భార‌త్‌పై నేపాల్ ప్రధాని ఆరోప‌ణ‌లు.. ఆట‌లు సాగ‌వంటూ కామెంట్స్

నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ అధికార ప‌క్ష‌మైన‌ నేపాల్ క‌మ్యూనిస్టు పార్టీనే డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న భార‌త్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. కేపీ శ‌ర్మ ఏ ఒక్క ప‌నినీ స‌క్ర‌మంగా చేయ‌లేద‌ని, ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నేపాల్ క‌మ్యూనిస్టు పార్టీ అధినేత ప్ర‌చండ ఇటీవ‌లే డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న‌ను ప‌ద‌వి నుంచి దించేయాల‌ని భార‌త్ కుట్ర‌లు చేస్తోంద‌ని, ఈ ఆట‌లు సాగ‌వని కామెంట్స్ చేశారు. ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించ‌డం అసాధ్యమ‌ని అన్నారు. ఒక హోట‌ల్‌లో త‌న‌ను దించేసేందుకు మీటింగ్స్ న‌డుస్తున్నాయ‌ని, ఇందులో భార‌త ఎంబ‌సీ కూడా యాక్టివ్‌గా ఉంద‌ని ఆరోపించారు కేపీ శ‌ర్మ‌. త‌న ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, నేపాల్‌లో ఉన్న భార‌త రాయ‌బార కార్యాల‌యం ఈ పనిలోనే ఉంద‌ని అన్నారు. భార‌త భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల‌ను నేపాల్‌కు చెందినవంటూ మ్యాప్ రూపొందించి.. దానిపై రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసిన ఓలీ.. ఈ మ్యాప్ రూప‌క‌ల్ప‌న వ‌ల్లే భార‌త్ త‌న ప్ర‌భుత్వాన్ని కూల‌దోయాల‌నుకుంటోంద‌ని ఆరోపించారు. ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి త‌న‌ను తొలగించాల‌ని బ‌హిరంగంగానే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. అయితే ఒక మ్యాప్ రూప‌క‌ల్ప‌న కార‌ణంగా ప్ర‌ధానమంత్రిని ప‌ద‌వి నుంచి తొల‌గింపు జ‌రుగుతుంద‌ని అనుకోవ‌డం లేద‌న్నారు.

Latest Updates