నాగన్న హోటల్ ను మెచ్చుకున్న సినీ ప్రముఖులు

‘నాణ్యతే నమ్మకాన్ని నిలబెడుతుంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది’ అంటాడు నాగన్న. దానికి తగ్గట్టు గానే హోటల్ దగ్గర పెద్ద బోర్డులు, అలంకరణలు కనిపించవు. సాధారణ కుర్చీలు, టేబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ తిని వెళ్లిన వాళ్లే ఇతరులకు చెబుతున్నారు. జాతీయ రహదారి కావడంతో పాటు దగ్గర్లో కూసుమంచి గణపేశ్వరాలయం ఉండటం వల్ల నాగన్న హోటల్ కు గిరాకీ ఉంటోంది. ఈ హోటల్ ఖమ్మం, హైదరాబాద్ రహదారిలో కూసుమంచి చౌరస్తా దగ్గర ఉంది. ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్లలో చాలామంది ఇక్కడే భోజనం చేస్తుంటారు. రోజుకు దాదాపు వెయ్యి మంది భోజనం చేస్తుంటారంటే.. ఇక్కడి రుచికి కస్టమర్లు ఎంత ఫిదా అయ్యారో అర్థం అవుతుంది.

మొదట్లో గుడిసెలో…

ఈ హోటల్ వ్యవస్థాపకుడు బెల్లంకొండ నాగన్న. 1995 ఫిబ్రవరి 12న రహదారికి పక్కన చిన్న గుడిసెలో హోటల్ ప్రారంభించారు. హోటల్ యజమాని అయినా.. మొదట్లో నాగన్నే స్వయంగా భోజనం వడ్డించేవాడు. కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బందిని నియమించుకున్నాడు. నాగన్నకు భార్య మణెమ్మ, కూతుళ్లు మంజుల, గాయత్రి, కొడుకు వెంకట రామకృష్ణ ఉన్నారు .

ప్రారంభంలో కష్టాలు….

‘ఇరవైకి పైగా నాణ్యమైన కూరలుంటాయనే ప్రచారమే ఈ హోటల్ కు పేరు తెచ్చింది. కూరగాయల రేట్లు పెరగడం, ఖర్చులకే డబ్బులు మిగలడం.. లాంటి చాలా కారణాలతో ప్రారంభంలో నష్టాలొచ్చాయి. అంతేకాదు కస్టమర్లకు తగ్గట్టు గా హడావిడిగా వండటం కూడా మొదట్లో కష్టంగా ఉండేదన్నాడు నాగన్న. అయితే, ప్రణాళికాబద్ధం గా హోటల్ ని నడిపించడం వల్ల ఇబ్బందులు తగ్గాయట. సినీనటులు రవితేజ, తొట్టెంపూడి వేణు, తనికెళ్ల భరణి, దర్శకుడు వంశీ.. లాంటి ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ హోటల్ లో భోజనం చేసి, వంటకాలను మెచ్చుకున్నారు.

Latest Updates