షాపింగ్ కు వెళ్తే కవర్లు కొనాల్సిందే

ఒకప్పుడు షాపింగ్ చేస్తే.. కంపెనీ వాళ్లే వస్తువుల్ని క్యారీ బ్యాగుల్లో పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏం షాపింగ్ చేసినా.. క్యారీ బ్యాగ్ కి అదనంగా బిల్లు వేస్తున్నారు. బ్యాగు సైజును బట్టి  రేటును ఫిక్స్‌‌ చేస్తున్నారు.  చాలామంది కస్టమర్లు బ్యాగులకు చార్జీ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చెయ్యరు. కానీ, కొందరు కొన్ని సందర్భాల్లో దుకాణదారులతో గొడవ పడుతుంటారు.

చార్జీ చేసుడు కరెక్టే…

2011లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌‌ ప్రకారం ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నిబంధనలకు కొన్ని సవరణలు చేసింది.  ఆ సవరణలలోని 10వ నిబంధన ప్రకారం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిటైలర్లు వినియోగదారులకు ఉచితంగా ప్లాస్టిక్‌‌ క్యారీ బ్యాగులు ఇవ్వనక్కర్లేదు. అందుకుగానూ ఎంతో కొంత చార్జీ చేయాలి. ఆ ధరలను నిర్ణయించడం, ఫిర్యాదులను పరిశీలించే బాధ్యత మున్సిపాలిటీ విభాగాలకు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్లు సొంతంగా ఎవరి సంచులు వాళ్లు తెచ్చుకుంటారని.. తద్వారా ప్లాస్టిక్‌‌ను నియంత్రించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.  అయితే రాను రాను ఈ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.

పైసలిచ్చి మరీ ప్రమోషనా?….

క్యారీ బ్యాగులపై చార్జీలు వేయడం అభ్యంతరకర విషయం కాదు. కానీ.. అదనంగా చెల్లించి కొనుక్కునే ఆ క్యారీ బ్యాగుపై సదరు కంపెనీ లోగో ఉండటమే అసలు సమస్య. అంటే వేలకు వేలు పోసి షాపింగ్‌‌ చేయడంతో పాటు.. అదనంగా డబ్బులు చెల్లించి మరీ క్యారీ బ్యాగుతో ఆ కంపెనీకి ప్రచారం చేస్తున్నారన్న మాట. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లు, వినియోగదారుల ఫోరంలను ఆశ్రయించవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళలోని మూడు ప్రముఖ రిటైల్‌‌ స్టోర్లకు స్థానిక వినియోగదారుల ఫోరం ‘లోగోలు లేని క్యారీబ్యాగుల్ని కస్టమర్లకు అందించాలని’ ఆదేశాలు జారీ చేసింది. చండీగఢ్‌‌లో మొన్నీమధ్యే ఓ ప్రముఖ చెప్పుల షోరూంలో షాపింగ్‌‌ చేసిన ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. క్యారీ బ్యాగు కోసం మూడు రూపాయలు వసూలు చేయడంతో అతను వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ‘క్యారీ బ్యాగుకు డబ్బులు వసూలు చేసినా ఇబ్బంది లేదు. కానీ, దానిపై సంస్థ ఉత్పత్తులను, లోగోను ముద్రించి తప్పు చేశారు. ఇది వినియోగదారులను మోసం చేయడమే’ అని ఫోరం అభిప్రాయపడింది. సదరు వినియోగదారుడికి నష్టపరిహారంతో పాటు క్యారీ బ్యాగ్‌‌ కోసం చేసిన చార్జీ కూడా వెనక్కి ఇచ్చేయాలని ఆ చెప్పుల కంపెనీని ఆదేశించింది.

మన దగ్గర ఎట్లా ఉంది?..

ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నిబంధనల ప్రకారం 2016లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్‌‌ల మందం కంటే తక్కువగా ఉండే ప్లాస్టిక్‌‌ బ్యాగులను ఉపయోగించకూడదనే నిబంధనను విధించింది. దానిని అనుసరిస్తూ..   సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తూ 2018లో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో ఇకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగులు వచ్చి చేరాయి(కొన్ని చోట్ల తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌‌ క్యారీ బ్యాగులు అమ్ముతున్నారు). ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన అవినీతి వ్యతిరేక ఫోరం సభ్యుడొకరు ఆమధ్య ట్విట్టర్‌‌ వేదికగా నిలదీశాడు. చాలా మంది వినియోగదారులు ఆయనకు మద్ధతు ప్రకటించారు. దీనిపై జీహెచ్‌‌ఎంసీ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘ఎంస్‌‌ నెంబర్‌‌ 97 ప్రకారం ప్లాస్టిక్‌‌ బ్యాగులపై చార్జీలు వసూలు చేయొచ్చు. అయితే ప్లాస్టిక్‌‌ ప్రత్యామ్నాయాలపై రుసుము వసూలు చేసే విషయంపై ఎలాంటి విషయాన్ని పేర్కొనలేదు’. అందుకే అవుట్‌‌లెట్‌‌లపై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారాయన.

అదనపు ఆదాయం!….

చిన్న చిన్న దుకాణాలు క్యారీ బ్యాగులను ఉచితంగానే అందిస్తుంటాయి. కొన్ని మాల్స్‌‌ కస్టమర్లు సొంతంగా క్యారీ బ్యాగులు తెచ్చుకోవడాన్ని అనుమతిస్తున్నాయి. ఎటొచ్చి హైపర్‌‌మార్కెట్‌‌ చెయిన్‌‌, డిపార్ట్‌‌మెంట్‌‌ స్టోర్‌‌ చెయిన్‌‌, ఫ్యాషన్‌‌ రిటెయిలర్‌‌లు, కొన్ని ఫుడ్‌‌ కోర్టులు మాత్రమే క్యారీ బ్యాగులపై డబ్బులు వసూలు చేస్తున్నాయి. నిజానికి  రిటైల్‌‌, ఫుడ్‌‌ అవుట్‌‌లెట్స్‌‌ ప్రారంభంలో ఇకో–ఫ్రెండ్లీ పేరిట క్యారీ బ్యాగులను ఉచితంగానే అందించేవి. తర్వాత యథేచ్ఛగా వాటిపై చార్జ్‌‌ చేయడం మొదలుపెట్టాయి. వ్యాపార ధోరణి పెరిగిపోవడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ప్లాస్టిక్‌‌ బ్యాగుల వాడకాన్ని తగ్గించడం మాట అటుంచితే.. క్యారీ బ్యాగుల పేరిట కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయడం  అమ్మకందారులకు ఇప్పుడో కమర్షియల్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌గా మారిందన్నది ఆర్థిక నిపుణుల మాట. అయితే కంపెనీలు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. ‘ప్లాస్టిక్‌‌ను తగ్గించేందుకు పేపర్‌‌, క్లాత్‌‌ బ్యాగులు తయారు చేస్తున్నాం. అయితే వీటిని ఉచితంగా అందించడం అదనపు భారమే అవుతోంది. చాలా మంది రిటైలర్లు సబ్సిడీ, కాస్ట్‌‌ టు కాస్ట్‌‌ బేస్ మీద క్యారీ బ్యాగులను అందిస్తున్నారు’ అని హైదరాబాద్‌‌లోని ఓ ప్రముఖ రిటైల్‌‌ నిర్వాహకుడు చెబుతున్నాడు.

Latest Updates