13 లక్షల కుటుంబాలకు రూ.1500 అందలే

హైదరాబాద్, వెలుగు:లాక్‌‌డౌన్​తో పని కోల్పోయిన పేదల కనీస అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500 సాయం 13 లక్షల కుటుంబాలకు అందలేదు. రాష్ట్రంలో 87.54 లక్షల తెల్ల రేషన్‌‌ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి 12 కేజీల చొప్పున బియ్యం ప్రభుత్వం అందజేసింది. ఇందులో 74.59 లక్షల కార్డుదారుల ఖాతాల్లో రూ.1,500 చొప్పున ఇప్పటికే జమ చేసింది. ఇందుకు రూ.1,119 కోట్లు ఖర్చు చేసింది. అయితే అకౌంట్​ను ఆధార్​తో లింక్ చేసుకోని వారికి పైసలు పడలేదు. వారికి నేరుగా నగదు ఇచ్చేందుకు రూ.78.24 కోట్లు పోస్టల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది.

పోస్టాఫీసుల ద్వారా నగదు అందజేసే వారి వివరాలను సంబంధిత రేషన్‌‌ షాపుల్లో సివిల్‌‌ సప్లయీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు డిస్‌‌ప్లే చేశారు. మే నెలలో రేషన్‌‌ ఇచ్చేటప్పుడు బ్యాంకు అకౌంట్లతో వారి ఆధార్‌‌ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా నగదు సాయం అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌‌ శనివారం తెలిపారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలోని పోస్టాఫీసుల్లో 24 గంటలపాటు నగదు తీసుకునే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. రేషన్‌‌ షాపులోని లిస్టులో ఎవరి పేరు ఉందో వారికి మాత్రమే నగదు ఇస్తారని, ఈ సమయంలో రేషన్‌‌కార్డు, ఆధార్‌‌ కార్డు తప్పనిసరిగా చూపించాలన్నారు.

పేషెంట్లకు తిప్పలే

కొందరు కార్డుదారులు ఆరోగ్య సమస్యలతో మూడు నెలలుగా రేషన్‌‌ తీసుకోలేదు. దీంతో వారి కార్డులను హోల్డ్‌‌లో పెట్టారు. కార్డులు హోల్డ్‌‌లో ఉన్న వాళ్లు రేషన్‌‌షాపులకు వచ్చినా వారి ఫింగర్‌‌ ప్రింట్స్‌‌ సరిగ్గా పడటం లేదు. వీరిలో పెరాలసిస్‌‌ పేషెంట్లు, వయస్సు మళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారు ఆధార్‌‌లో తమ వేలిముద్రలు అప్‌‌డేట్‌‌ చేసుకుంటేనే బియ్యం ఇస్తామని డీలర్లు చెప్తున్నారు. వారికి నగదు సాయం కూడా అప్పుడే అందుతుందని పేర్కొంటున్నారు.

Latest Updates