నేను ఇందిరా గాంధీ మనవరాలిని.. బీజేపీ ప్రతినిధిని కాను

యూపీ ప్రభుత్వంపై మండిపడిన ప్రియాంక గాంధీ వాద్రా
న్యూఢిల్లీ: తాను ఇందిరా గాంధీ మనవరాలినని, కొందరు ప్రతిపక్ష నేతల మాదిరిగా అప్రకటిత బీజేపీ ప్రతినిధిని మాత్రం కానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. నిజాలు చెబుతున్నందుకే వివిధ డిపార్ట్‌మెంట్స్‌తో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తనను బెదిరించడానికి యత్నిస్తోందని ఆమె ఆరోపించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చేసిన విమర్శలను 24 గంటలలోగా వెనక్కి తీసుకోవాలని ఆగ్రా అడ్మినిస్ట్రేషన్ ప్రియాంకను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక దీనిపై ఘాటుగా స్పందించారు. ‘ఓ పబ్లిక్ సర్వెంట్‌గా ఉత్తర్‌‌ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం నా కర్తవ్యం. దీంట్లో భాగంగా ప్రజల ముందు నిజాలను ఉంచాల్సిన బాధ్యత నాపై ఉంది. కానీ ప్రభుత్వం గురించి ప్రచారం చేయడం మాత్రం నా పని కాదు. వివిధ శాఖల ద్వారా నన్ను బెదిరిస్తూ యూపీ గవర్నమెంట్ తన టైమ్‌ను వృథా చేసుకుంటోంది. కావాలంటే వాళ్లు నా మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ నేను ప్రజల ఎదుట నిజాలను బయటపెడుతూనే ఉంటా. నేను ఇందిరా గాంధీ మనవరాలినే కానీ కొందరు ప్రతిపక్ష లీడర్లలా అప్రకటిత బీజేపీ ప్రతినిధిని ఎంతమాత్రం కాదు’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.

Latest Updates