పాపం పసివాడు.. ఈడ్చుకెళ్తున్నా పిట్టను వదల్లేదు

వయసులో చాలా చిన్నోడే. కానీ, మనసు మాత్రం చాలా పెద్దది. అందుకే గూడు చెదిరినా.. పిట్టను వదల్లేదు. పుట్టెడు దు:ఖంలోనూ తన ప్రేమను ప్రదర్శించాడు. ఇంటర్నెట్‌‌లో కన్నీళ్లతో నిండిన ఓ పదేళ్ల కుర్రాడి ఫొటోలు వైరల్‌‌ అవుతున్నాయి.  ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? అతనికి వచ్చిన కష్టమేంటో చూడండి.

ఆ పిల్లాడి పేరు ఆదిత్యన్‌‌.  ఊరు కేరళలోని త్రిస్సూర్‌‌ జిల్లా కున్నంకులం టౌన్‌‌.  ఆదిత్యన్ తండ్రి మధురన్‌‌చెర్రీ బెన్నీ 2004లో డిస్ట్రిక్ట్​ కో–ఆపరేటివ్‌‌ బ్యాంక్‌‌ నుంచి ఇంటి డాక్యుమెంట్లు తాకట్టుపెట్టి లోన్‌‌ తీసుకున్నాడు. టైంకి లోన్‌‌ని తీర్చకపోవడంతో ఇంటిని వేలంపాట వేయాలని కోర్టు ఆదేశించింది. ఆక్షన్‌‌లో ఎర్నాకుళానికి చెందిన ఒక వ్యక్తి ఆ ఇంటిని దక్కించుకున్నాడు.  మంగళవారం అధికారులు ఆ ఇంటిని ఖాళీ చేయించేందుకు వచ్చారు. ఆ టైంలో మధురన్‌‌, అతని భార్య ఇంట్లో లేరు. ఆదిత్యన్‌‌, అతని ఇద్దరు అన్నలు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎంతకీ ఇంటి నుంచి కదలకపోవడంతో పోలీసులు బలవంతంగా ఇంట్లోంచి బయటకు లాక్కెళ్లారు. ఆ టైంలో ఆ పిల్లాడికి ఇంట్లో పెంచుకునే తన పిట్ట గుర్తుకు వచ్చింది.  పోలీసులను తోసుకుంటూ లోపలికి వెళ్లి ఆ పిట్టను తన చేతులో జాగ్రత్తగా బయటకు తెచ్చాడు.  పోలీసులు ఈడ్చుకెళ్తున్నా ఆ పిట్టను మాత్రం ఆ చిన్నారి వదల్లేదు.  ఆ టైంలో ఫిలిప్‌‌ జాకబ్‌‌ అనే జర్నలిస్ట్‌‌ అక్కడే ఉన్నాడు. ఆదిత్యన్ ఫొటోల్ని తీసి ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేశాడు జాకబ్‌‌.

మొండి పిలగాడు

పోలీసులు ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చిన టైంలో ఆదిత్యన్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. అంతేకాదు తలుపు కింది నుంచి కిరోసిన్‌‌ పోసి నిప్పు అంటిస్తానని భయపెట్టించాడు.  కానీ, పోలీసులు ఆ డోర్లను పగలగొట్టి పిల్లల్ని బయటకు ఈడ్చేశారు.  ఆ చిన్నారి ఫొటోలు చాలా మందిని కదిలించాయి. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమ డ్యూటీ తాము చేశామని పోలీసులు చెప్తున్నారు.

 

Latest Updates