పెద్దకర్మ చేయకుంటే.. దేవుడికి మొక్కరు!

పెద్దకర్మలో మేకకు అక్షింతలు వేయడం ఆదివాసీల సంప్రదాయం

ఎవరైనా చనిపోతే వారం పదిరోజుల్లో పెద్దకర్మ చేస్తారు. కానీ, ఆదివాసీలు మాత్రం కార్తీక మాసం వచ్చేవరకు ఆగుతారు. అందుకే కార్తీకమాసాన్ని వాళ్లు ‘కారున్​ మాసం’ అంటారు. కారున్​ అంటే వాళ్ల భాషలో పెద్దకర్మ అని అర్థం. కార్తీక మాసం అవడంతో  కుమ్రం భీం జిల్లా ఏజెన్సీలో గతవారం రోజులుగా ఆదివాసీలు తమని విడిచి వెళ్లిన ఆత్మీయులకు పెద్దకర్మలు చేస్తున్నారు.

జైనూర్​, వెలుగు:  పెద్దకర్మలో మేకకు అక్షింతలు వేయడం ఆదివాసీల సంప్రదాయం. ఇంటిముందు పచ్చని పందిరి వేసి దాని ముందు మేకను నిల్చోబెట్టి బంధువులంతా అక్షింతలు జల్లుతారు. మేకపై అక్షింతలేస్తే చనిపోయిన వ్యక్తికి తమ ఆశీర్వాదాలు అందుతాయని  వాళ్ల నమ్మకం. మేకకు అక్షింతలు వేసే చోటే ఇప్ప సాక (అరగంట
ఇప్ప పూలని నానబెట్టిన నీళ్లు )ను చనిపోయిన వాళ్ల పేరున నేలపై పోస్తారు. కారున్​కు వచ్చిన ప్రతి
ఒక్కరూ  ఇప్ప ఆకులతో  ఆ నీటిని సాక పోయాల్సిందే.

ఇప్పచెట్టు

ఇప్ప చెట్టు దగ్గర పూజలు చేయడంతో కారున్ ముగుస్తుంది. ప్రతి ఊరి శివారులో దీని కోసం ఓ ఇప్ప చెట్టుని ఎంచుకుంటారు ఆదివాసీలు. దాన్ని ‘కొర్మరా’ అంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇప్ప కల్లు నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యంతో చనిపోయినవాళ్ల ఆత్మ శాంతిస్తుందని, దుష్టశక్తులు దగ్గరకు రావనేది వాళ్ల నమ్మకం.

కారున్​ చేస్తేనే 

ప్రతియేటా పుష్యమాసంలో తమ వంశ పెద్ద దేవుని’కి పూజ నిర్వహిస్తారు ఆదివాసీలు. కుటుంబం నుంచి కనీసం ఒకరైన హాజరై పెద్ద దేవుని ఆరాధించాల్సిందే. అయితే కుటుంబంలో ఆ యేట చనిపోయినవాళ్లకి కారున్ చేయకపోతే ఆ కుటుంబం పెద్ద దేవుని పూజకు వెళ్లకూడదు. అందుకే కారున్ కంపల్సరీగా పూర్తి చేయాల్సిందే. పెద్ద కర్మ చేస్తేనే చనిపోయిన వ్యక్తిని దైవంగా చూస్తారు. కుటుంబంలో పుట్టిన వారసులకు చనిపోయిన వ్యక్తి పేరుని పెట్టి తమతో లేని లోటును తీర్చుకుంటారు. అందుకే ఆదివాసీల్లో పేర్లు ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి.

 

 

Latest Updates