ఊర్లలో కొనేటోళ్లు పెరిగితేనే ఎకానమీ

  • ‘వినియోగం’… చుట్టూ బడ్జెట్‌‌
  • రైతుల ఆదాయం పెరగాల్సిందే…
  • మమ్మల్ని పట్టించుకోండి..కన్జూమర్ గూడ్స్‌‌ కంపెనీలు
  • ఇప్పటికే పడిపోయిన రూరల్ ఎకానమీ
  • మరో ఐదు రోజుల్లో ప్రజల ముందుకు బడ్జెట్

వెలుగు, బిజినెస్‌‌‌‌డెస్క్ఆసియాలోనే మనది మూడో అతిపెద్ద ఎకానమీ. ఈ ఎకానమీలో కొనేవారే ఇంపార్టెంట్‌‌‌‌. కొనే వాళ్లు లేకపోతే.. ఎకానమీ ఎక్కడ ఉంటుందో ఓసారి ఊహించండి. షాంపూ ప్యాకెట్‌‌‌‌ నుంచి బిస్కట్లు, సబ్బులు, నూనెల దాకా అన్నీ…ఎఫ్‌‌‌‌ఎంసీజీ కిందే వస్తాయి.  అందుకే కన్జూమర్ గూడ్స్‌‌‌‌ సెక్టార్‌‌‌‌ చాలా  ఇంపార్టెంట్.  గత ఏడాది కాలంగా దేశంలో వినియోగం తగ్గడంతో  ఈ రంగమూ ఇబ్బందుల్లో పడింది.  కొనుగోళ్లు  లేక, ఎకానమీ  చతికిలపడింది. జీడీపీ గ్రోత్‌‌‌‌ ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిందంటే మన ఎకానమీ పరిస్థితిని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.  గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు పెరగాలంటే… రైతుల ఆదాయాలు పెరగాలి.  చిన్న, సన్నకారు రైతుల చేతిలో డబ్బు ఆడేలా ప్రభుత్వం చొరవ తీసుకోవల్సి ఉంటుంది. దీంతోపాటు, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని, పర్సనల్ ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌ను తగ్గించాలని కన్జూమర్ గూడ్స్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కంపెనీలు కోరుతున్నాయి.

ఊళ్లలో  డిమాండ్‌‌‌‌ను పెంచడానికి  గత కొన్ని క్వార్టర్ల నుంచి కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు, ఉచితాలను ప్రకటిస్తూనే ఉన్నాయి. కానీ ఇండియన్ హౌస్‌‌‌‌హోల్డ్స్ వద్ద ప్రొడక్ట్‌‌‌‌లపై వెచ్చించడానికి సరిపడా మనీ లేకపోవడంతో, కొనుగోళ్లకు అంతగా మొగ్గుచూపడం లేదు. దీంతో ఎకానమీ గ్రోత్‌‌‌‌ నెమ్మదించింది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌‌‌‌ఎంసీజీ) ఇండస్ట్రీ 2019లో 9.7 శాతం వృద్ధి చెందిందని ఈ వారం మొదట్లో మార్కెట్ రీసెర్చర్ నీల్సన్ రిపోర్ట్ విడుదల చేసింది. కానీ గ్రామీణ వృద్ధి మాత్రం కొన్ని  ఏళ్ల కనిష్టానికే పడిపోయింది. రూరల్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్లే ప్రొడక్ట్స్‌‌‌‌ కంట్రీ హెడ్‌‌‌‌ మయాంక్ షా అన్నారు. రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్‌‌‌‌ ‘ఎంజీఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఈజీఏ’పై ఎక్కువ ఫోకస్ చేయాలని పేర్కొన్నారు. రూరల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై కూడా కేటాయింపులు ఎక్కువగా జరగాలన్నారు. దీంతో రూరల్ కన్జూమర్ల చేతిలో మనీ పెరిగి, వినియోగం మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఎకానమీ స్లోడౌన్‌‌‌‌తో  ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌‌‌‌ను కూడా ప్రజలు కొనడం లేదని కొన్ని నెలల కిందట పార్లే  కంపెనీ వాపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. పార్లే  దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ బ్రాండ్.

వచ్చే బడ్జెట్‌‌‌‌లో గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపులు 15 శాతం వరకు పెంచుతారని, ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి వ్యవసాయదారుల ఆదాయానికి బూస్టప్ ఇస్తారని అంచనాలున్నాయి. 2019లో ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు.. గ్రోత్ రేట్లను చాలా తక్కువగా నమోదు చేశాయి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాలకు కేటాయింపులు పెంచితే, కన్జూమర్ గూడ్స్ కంపెనీల పంట పండినట్టే. ఇన్ని నెలలు పడిపోయిన గ్రోత్‌‌‌‌ను, మళ్లీ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. మలేసియా నుంచి వచ్చే పామాయిల్‌‌‌‌పై విధించిన ఆంక్షలపై కూడా ప్రభుత్వం ఏమైన ప్రకటనలు చేస్తుందా అని ఆ రంగంలోని కంపెనీలు వేచిచూస్తున్నాయి. పామాయిల్‌‌‌‌పై దిగుమతి ఆంక్షలు విధించడంతో, వాటి ధరలపై భారం పడిందని ప్రతాప్ స్నాక్స్‌‌‌‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాషిస్ బసు అన్నారు.

టీవీలపై జీఎస్టీ తగ్గాలి…

కొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపును కూడా కన్జూమర్ డ్యూరబుల్ సంస్థలు కోరుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ స్క్రీన్‌‌‌‌ టీవీలు, ఎయిర్‌‌‌‌‌‌‌‌ కండీషనర్లపై ఉన్న 28 శాతం ట్యాక్స్‌‌‌‌ను తగ్గించాలని అంటున్నాయి. ఎలక్ట్రానిక్స్‌‌‌‌పై తక్కువ జీఎస్టీ ఉంటే, ఇండస్ట్రీ గ్రోత్ రేటు పెరుగుతుందని పేర్కొంటున్నాయి. గత రెండేళ్లుగా కన్జూమర్ అప్లియెన్స్ ఇండస్ట్రీ ఫ్లాట్ గ్రోత్ రేటునే నమోదు చేసింది. ఈ రంగానికి సపోర్ట్‌‌‌‌ ఇచ్చే సానుకూల విధానాలు తీసుకురావాలని పానాసోనిక్ ఇండియా, సౌతాసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రెసిడెంట్ మనీష్ శర్మ అన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు ఇప్పుడు ప్రతి ఇంటికి అవసరమైన వస్తువుగా మారాయని పేర్కొన్నారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లపై జీఎస్టీని తగ్గిస్తే.. ఈ ప్రొడక్ట్‌‌‌‌ల ధరలు తగ్గి, అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్యాక్స్‌‌‌‌లు తగ్గితే.. వినియోగం పెరుగుతది..

ఎప్పటి నుంచో పెండింగ్‌‌‌‌లో ఉన్న పర్సనల్ ట్యాక్స్ శ్లాబుల్లో కూడా ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా అని ఆశిస్తున్నారు. గతేడాది ప్రభుత్వం చిన్న, పెద్ద కంపెనీలకు ఊరటనిస్తూ..  కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను తగ్గించింది. ఒకవేళ ఈసారి పర్సనల్ ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ శ్లాబులు తగ్గిస్తే.. వినియోగం ఆటోమేటిక్‌‌‌‌గా పెరుగుతుందని ఎలక్ట్రానిక్స్ స్టోర్‌‌‌‌‌‌‌‌ చెయిన్ విజయ్ సేల్స్‌‌‌‌ ఎండీ నీలేష్ గుప్తా అన్నారు.

ఎంప్లాయిమెంటే కీలకం…

అంతేకాక ప్రభుత్వం ఎంప్లాయిమెంట్‌‌‌‌ను కూడా క్రియేట్ చేయాలని, ముఖ్యంగా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరగాలని డెలాయిట్ ఇండియా పార్టనర్ రాజత్ వాహి అన్నారు. వినియోగం పెరగడానికి, కన్జూమర్లు మరింత ఖర్చు పెట్టడానికి ఎంప్లాయిమెంటే కీలకమని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌‌పై కూడా ఫోకస్ చేయాలని సూచించారు. కంపెనీలు వచ్చి తన ప్లాంట్లను పెట్టుకుని, ఉద్యోగావకాశాలు కల్పించడానికి.. ల్యాండ్‌‌‌‌ తేలికగా అందుబాటులో ఉండేటట్టు, కార్మిక సంస్కరణలు వంటివి అమలు చేయాలని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు, ఎంప్లాయిమెంట్ పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మెరుగవుతుందని వివరించారు.

  • ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీల మొత్తం అమ్మకాల్లో రూరల్ మార్కెట్ వాటా 35 శాతానికి పైగా ఉంది. నిజానికి అర్బన్‌‌‌‌ ప్రాంతాలలోని జనాభా కంటే ఇండియాలో రూరల్‌‌‌‌ ప్రాంతాలలో ఉండేవాళ్లే  చాలా ఎక్కువ. అంటే,  అర్బన్ మార్కెట్ల కంటే ఎక్కువ జోరు రూరల్‌‌‌‌ మార్కెట్లో కనబడాలి.
  • వేతనాల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవడం, పంటలకు ధరలు తగ్గడం వంటి కారణాలతో రూరల్ కన్జూమర్ల చేతిలో మనీ తగ్గిపోయి, వినియోగం పెరగడం లేదు.
  • గ్రామాల రూపురేఖలను మార్చడానికి ప్రభుత్వం  కేటాయింపులు పెంచాలి. ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సరైన చర్యలు తీసుకోవాలి.

Latest Updates