ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్

హైదరాబాద్‍, వెలుగుఅదో రేకుల షెడ్డు. అక్కడ 10 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. నడిచేందుకు సరైన స్థలం లేదు. పడుకోవాలన్నా ఇబ్బందే. నాసిరకం కూరగాయాలతో వంట. జబ్బు చేస్తే నిర్వాహకులు ఇచ్చిన మందులే దిక్కు. తుకారారం గేట్ సమీపంలోని ఓ వృద్ధుల ఆశ్రమాన్ని ఇటీవల తనిఖీ చేసిన అధికారులకు కనిపించిన దృశ్యాలివి. అధికారులు వెంటనే ఆ ఆశ్రమాన్ని సీజ్‍ చేసి అక్కడి వృద్ధులను ఇతర గుర్తింపు పొందిన ఓల్డేజ్ హోమ్ కి తరలించారు. సిటీలో ఇల్లీగల్ గా నడిచేసే వృద్ధాశ్రమాలు పుట్టుకొచ్చాయి. వికలాంగుల, వయోవృద్ధుల శాఖాధికారుల నుంచి అనుమతి తీసుకున్న ఆశ్రమాలు సిటీలో 50 కూడా ఉండవని అధికారులు చెబుతున్నారు. సుమారు 200కు పైగా వృద్ధాశ్రమాలు ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు.

ప్రైవేట్ సంస్థలు, దాతల నుంచి నిధులు

సిటీలో ఎక్కువ శాతం వృద్ధాశ్రమాలను ఎలాంటి రిజిస్ట్రేషన్, ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి రిజిస్ట్రేషన్‍ తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆశ్రమాలను గుర్తించి వాటికి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్‍ చేయించుకునేందుకు వీలుగా కొంత గడువు ఇస్తామన్నారు. అయినా రిజిస్ట్రేషన్‍ చేయించుకునేందుకు ముందుకు రాని వాటికి సెక్షన్ 19(14) ప్రకారం రూ.25 వేలు ఫైన్ విధిస్తామంటున్నారు. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు.  కొన్ని ప్రైవేట్ సొసైటీ/టస్ట్ లు వృద్ధుల ఆశ్రమాల పేరిట ప్రైవేట్‍ సంస్థలు, దాతల నుంచి భారీగా నిధులు సేకరిస్తున్నారు. ఆయా ఆశ్రమాల్లోని వృద్ధులకు సరైనా సేవలు అందించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. పైగా ప్రభుత్వం వృద్ధులకు అందించే ఆసరా ఫించన్‍ను సైతం ఆశ్రమ నిర్వాహకులే తీసుకుంటున్నట్లు గతంలో కొందరు ఫిర్యాదు చేశారన్నారు.

గుర్తింపుతో లాభాలెన్నో

వృద్ధుల ఆశ్రమాలను ఏర్పాటు చేసే ప్రైవేట్‍ సొసైటీలు, ట్రస్ట్ లు వయోవృద్ధుల చట్టం 2007, 2011 ప్రకారం తప్పనిసరిగా జిల్లా వయోవృద్ధుల శాఖలో రిజిస్ట్రేషన్‍ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‍కు అప్లయ్ చేసుకున్న వారి  అప్లికేషన్లలో పేర్కొన్న ఆశ్రమాలను గ్రౌండ్ లెవెల్ లో పరిశీలించాకే అనుమతి పత్రం జారీ చేస్తారని వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వయోవృద్ధులకు సేవలు చేసే వారు అవసరమైన సాయాన్ని పొందేందుకు రిజిస్ట్రేషన్‍ సర్టిఫికేట్‍ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అదే విధంగా పలు కంపెనీలు అందించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ(సీఎస్ఆర్) నిధులను పొందేందుకు అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో ఆశ్రమ విస్తరణకు, మెయింటెనెన్స్ కు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన ఫండ్స్, భూమిని పొందేందుకు అప్లే చేసుకునేందుకు ఆశ్రమాలకు రిజిస్ట్రేషన్‍ తప్పనిసరి అని అధికారులు చెప్పారు. వృద్ధాశ్రమాల నిర్వహణకు రూల్స్ ఉన్నాయని వాటిని అందరూ పాటించాలన్నారు. వృద్దులకు సరైన సేవలు అందియడంలో తేడాలు ఉంటే ఆయా ఆశ్రమాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ ఇట్ల ఉండాలె..

మేనేజ్ మెంట్ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ పొందేందుకు ఒక ట్రస్ట్ లేదా సొసైటీ ద్వారా ఇంతకు ముందు పొందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. 3 ఏండ్ల అడిట్ రిపోర్టుతో పాటు రెంటెడ్ హౌస్ లో ఆశ్రమం ఉంటే రెంటర్ అగ్రిమెంట్,మేనేజింగ్‍ కమిటీకి బైలాస్ ఉండాలి. ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుల, పనిచేసే ఉద్యోగుల వివరాలతో కూడిన పత్రాలతో పాటు ఏడీ,వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ పేరిటరూ.100 డీడీ తీసి నాంపల్లిలోని ఆఫీసులో ఈ నెల 29లోగా అప్లయ్ చేసుకోవాలి.

సిటీలో ఆశ్రమాల లెక్క తీస్తున్నం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోవృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు రిజిస్ట్రేషన్‍ చేయించుకోవాలి. కానీ దీనిపై చాలా మంది సొసైటీలు, ట్రస్ట్ లకు అవగాహన లేదు. జిల్లాలో మొత్తం ఎన్ని వృద్ధాశ్రమాలున్నాయో లెక్కతీస్తున్నాం. ముందుగా గుర్తింపు లేని వాటికి నోటీసులు జారీ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‍ చేసుకునేందుకు వీలుగా 15 రోజుల గడువు ఇస్తాం. అయినా ముందుకు రాకపోతే నిబంధనల ప్రకారం ఫైన్‍ వేస్తాం. – బీపీ పుష్పలత, ఏడీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేశాఖ, హైదరాబాద్‍ జిల్లా

Latest Updates