ఐడియా అదిరింది..హుస్సేన్ సాగర్లో ‘ఎందుకు‘ ఆర్ట్

హైదరాబాద్, వెలుగు:  వరల్డ్ డిజైన్ అసెంబ్లీ–2019లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరంల సహకారంతో, ఏషియన్ పెయింట్స్ తో కలిసి  స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్ అర్బన్ ఆర్ట్ ఇన్ స్టాలేషన్ ను నగరానికి తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో ప్రస్తుతం 150 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. నానాటికి వేగంగా పెరుగుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, స్ట్రీట్ ఆర్టిస్ట్ అయిన డాకూ3 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి హుస్సేన్ సాగర్ లో “ఎందుకు” అనే అర్ధం వచ్చే విధంగా భారీ ఆకారంలో ? రూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్ సౌరశక్తి ద్వారా సొంతంగా పవర్ ని జనరేట్ చేసుకుని నైట్ టైంలో మెరుస్తుంది. ఈ ఆకారాన్ని హుస్సేన్ సాగర్ జలాలపై ఒక నెలరోజుల పాటు ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఉంచారు. ఈ సందర్భంగా స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్ సహ-వ్యవస్థాపకులు, క్యూరేటర్ గియులియా అంబ్రోగి మాట్లాడుతూ విస్త్రృత స్థాయిలో ప్రభావం చూపించేది కళ అని అన్నారు. నగరంలోని మక్తా ప్రాంతంలో 2016 నుంచి తాము స్ట్రీట్ ఆర్ట్ పై పనిచేస్తున్నామని, అప్పటి నుంచి హుస్సేన్ సాగర్ ని చూసిన ప్రతిసారి దాన్నొక సందేశాత్మకమైన ప్రాంతంగానే చూసేవారమని తెలిపారు. సామాజిక పరమైన సందేశాలను ఎంతో బలంగా, ప్రత్యక్షంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వ్యాపింపజేయాలని అనుకున్నామని, అది హైదరాబాద్ డిజైన్ సందర్భంగా నెరవేరిందని తెలిపారు.

Latest Updates