ఐఐటీ స్టూడెంట్స్​కు ఆఫర్ల వరద

  • 2 రోజుల్లో 4 వేల జాబ్‌‌ ఆఫర్స్‌‌
  • ఐఐటీ స్టూడెంట్స్‌‌కు పండగ
  • ఒక్కో ఐఐటీకి 500 వరకు జాబ్స్‌‌
  • ఖరగ్‌‌పూర్‌‌ ఐఐటీ స్టూడెంట్స్‌‌కు భారీ ప్యాకేజీలు

న్యూఢిల్లీ:

ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదివే నాలుగు వేల మంది స్టూడెంట్స్‌‌ కేవలం రెండు రోజుల్లో ఉద్యోగాలు సంపాదించారు.  పాతతరం ఐఐటీల స్టూడెంట్స్‌‌లో 350 నుంచి 500 మంది వరకు జాబ్స్‌‌ సాధించారు.  ఎక్కువ జీతాలు ఇవ్వడానికి మరిన్ని కోర్‌‌ సెక్టార్‌‌ కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఐఐటీల ప్లేస్‌‌మెంట్‌‌ సెల్స్‌‌ తెలిపాయి. ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌ స్టూడెంట్స్ ఆరు మందికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ లభించింది. మరో 57 మందికి ఏటా రూ.30 లక్షల చొప్పున జీతంతో ఆఫర్ లెటర్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింత మంది రిక్రూట్‌‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్లేస్‌‌మెంట్‌‌ సెల్స్‌‌ చెబుతున్నాయి. ఈ ఐఐటీలో మొదటి రెండు రోజుల్లోనే 500 మంది స్టూడెంట్స్‌‌కు ఆఫర్లు లెటర్లు వచ్చాయి. 715 మందికి ప్రి ప్లేస్‌‌మెంట్‌‌ ఆఫర్లు వచ్చాయి. కోర్‌‌ సెక్టార్‌‌ తరువాత, ఐటీ, ఫైనాన్స్‌‌ సెక్టార్లలో ఎక్కువ మందికి జాబ్స్‌‌ వచ్చాయని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌‌ రామ్‌‌గోపాల్ రావు చెప్పారు. తమ విద్యార్థులు విదేశాల్లో కంటే మనదేశంలో ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడుతున్నారని అన్నారు. ఎక్కువ మంది కోర్‌‌ సెక్టార్లలో జాబ్స్‌‌కు ఇష్టపడుతున్నారని, ఇది ఆర్థికరంగానికి ఎంతో మేలని అన్నారు.

టాప్‌‌ కంపెనీల నుంచే ఎక్కువ జాబ్స్‌‌

మైక్రోసాఫ్ట్‌‌, సోనీ జపాన్‌‌, ఆప్టివర్‌‌, ఉబర్‌‌, ఆక్సెంచర్‌‌ జపాన్‌‌, గూగుల్‌‌, క్వాల్‌‌కామ్‌‌, ఇంటెల్‌‌, శామ్‌‌సంగ్‌‌ వంటి టాప్‌‌ కంపెనీల నుంచి ఐఐటీ స్టూడెంట్స్‌‌కు జాబ్‌‌ ఆఫర్స్‌‌ వచ్చాయి. ఢిల్లీ ఐఐటీలో మైక్రోసాఫ్ట్‌‌ నుంచి 30 మందికి, ఇంటెల్‌‌ నుంచి 27 మందికి జాబ్స్‌‌ వచ్చాయి. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈసారి ఐటీ ఉద్యోగాలు 25 శాతం పెరిగాయి. ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌ నుంచి ఈఎక్సెల్‌‌ 25 మందిని, బార్‌‌క్లేస్‌‌ 20 మందిని, శామ్‌‌సంగ్‌‌ రీసెర్చ్‌‌ 19 మందిని తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు పెరిగాయని బాంబే, రూర్కీ ఐఐటీలు ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్‌‌, ఆప్టివర్‌‌తోపాటు హోండా, సోనీ జపాన్‌‌లు తమ స్టూడెంట్లకు అవకాశాలు ఇచ్చాయని బాంబే ఐఐటీ తెలిపింది.

ముగ్గురికి జాక్‌‌పాట్‌‌

ముగ్గురు రూర్కీ ఐఐటీ విద్యార్థులకు రూ.1.54 కోట్ల ప్యాకేజీలు లభించాయి. అమెరికా కంపెనీ వీరిని నియమించుకుంది. ఇంత భారీ ప్యాకేజీలను ఆఫర్‌‌ చేయడం రూర్కీ ఐఐటీలో ఇదే తొలిసారని సంబంధిత ఆఫీసర్స్‌‌ తెలిపారు. ఈ సంస్థలో తొలిరోజే 406 మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. ఒక విద్యార్థికి రూ.62 లక్షల ఆఫర్‌‌ వచ్చిందని వివరించారు. ఈసారి ప్లేస్‌‌మెంట్‌‌ సెషన్‌‌కు 33 కంపెనీలు వచ్చాయి. ఈసారి ప్లేస్‌‌మెంట్‌‌ డ్రైవ్‌‌ ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. జాబ్స్‌‌ ఇచ్చిన కంపెనీల పేర్లను వెల్లడించడానికి మాత్రం రూర్కీ ఐఐటీ తిరస్కరించింది.

మద్రాస్ ఐఐటీలో 102 మందికి జాబ్స్‌‌

మైక్రోసాప్ట్‌‌, గోల్డ్‌‌మన్‌‌ శాక్స్‌‌, క్వాల్‌‌కామ్‌‌, బాస్టన్‌‌ కన్సల్టింగ్‌‌ గ్రూప్‌‌ వంటి 20 కంపెనీలు మద్రాసు ఐఐటీలో 102 మందికి ఆఫర్‌‌ లెటర్లు ఇచ్చాయి. వీరిలో నలుగురికి విదేశాల్లో ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది మొదటి ప్లేస్‌‌మెంట్‌‌ సెషన్లో 85 మందికి ఆఫర్ లెటర్లు వస్తే, ఈసారి ఈ సంఖ్య 102కి చేరిందని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ నెల ఎనిమిది వరకు తొలిదశ ప్లేస్‌‌మెంట్‌‌ సెషన్‌‌ కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఈ ఏడాది 1,334 మంది ప్లేస్‌‌మెంట్‌‌ కోసం రిజిస్టర్‌‌ చేసుకున్నారని ట్రేనింగ్‌‌ అండ్‌‌ ప్లేస్‌‌మెంట్ సెల్‌‌ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపించడం, జీడీపీ వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఐఐటీల్లో ఈ నెల ఒకటి నుంచి ప్లేస్‌‌మెంట్‌‌ డ్రైవ్స్ మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ వరకు ఇవి కొనసాగుతున్నాయి. ఈ విద్యాసంస్థల్లో జాబ్స్‌‌ పెరుగుతున్నా, దేశవ్యాప్తంగా మాత్రం తగ్గుతున్నట్టు స్టడీ రిపోర్టులు వెల్లడించాయి.

ఐఎస్‌బీల్లో తొలిరోజే 1,383 మందికి…

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) స్టూడెంట్స్‌లో 1,383 మంది ప్లేస్‌మెంట్‌ సెషన్‌ తొలిరోజే జాబ్స్‌ పట్టేశారు. కన్సల్టింగ్‌, టెక్నాలజీ కంపెనీల నుంచి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐఎస్‌బీకి హైదరాబాద్‌, మొహాలీలో క్యాంపస్‌లు ఉన్నాయి. గత ఏడాది ఫైనల్‌ ప్లేస్‌మెంట్ సెషన్‌లో 1,194 మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి. జీతం ప్యాకేజీ సగటు రూ.26.14 లక్షల వరకు ఉందని ఐఎస్‌బీ తెలిపింది. మొత్తం జాబ్స్‌లో కన్సల్టింగ్‌ కంపెనీలది 22.75 శాతం వాటా కాగా, ఐటీ, ఐటీసేవల కంపెనీలది 15 శాతం వాటా ఉంది.  చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఆక్సెంచర్‌, అల్వారెజ్‌ అండ్‌ మార్సల్‌, ఏటీ కియర్నీ, బేన్‌ అండ్‌ కంపెనీ, బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, డాల్బర్గ్‌, డెలాయిట్‌ ఇండియా, పీడబ్ల్యూసీ డీఐఏసీ, పీడబ్ల్యూసీ ఇండియా, రోలండ్‌ బెర్జర్‌, సీమెంట్స్‌ కన్సల్టింగ్‌, జెడ్‌ఎస్‌ అసోసియేట్స్‌ వంటి కన్సల్టింగ్‌ కంపెనీలు 314 ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఇన్‌మొబి, అమెజాన్‌, ఉబర్‌ నుంచి కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు వచ్చాయి.

Latest Updates