం ఆలోచనతో సంబంధంలేదని, ముందు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 30 వరకు లాక్​డౌన్అమలు చేయాలని సీఎం అన్నట్లు సమాచారం. అయితే  ఎలాంటి సడలింపులు లేకుండా కొనసాగించాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన ఉంటుందని  కొందరు అధికారులు ఆయన వద్ద ప్రస్తావించగా.. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్దామని సీఎం చెప్పినట్లు తెలిసింది.

కేంద్రానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం!

లాక్ డౌన్ అమలులో కేంద్రం ఇచ్చిన సడలింపులపై ఈ నెల 19న జరిగే రాష్ట్ర కేబినెట్​ భేటీలో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు ఎప్పటిలాగే అమలు చేయనున్నట్లు కేబినెట్​లో నిర్ణయం తీసుకొని.. తీర్మానం చేసి లేఖను కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

కేంద్రం నిర్ణయమే ఫైనల్​.. అయినా..?

రాజ్యాంగంలో హెల్త్  సబ్జెక్ట్  ఉమ్మడి జాబితాలో ఉంది. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అయితే రాష్ట్రాలు కూడా స్థానికంగా ఉండే పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏప్రిల్​ 20 నుంచి  లాక్ డౌన్​లో సడలింపులు అమలు చేసే విషయమై కేంద్రం ఇప్పటికే గైడ్ లైన్స్​ జారీ చేసింది. ఫైనల్​ గైడ్​లైన్స్​ను ఒకటీ రెండురోజుల్లో విడుదల చేయనుంది. ఫైనల్  గైడ్ లైన్స్ లో రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చే చాన్స్​ ఉందని రాష్ట్రంలోని సీనియర్  ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అలాంటి వెసులుబాటు రాకపోతే.. స్థానిక పరిస్థితులను వివరిస్తూ  లాక్ డౌన్ కొనసాగిస్తామని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయాల్సి ఉంటుందని  ఓ ఐఏఎస్
ఆఫీసర్​ అన్నారు.

Latest Updates