పెళ్లిచేసుకోకుంటే చంపేస్తా.. కత్తితో యువతి  ఇంటికెళ్లి హల్చల్

విజయవాడ: ఆమె సాక్షాత్తు ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అధికారిణి. అదే సంస్తలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆమెపై కన్నేసి తనను పెళ్లి చేసుకోమంటూ పరోక్షంగా వెంటపడేవాడు. తొలుత లైట్ తీసుకున్నా.. అతను ఇంకా చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఆమెకు మరో యువకునితో నిశ్చితార్థం చేశారని తెలుసుకుని కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోనంటే చంపేస్తానంటే కేకలు వేస్తూ దాడికి యత్నించడంతో.. యువతి సహా కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు పరిగెత్తి వెళ్లి తప్పించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

విజయవాడ పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి(33) ఆర్టీసీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎం.అజయ్‌కుమార్‌ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. తన ఉద్యోగం.. పరువు పోతుందని ఆమె మౌనంగా ఉండడంతో మరింత చనువు తీసుకోవడం ప్రారంభించాడు. ఇంతలో ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్నఅజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. ఒక దశలో తీవ్రంగా బెదిరిస్తూ కత్తితో దాడికి ప్రయత్నించడంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అతడ్ని తోసేసి ఇంటి నుండి బయటకు పరుగు తీశారు. ఇరుగు పొరుగు వారు గమనించి అతన్ని పట్టుకునేందుకు వెంబడించగా పారిపోయాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులతోకలసి మంగళవారం ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నార్త్ ఏసీపీ షప్రుద్దీన్ తెలిపారు.

Latest Updates