పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ పెట్టుకోకుంటే రెండేళ్ల జైలు శిక్ష: చట్టం చేసిన ఆఫ్రికన్ కంట్రీ

కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ఇప్పటికి అందుబాటులోకి వస్తుందో ఎవరికీ తెలియదు. అది రెడీ అయ్యే వరకు కరోనాకు మన చేతుల్లో ఉన్న వ్యాక్సిన్స్ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం. వీటిపై అన్ని దేశాలు పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అయినా సరే కొంత మంది ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణ కోసం పెట్టిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల పాటు జైలు జీవితం గడపడానికి సిద్ధపడాలని ఆఫ్రికన్ కంట్రీ ఇథియోపియా హెచ్చరిస్తోంది. ఆ దేశంలో ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో మాస్కు పెట్టుకోకపోయినా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఫైన్‌తో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం చేసింది. కరోనా నియంత్రణకు విధించిన అత్యవసర పరిస్థితిని తొలగించడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని, ఈ నేపథ్యంలోనే కొత్త చట్టం తెచ్చామని ఆ దేశ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది.

ఇథియోపియాలో ఇప్పటి వరకు 91 వేల కరోనా కేసులు నమోదయ్యాయని, అదులో 1384 మంది మరణించగా, 44 వేల మంది రికవరీ అయ్యారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి లియా టాడెస్సె తెలిపారు. అయితే దేశంలో అసలు కరోనా అనేదే లేదన్న తీరులో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీని వల్ల వైరస్ వ్యాప్తి పెరిగి దేశమే పెను ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ రకమైన అలసత్వాన్ని కంట్రోల్ చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

Latest Updates