ప్లాస్టిక్ ఇస్తే.. కడుపు నిండా భోజనం

ఏ హోటల్​కు వెళ్లినా.. పైసలిస్తేనే భోజనం పెడతారు. కానీ ఇక్కడ​ మాత్రం పైసలకు బదులు ప్లాస్టిక్​ ఇస్తే చాలు. కమ్మని రుచులతో కడుపు నిండా భోజనం పెడతారు. అవసరమైతే టీ షర్టులు కూడా ఇస్తారు. ‘ప్లాస్టిక్​ తగ్గాలి, పర్యావరణం బాగుండాలి’ అనే లక్ష్యంగా, ఈ కాన్సెప్ట్​ను తీసుకొచ్చారు. 

రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, వీధుల వెంట తిరిగి, ప్లాస్టిక్ చెత్తను ఏరి బతికేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్లంతా సేకరించిన ప్లాస్టిక్​ను అమ్మి కడుపు నింపుకుంటారు. రోజంతా తిరిగి సేకరించిన చెత్తను అమ్మి, వచ్చే డబ్బుతో పొట్టనింపుకునేది ఒక్కపూట మాత్రమే అయితే పేదల కడుపు నింపడానికి, అదే సమయంలో ప్లాస్టిక్​ను నిర్మూలించడానికి మున్సిపల్​ అదికారులు ‘పర్యావరణం బాగుండాలి. పేదల ఆకలి తీరాలి’ అనే ఆలోచనతో మున్సిపల్​ అధికారులు ఈ రకమైన స్కీమ్​ను తీసుకొచ్చారు. ఇది ఎంతోమంది పేదలకు వరంగా మారింది. కిలో, అరకిలో ప్లాస్టిక్​ సేకరించి ఇస్తే, కడుపునిండా భోజనం పెడతారు. ఇలా చెయ్యడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టు అవుతారని అధికారుల ఆలోచన. పర్యావరణ ప్రేమికులకు ఈ కాన్సెప్ట్​ నచ్చి అవగాహన కల్పిస్తున్నారు.

డిఫరెంట్​గా…

రోజురోజుకు ప్లాస్టిక్​ పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదు. ఎటు చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్​ నిర్మూలన కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఢిల్లీ, భువనేశ్వర్​ మున్సిపల్​ కార్పొరేషన్​లు డిఫరెంట్​గా ఆలోచించి ‘ప్లాస్టిక్​ ఫర్​ మీల్స్​’ స్కీమ్​ను తీసుకొచ్చాయి.

కలర్​ఫుల్​ హోర్డింగ్స్​

కొత్తగా ఆలోచించడమే కాకుండా ‘ప్లాస్టిక్​ ఫర్​ మీల్స్​’ స్కీమ్​ పేరుతో జనాలకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఇందుకోసం పెద్ద పెద్ద హోర్డింగ్​లు, పెయింటింగ్​లు రెడీ చేసి, ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నాయి. ‘ప్లాస్టిక్​ ఇస్తే ఫ్రీ మీల్స్’ అంటూ ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, భువనేశ్వర్​ సిటీల్లో చాలా సెంటర్లలో హోర్డింగ్స్​ కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్​ బ్యాగ్స్​, బాటిల్స్​ సేకరించి ఇస్తే భోజనం పెడతాయి. భోజనం తినడానికి ఇష్టపడనివాళ్ల కోసం జ్యూట్​ బ్యాగ్​లు, టీషర్టులు, బట్టలను అందిస్తున్నాయి. పేదవాళ్లే కాకుండా, మధ్య తరగతి, ధనిక కుటుంబాల వాళ్లు ప్లాస్టిక్​ తెచ్చేందుకు ముందుకొస్తున్నారు.

ఎకో హబ్​ ఆన్​ వీల్స్​

ప్లాస్టిక్​ను తగ్గించేందుకు ఢిల్లీ, భువనేశ్వర్​ మున్సిపాలిటీలు ‘ఆన్​ వీల్స్​’  అంటూ జనాల దగ్గరికే వెళ్తున్నాయి. గల్లీగల్లీ తిరుగుతూ కిలోల లెక్కన చెత్తను, ప్లాస్టిక్​ను సేకరిస్తుంది. పేపర్​, స్టీల్​, గ్లాసులు, బాటిళ్లు.. ఇలా ప్లాస్టిక్​కు సంబంధించిన ఏదైనా సరే సేకరిస్తుంది. సేకరించిన చెత్తపై డిస్కౌంట్​ ఇస్తూ బట్టలు, ఇతర వస్తువులు కొనడానికి కూపన్లు ఇస్తున్నాయి. ‘‘ఒక కిలో ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొచ్చేవారికి భోజనం, గ్రాములు, కిలోల లెక్కన ప్లాస్టిక్ తీసుకొచ్చేవారికి బ్రేక్‌‌ఫాస్ట్ పెడతాం. ఇలా సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రిసైక్లింగ్​తో పాటు మున్సిపాలిటీ రోడ్లను వేస్తాం. ఇప్పటికే లక్షలకొద్దీ ప్లాస్టిక్ బ్యాగ్‌‌లను సేకరించాం. చాలా ఏరియాల్లో ప్లాస్టిక్​ నిషేధం కూడా విధించాం. ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపించకుండా చేయాలనేది మా ప్లాన్” అని అంటారు అక్కడి అధికారులు. ఢిల్లీ, భువనశ్వేర్​ నగరాల్లోనే కాకుండా, దేశంమొత్తం ఇలాంటి స్కీములు తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు కూడా.

Latest Updates