ఎకానమీ పరుగెత్తాలంటే.. జనాల చేతికే పైసలియ్యాలె

కరోనా దెబ్బతో జనాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. జేబులో పైసలు లేక అందరూ అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎకానమీ పరుగులు పెట్టాలంటే ఒకటే మార్గం. ఇప్పటికే ఆత్మనిర్భర్​ భారత్​ కింద వివిధ రూపాల్లో ప్రజలకు చేయూత అందించిన కేంద్ర ప్రభుత్వం మరో స్టిమ్యులస్​ ప్రాకేజీ ప్రకటించాలి. ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోవాలి. ఇలా జరగాలంటే జనాల చేతిలో డబ్బులు ఉండాలి. ఇది జరగాలంటే కొత్తగా ప్రకటించే ప్యాకేజీలో జనాల చేతికే పైసలు ఇవ్వాలి. అప్పుడే ఎకానమీ మళ్లీ స్పీడ్​ అందుకుంటుంది.

దేశంలో ఇప్పటికీ 70 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మరోవైపు సమాజంలో 70 శాతం మంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే అది ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి, ఆ తర్వాత విధించిన లాక్​డౌన్​ దారుణంగా దెబ్బ తీశాయి. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. వలస కూలీలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు రాలేక ఇతర రంగాలు కుంటుబడ్డాయి. రోజువారీ కూలీలు, కార్మికులు జీవనోపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఎకానమీని తిరిగి పట్టాలు ఎక్కించాలంటే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఆత్మ నిర్భర్​ భారత్ కింద ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించిన మొత్తం స్టిమ్యులస్​ ప్యాకేజీల విలువ రూ.29,87,647 కోట్లు. ఇది దేశ జీడీపీలో 15 శాతం. ఇందులో కేంద్రం వాటా 9 శాతం కాగా, మిగిలినది ఆర్ బీఐ వివిధ రూపాల్లో ప్రకటించింది.

కన్స్యూమర్​ డిమాండ్​ పెంచాలె

మొదటి స్టిమ్యులస్​ ప్యాకేజీలో భాగంగా కేంద్రం బలహీన వర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, కార్మికులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే దేశ ఎకానమీలో కొన్నేండ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నది కన్స్యూమర్​ డిమాండే. ఇది కొంత కాలంగా దారుణంగా పడిపోయింది. వినియోగ వృద్ధిరేటు కూడా క్షీణించింది. ఈ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడికి గురైన సోషల్​ వెల్ఫేర్, ప్రొడక్షన్, రియాల్టీ, కన్​స్ట్రక్షన్, బేసిక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్​పోర్ట్స్, వ్యవసాయం వంటి రంగాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా హౌసింగ్​ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ఎకానమీలో డిమాండ్​ను పెంచవచ్చు. దేశంలో వ్యవసాయం తర్వాత పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది రియాల్టీ సెక్టారే. 2022 నాటికి 6 కోట్ల 70 లక్షల మందికి ఉపాధి కల్పించి, 2025 నాటికి జీడీపీలో 13 శాతం వాటాకు రియాల్టీ రంగం చేరుతుందని అంచనా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇండ్ల కొనుగోలుదారులు, అమ్మకందారులకు రూ.18 వేల కోట్ల మేర బడ్జెట్ సాయాన్ని కేంద్రం ప్రకటించింది. 2020 బడ్జెట్​లో ప్రకటించిన రూ.8 వేల కోట్లకు ఇది అదనం. డిపాజిట్ మొత్తాన్ని మూడు శాతానికి తగ్గించింది. ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లకు ఆదాయపన్ను నిబంధనల్లో రిలాక్సేషన్​ ఇచ్చింది.

అగ్రి చట్టాలపై రైతుల ఆందోళన

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల్లో ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సమీపంలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని, వాటిని సవరించడానికి సిద్ధమని చెబుతోంది. రైతు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆదాయం, ఉత్పత్తులు రెట్టింపు చేసేలా ఈ చట్టాలు ఉపయోగపడతాయని ప్రధాని మోడీ హామీ ఇస్తున్నారు. అయితే బడా పారిశ్రామిక వేత్తలు వ్యవసాయ రంగంపై పట్టు పెంచుకోవడానికి ఈ చట్టాలు దోహదపడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రభుత్వాలు పంట కొనుగోలు చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో 189 వ్యవసాయ మార్కెట్ లు ఉన్నా 70 శాతం పంటలను ప్రైవేటు వ్యక్తులే కొంటున్నారు. దేశంలో మొక్కజొన్న దిగుబడి 2000–2019 మధ్యకాలంలో ఆరు శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయినా కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు. 2018–19లో 11.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే.. కేంద్రం 5.30 కోట్ల టన్నులు మాత్రమే మద్దతు ధరకు కొన్నది. దేశంలో వరి సాగు చేసిన రైతుల్లో 12 శాతం మంది మాత్రమే ప్రభుత్వ మద్దతు ధరకు పంట అమ్ముకున్నారు. వరి సాగు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్​లో 3.6 శాతం, పశ్చిమబెంగాల్​లో 7.3 శాతం మంది వరి రైతులు మద్దతు ధరకు ప్రభుత్వానికి పంట అమ్మారు. పంజాబ్ రైతుల్లో 95 శాతం, హర్యానాలో 69.9 శాతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు పంట అమ్ముకున్నారు. కొత్త చట్టాలతో ఇలా అమ్ముకునే అవకాశం పోతుందనే భయంతో పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేపట్టారు.

దేశంలో ఒక్క వ్యవసాయ రంగమే కాస్త మెరుగ్గా ఉంది. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. జీడీపీలో దీని వాటా రూ.20 లక్షల కోట్లు. అందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ప్రజల చేతిలో డబ్బులు పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.

యువతను సాగువైపు నడిపించాలె

మన దేశం డిమాండ్ బేస్డ్​ ఎకానమీ. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఎకానమీని ప్రగతిపథంలో నడిపించడానికి వీలవుతుంది. కన్స్యూమర్​ డిమాండ్​ను పెంచడమే స్టిమ్యులస్​ ప్యాకేజీ 1.0, 2.0లో ప్రధానంగా కనిపించింది. స్టిమ్యులస్​ 3.0లో దీనిపై ప్రభుత్వ వ్యయం ఎంత ఉండొచ్చన్నది ఇప్పుడే చెప్పలేమని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ఆర్థిక లోటు జీడీపీలో నిరుడు ఉన్న 8.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, ఉపాధి, ఉత్పాదక రంగాలను బలోపేతం చేయాలి. ఉపాధి హామీ స్కీంకు రూ.10 వేల కోట్లు కేటాయించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల మధ్య తేడాలు తగ్గించడానికి వీలుంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి పెంచితే అది ఎకానమీపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. నిరుద్యోగంతో యువత పెడదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిని సరైన దారిలో నడిపించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యువత పాత్ర రోజురోజుకూ తగ్గిపోతోంది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే దానికి ఇండస్ట్రీగా గుర్తింపు ఇవ్వాలి. అప్పుడు యువత కూడా వ్యవసాయ రంగంలోకి వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది.-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ.

క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్