టాలెంట్ లేకే సంగీతం కాపీ కొడుతున్నారు: ఇళయరాజా ఫైర్

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా .. తను కంపోజ్ చేసిన సంగీతాన్ని ఇతరులు వాడటంపై  మరోసారి సీరియస్ గా స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. క్రియేటివిటీ లేక.. చేతకాకపోవడం వల్లే… తన పాటలను.. తన సంగీతాన్ని ఇప్పటికీ కొందరు తమ సినిమాల్లో వాడుకుంటున్నారని ఇళయరాజా అన్నారు.

గతేడాది తమిళంలో విజయ్ సేతుపతి- త్రిష కాంబినేషన్ లో 96 పేరుతో సినిమా రిలీజై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో.. హీరో, హీరోయిన్లు పలు సందర్భాల్లో విడిపోయి కలుస్తుంటారు. వీరికి పాటలతో అటాచ్ మెంట్ ఉంటుంది. సింగర్ జానకి అంటే.. హీరోయిన్ కు అభిమానం. 1980ల్లో… ఇళయరాజా సంగీతంలో ఎస్ జానకి పాడిన పాటలు పలుమార్లు వినిపిస్తుంటాయి. ఆ పాటలు వచ్చిన సందర్భాల్లో.. ప్రేమ పుట్టడం..  హీరో,హీరోయిన్లు రీ-యునైట్ అవ్వడం జరుగుతుంటుంది. దీన్నే ఇళయరాజా తప్పుపడుతున్నారు.

“1980ల నాటి పరిస్థితులను గురించి చెప్పినప్పుడు.. ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడైతే.. అప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఓ పాటను పెట్టి.. ఆ పాటనే సినిమాలో వాడుకోవాల్సింది. నా పాటలను వాడుకోవాల్సిన అవసరం ఏముంది. క్రియేటివిటీ లేదు కాబట్టే… నా పాటలను మార్పు చేసివాడుకున్నారు. యాదోంకీ బారాత్ అనే హిందీ మూవీలో… కుటుంబసభ్యులు విడిపోయి కల్సుకునేటప్పుడు ఒకే పాటను పాడుకుంటుంటారు. అలా.. సొంతంగా మంచి పాటలను ట్యూన్ చేసుకోవాలి. వేరొకరి సంగీతాన్ని కాపీ కొట్టడం ఎందుకు” అని ఇళయ రాజా ప్రశ్నించారు.

“ఒకరి సంగీతాన్ని ఇంకొకరు వాడుకుంటున్నారంటే.. అతడు ఫెయిలైనట్టే లెక్క. కానీ ఈ రోజుల్లో అదే జరుగుతోంది. కనీసం క్రెడిట్ కూడా ఇవ్వకుండా వేరొకరి పాటలను వాడుకుంటున్నారు” అని అన్నారు ఇళయరాజా.

96 సినిమాకు గోవింద్ వసంత మ్యూజిక్ అందించారు. ఈ మూవీలోని ఫీల్ గుడ్ మ్యూజిక్ చాలామందిని ఆకట్టుకుంది. కాదలే కాదలే BGM ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.

ఇళయరాజా భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ రారాజు. సంగీతాభిమానులను ఉర్రూతలూగించే పాటలు, మనసుదోచే మెలోడీలు అందించిన సంగీత బ్రహ్మ. ఆయన చేసినన్ని వెరైటీలు, సూపర్ హిట్ పాటలు ఎవరూ కంపోజ్ చేయలేదు. ఎంతోమంది ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఐతే.. తనకు క్రెడిట్ ఇవ్వకుండా.. అనుమతి లేకుండా.. తనకు ప్రతిఫలం ఇవ్వకుండా తన పాటలను వాడుకోవడాన్నీ తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇళయరాజా.

తన స్నేహితుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయ రాజా మధ్య గతంలో ఇదే విషయంలో గతంలో పెద్ద గొడవ జరిగింది. మ్యూజికల్ షోలలో తన పాటలను బాలసుబ్రహ్మణ్యం కమర్షియల్ గా వాడుకుంటున్నారనీ..  నోటీసులు కూడా పంపారు. బాలు బదులివ్వడంతో.. ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా ఇళయరాజా చేసిన కామెంట్స్ మ్యూజిక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఈ మొత్తం వివాదంపై 96 టీమ్ సోషల్ మీడియాలో స్పందిస్తోంది. తాము వాడుకున్న పాటలకు ఇళయరాజాకు రాయల్టీ చెల్లించామనీ.. క్రెడిట్ ఇచ్చామని కొందరు చెబుతున్నారు.

Latest Updates