మళ్లీ ట్రంప్ గెలిస్తే అమెరికా మరింత దిగజారుతుంది: హిల్లరీ క్లింటన్

అమెరికాలో మరో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి ట్రంప్ కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా పని అయిపోయినట్టేనని అన్నారు. ఈ నాలుగేళ్లలో దేశాన్ని ఎంతో దిగజార్చారని… మరో నాలుగేళ్లు అధికారాన్ని అప్పగిస్తే దేశం మరింత దిగజారడం ఖాయమని స్పష్టం చేశారు. అంతేకాదు.. మరోసారి ట్రంప్ గెలుస్తాడనే ఆలోచన వస్తేనే కడుపులో తిప్పినట్టు అనిపిస్తోందన్నారు.

ఈసారి డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ గెలుస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని హిల్లరీ ధీమా వ్యక్తం చేశారు. బైడెన్, కమలా హ్యారిస్ ఇద్దరూ గెలుపొందాలని కోరుకున్నట్లు తెలిపారు. ట్రంప్ అధికారంలోకి రాకూడదనేదే తన తపన అని అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ గెలుపొందారు. హిల్లరీకి పాప్యులర్ ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ… ఎలెక్టోరల్ ఓట్లు మాత్రం ట్రంప్ కు ఎక్కువగా వచ్చాయి.

Latest Updates