ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే క‌రోనా టెస్టు: ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్‌తో బీఎంసీ ఆదేశం

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌మ‌వ‌డంతో స్థానిక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టెస్టుల విష‌యంలో ఉన్న అవ‌రోధాన్ని తొల‌గిస్తూ బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఉత్త‌ర్వులు జారీ చేసింది. అనుమానితుల‌కు డాక్ట‌ర్ ప్రిష్క్రిప్ష‌న్‌తో ప‌ని లేకుండా క‌రోనా ప‌రీక్ష‌లు చేసేలా ఆదేశాలిచ్చింది. క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుండానే అసింప్ట‌మేటిక్ కేసులు న‌మోద‌వుతున్న వేళ త‌మ‌కు వైర‌స్ సోకిందేమోన‌న్న అనుమానం ఉన్న వారు టెస్టు చేయించుకునేందుకు వీలు క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ ఉన్న‌వారికి, సింప్టమ్స్ ఉన్న‌వారికి, వైర‌స్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన హైరిస్క్ వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ప‌రీక్ష‌లు చేస్తున్నాయి అన్ని ప్ర‌భుత్వాలు. అయితే ఇటీవ‌లే భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) క‌రోనా టెస్టుల విష‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. టెస్టింగ్ సామ‌ర్థ్యం పెంచుకుని, డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్‌తో ప‌ని లేకుండానే అనుమానితుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించింది. ఈ నేప‌థ్యంలో కరోనా సోకిందేమోన‌న్న అనుమానం ఉన్న ఎవ‌రైనా స‌రే శాంపిల్స్ ఇచ్చి టెస్టు చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు బీఎంసీ క‌మిష‌న‌ర్ ఐఎస్ చాహ‌ల్. టెస్టుల‌కు వ‌చ్చ‌చే వారికి 24 గంట‌ల్లోనే రిజ‌ల్ట్ తెలియ‌జేయాని అన్నారు. ఇప్ప‌టికే ముంబై సిటీలోని ప్ర‌తి ఒక్క‌రికీ టెస్టు చేయాల‌న్న ల‌క్ష్యంతో మిష‌న్ యూనివ‌ర్స‌ల్ టెస్టింగ్ కా‌ర్య‌క్ర‌మాన్ని జూన్ 23న లాండ్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ముంబైలో ఇప్పటి వ‌ర‌కు మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా టెస్టులు చేసిన‌ట్లు చెప్పారు. తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో టెస్టుల సంఖ్య భారీగా పెర‌గ‌నుంద‌ని ఆయ‌న అన్నారు

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 7,19,665 మంది క‌రోనా బారినప‌డ్డారు. అందులో 4,39,948 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 2,59,557 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 2,11,987 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇందులో ఒక్క ముంబైలోనే 85 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.

Latest Updates