బంగారు తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు: రేవంత్ రెడ్డి

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్.. బొందలగడ్డ తెలంగాణ, బాకీల తెలంగాణ గా మార్చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యి ఏడాది పూర్తయిందని, ఆయన పరిపాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విషాదంలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణకు ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, రుణమాఫీ సహా అన్ని అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేసీఆర్ ఇంకా ప్రజల్ని మభ్య పెట్టె ప్రయత్నమే చేస్తున్నారని, ఆరేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత పెరిగాయో ప్రజలకు తెలుసన్నారు.

ప్రాజెక్టుల పేరుతో దండుకున్న డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయి, ప్రతి ఇంటికి తాగునీరు పేరుతో ఎలా దోపిడీకి పాల్పడ్డారన్నది అందరికీ తెలియాలన్నారు రేవంత్.  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయన్నారాయన. రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం పట్టించుకోవడం లేదని అన్నారు. ఒక్క లిక్కర్ అమ్మకాల్లో మాత్రమే తెలంగాణ అత్యంత ప్రగతి సాధించిందని చెప్పారు. మద్యం కంపెనీల కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైందని, మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.

Latest Updates