ఐదు సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్ వేర్

ఎక్స్ రే స్కాన్​తో రూపొందించిన ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ ను ఐదు సెకన్లలో గుర్తించే సాఫ్ట్ వేర్ ను ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ రూపొందించారు. ఎక్స్ రే స్కాన్ ను ఉపయోగించి ఈ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కమల్ జైన్ మీడియాకు వెల్లడించారు. దీనిని ఉపయోగించి సస్పెక్టెడ్ కేసుల నుంచి కేవలం ఐదు సెకన్లలోనే కరోనా వైరస్ ను గుర్తించవచ్చన్నారు. సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడానికి 40 రోజులు పట్టిందని, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. సాఫ్ట్ వేర్ పరిశీలనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ టెస్టులకు ఖర్చును తగ్గించడంతో పాటు, టెస్టులు చేసే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు కూడా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏ మెడికల్ ఇన్​స్టిట్యూషన్ కూడా కమల్ రూపొందించిన సాఫ్ట్ వేర్ ను పరిశీలించలేదు.

కరోనా వైరస్ ను గుర్తించేందుకు న్యుమోనియా, టీబీ రోగులకు ఛాతీలో జరిగే మార్పులపై 60,000 కు పైగా ఎక్స్‌రే స్కాన్‌లను విశ్లేషించిన తరువాత కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ ను అభివృద్ధి చేసినట్లు ప్రొఫెసర్ కమల్ జైన్ వివరించారు. ‘‘కరోనా వైరస్ సోకిన వాళ్లలో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. నేను అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ .. ఊపిరితిత్తులలో రంద్రాలు మూసుకుపోవడం.. ద్రవం ఏర్పడే విధానాన్ని విశ్లేషిస్తుంది. తద్వారా కరోనా వైరస్ వల్లనే జ్వరం వచ్చిందా లేదా అనేది కనిపెట్టవచ్చు. రోగిపై ఇతర బ్యాక్టీరియాల ప్రభావాన్ని కూడా రికార్డు చేయవచ్చు. ఇదంతా ఐదు సెకన్లలో ప్రాసెస్ అవుతుంది”అని కమల్ చెప్పారు. ఇప్పటికే అమెరికాలోని అమెజాన్ యూనివర్సిటీ ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి సాధించలేదని చెప్పారు.

Latest Updates