
- 13 చోట్ల పోటీ చేసినా.. ముగ్గురే గెలిచిన్రు
- ఏడు సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్
చండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అంత ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై బయటికొచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. పంజాబ్లో మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా బరిలోకి దిగాయి.
కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకున్నది. శిరోమణి అకాలీ దళ్ ఒక స్థానంలో, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానా, చండీగఢ్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. అధికారంలో ఉన్న పంజాబ్లో మాత్రం ఒంటరిగా పోటీ చేశాయి.
అదేవిధంగా అస్సాంలో కూడా రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టాయి. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని అమిత్ షా కూల్చేస్తారంటూ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. రిజర్వేషన్లు, బీజేపీ అవినీతి, అక్రమాలను కేజ్రీవాల్ ప్రజలకు వివరించారు. ఈడీ, సీబీఐతో కలిసి తనను లిక్కర్ స్కామ్లో ఇరికించారంటూ ప్రచారం చేశారు. మోదీ నియంతృత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు.
పంజాబ్ సమస్యలు లోక్సభలో ప్రస్తావనకు రావాలంటే ఆప్ లీడర్లను గెలిపించాలని కోరారు. 13 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను గెలిపించాలని ఓటర్లను విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాలు దక్కించుకోలేకపోయింది. చివరికి కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.