లక్కీ డ్రా పేరిట మోసాలు..జోరుగా నెలవారి స్కీముల దందా

  • డబ్బులు కట్టించుకుని చేతులెత్తేస్తున్న నిర్వాహకులు
  • అరికట్టాలని కోరుతున్న ప్రజలు

కామారెడ్డి జిల్లాలో లక్కీ డ్రా స్కీముల పేరిట కొందరు ప్రజల నుంచి నెలవారీ డబ్బులు వసూలు చేస్తూ, తిరిగి చెల్లించకుండా మోసం చేస్తున్నారు. ప్రైజుల ఆశచూపి లక్షల్లో వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇలాంటివి 25 వరకు స్కీములు ఉండగా ఇటీవల ఇద్దరిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంగా మూడు నెలలపాటు నెలకు రూ.10వేల చొప్పున మొత్తం రూ.30వేలు చెల్లిస్తే 8 నెలల్లో రూ.80వేలు ఇస్తామని నమ్మబలికి  వందలాది మంది నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. కరోనా ప్రారంభమైన తర్వాత సంస్థ కార్యకలాపాలు ఆగిపోవడంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే  కొత్తగా మరి కొన్ని లక్కీ డ్రా స్కీమ్‌లు జిల్లాలో కొనసాగుతున్నట్లు తెలిసింది.

జిల్లాకేంద్రంలోనే 10..

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ తదితర ఏరియాల్లో ఈ స్కీములు 25కు పైగా ఉన్నాయి. ఒక్క జిల్లాకేంద్రంలోనే 10 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

లక్కీ డ్రా స్కీమ్‌ ఎలాగంటే..

ముగ్గురు, నలుగురు వ్యక్తులు కలిసి ఇలా ఓ స్కీమ్‌ ప్రారంభిస్తున్నారు. ఒక్కో స్కీమ్‌లో వెయ్యి నుంచి1500 మందిని సభ్యులుగా చేరుస్తున్నారు. 12 నుంచి 16 నెలల పాటు స్కీమ్‌ ఉంటుంది. ఇందులో చేరిన మెంబర్ ప్రతీ నెల రూ.1100 చొప్పున చెల్లించాలి.  ప్రతీ నెల డ్రా తీసి మెంబర్లకు ప్రైజులు ఇస్తారు. ప్రతీ మెంబర్‌‌కు తప్పకుండా ఒక ప్రైజ్‌ వస్తుందని ప్రచారం చేస్తూ జనాలను చేరుస్తున్నారు. ​ వెయ్యి మంది మెంబర్లు ఉన్న గ్రూప్‌లో ప్రతీ నెల రూ.11 లక్షల మేర సొమ్ము జమ చేస్తారు. మెంబర్లను ఆకర్షించేందుకు కొన్ని ఎక్కువ రేట్లు ఉండే ప్రైజులు పెట్టి, మిగతావన్నీ తక్కువ కాస్ట్​ గిఫ్ట్స్​ పెడుతున్నారు.  అదృష్టం వరిస్తుందేమోనని చాలా మంది ఇందులో చేరుతున్నారు.

కమిషన్‌ ఇస్తూ..

నిర్వాహకులు ఏరియాలవారీగా ఏజెంట్లను నియమించుకుని, వారికి కమీషన్‌ ఇచ్చి  గ్రామాల్లో సభ్యులను చేర్పిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో అందులో ఏజెంట్లుగా పని చేసినవారు ఇప్పుడు వీటి కోసం పని చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఇలా పెద్ద సంఖ్యలో  ప్రజలు చేరారు.
ఇంత పెద్ద మొత్తంలో  నిబంధనలకు విరుద్ధంగా స్కీములు నిర్వహిస్తున్నా పోలీసులు మాత్రం అడ్డుకోవడం లేదు.

తాజాగా ఇద్దరిపై కేసు..

కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ  వెంచర్‌‌లో ఓ లక్కీ డ్రా స్కీమ్‌ నిర్వాహకులు కొంత మందిని పోగుచేసి డ్రా తీశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో స్పెషల్ టీమ్‌ను అక్కడకు పంపారు. నిర్వాహకుల్లో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇందులో కొందరు కింది స్థాయి లీడర్ల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు చొరవ చూపి స్కీములను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Latest Updates