రైతుపై లారీ ఎక్కించి హత్య చేసిన ఉదంతంలో….

బాధ్యులెవరు.. బలి పశువులెవరు..?

చర్యలు కింది స్థాయి సిబ్బంది వరకే పరిమితం

పెద్ద తలకాయలను తప్పిస్తున్నారనే ఆరోపణలు

వీఆర్ ఏలు, వీఆర్ వోపై వేటుతో సరి

ఇసుక అక్రమ రవాణాను అడ్డు కున్న దళిత రైతును లారీతో తొక్కించి హత మార్చిన ఘటనలో చర్యల విషయమై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్ లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. స్థానిక బడా లీడర్ల కనుసన్నల్లో ఇసుక మాఫీయా ఇక్కడ ఇల్లీగల్ దందా నడుపుతున్నట్లు సమాచారం. వీరికి రెవెన్యూ, పోలీసుల సహకారం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే రైతు మర్డర్ విషయంలో కింది స్థా యి సిబ్బందిపై చర్యలు తీసుకుని పెద్ద తలకాయలను సేఫ్ గా ఉంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. గ్రామ స్థాయిలో ఉండే వీఆర్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి తహసీల్దార్ కు మెమోలు మాత్రమే జారీ చేసి చేతులు దులుపు కోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

జడ్చర్ల, వెలుగు: ఇసుక తవ్వడం వల్ల తమ పొలాల్లో బోర్లు ఎండిపోతున్నాయంటూ తిర్మలాపూర్ లో ఇసుక లారీని అడ్డుకున్నందుకు దళిత రైతు గుర్రంకాడి నర్సింహులు(38) మాఫియా చేతిలో హతమయ్యాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు అసలు సూత్రధారులను వదిలేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామం నుంచి రోజుకు పెద్ద మొత్తంలో ఇసుకను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా ఇల్లీగల్ గా జరుగుతున్నా ఎవరూ పట్టించు కోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో మాఫియా ఇదంతా చేస్తోందని, అందుకే అడ్డు వచ్చిన వారిని లేకుండా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.

గతంలోనూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మరో రైతును హతమార్చి సాధారణ మరణంగా చిత్రీకరించారనే వాదన కూడా ఉంది. నర్సింహులు హత్య విషయంలో తహసీల్దార్ కు మెమోలు, ఆర్ ఐకు సంజాయిషీ నోటీసులు ఇవ్వగా.. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ ఏ, పంచాయత కార్యదర్శిని మాత్రం సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ కేసు విషయంలో ఇసుక మాఫియాను కాపాడేందుకు కొందరు నాయకులు చక్రం తిప్పుతిన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాఫియాను గుర్తించాలని డిమాండ్ ..

తిర్మలాపూర్ శివారులోని దుందుబి వాగు నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని పరి వాహక ప్రాంత రైతులు తహసీల్దార్ శంకర్ ను కలిసి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు . అయినా పట్టించుకోలేదని, రైతు హత్య కు పరోక్షంగా తహసీల్దార్ బాధ్యుడు అయ్యారని రైతులు అంటున్నారు. ఇసుక మాఫియాలో ఎవరెవరు ఉన్నారో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాపూర్ మండల కాం గ్రెస్ అధ్యక్షుడు కోస్గి వెంకటయ్య డిమాండ్ చేశారు. మృతుడి కుటుం బానికి రూ.50 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇసుక లారీ యజమాని, డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర నాయకుడు జంగయ్య డిమాండ్ చేశారు. అంతే కాకుండా నర్సింహులు హత్యపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.

 

Latest Updates