నిర్భయ కేసులో దోషులకు ఇక మిగిలింది క్షమాభిక్షే

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మెర్సీ పిటిషన్ పెట్టు కున్నాడు. తనకు విధించిన ఉరిశిక్షపై క్షమాభిక్ష పెట్టాలని అందులో విజ్ఞప్తి చేశాడు. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా మరో పిటిషన్ వేశాడు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే హక్కు ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఉంటుందని, ఈ నెల 7న తనపై జారీ చేసిన డెత్వారెంట్ ను కొట్టివేయాలని అందులో పేర్కొన్నాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రెసిడెంట్ ముందు మెర్సీ పిటిషన్లు పెట్టుకున్నట్లు తెలిపాడు. బుధవారం ఈ పిటిషన్ ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీతా ధింగ్రా సేగల్ ల బెంచ్ విచారించనుంది. ముఖేశ్ తోపాటు వినయ్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో ఈ పిటిషన్లను దాఖలు చేశాడు.

ఢిల్లీ ప్రభుత్వం నుంచి…

ముఖేశ్ సింగ్‌‌ దాఖలుచేసిన మెర్సీ పిటిషన్ ముందుగా ఢిల్లీ ప్రభుత్వం దగ్గరకు వెళ్తుంది. అటు నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చేరుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ ముందుకు వెళ్తుంది. ఢిల్లీ సర్కారు, హోంశాఖ ఇచ్చే సిఫారసుల ఆధారంగా ప్రెసిడెంట్ రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ నిర్ణయం తీసుకుంటారు.

క్యూరేటివ్‌ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన 2012 నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ పెట్టు కున్న క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్లపై మంగళవారం విచారణ ప్రారంభించిన బెంచ్.. ఆ వెంటనే వాటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. పిటిషన్లకు ఎలాంటి విచారణ అర్హత లేదని చెప్పింది. 22న ఉదయం 7 గంటలకు నలుగురిని ఉరి తీయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ ల బెంచ్ ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. ఈనెల 7వ తేదీన ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయగానే ఈ నెల 9వ తేదీన వినయ్, ముఖేశ్‌‌ వేర్వేరుగా రెండు క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. తమకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ ఇప్పటి వరకు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదు. అంతకుముందు నలుగురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది.

ఇక ఒక్కటే అవకాశం

ఉరిశిక్ష పడిన దోషులు ఆ శిక్ష నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్న చట్టపరమైన చివరి మార్గం క్యురేటివ్ పిటిషన్ ఒక్కటే. తాజాగా వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఇక ఒకే అవకాశం మిగిలి ఉంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకు నేందుకు చాన్స్ ఉంది. ఒకవేళ క్షమాభిక్ష విజ్ఞప్తిని రాష్ట్రపతి తిరస్కరిస్తే.. ఇక వేరే దారులేవీ ఉండవు. ఉరి శిక్షే తరువాయి. రేప్ వంటి తీవ్రమైన నేరాల్లో ఉరి శిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని ఈ మధ్య ప్రెసిడెం ట్ రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ చెప్పారు. ఆరుగురు నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్.. తీహార్ జైలులో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో జువనైల్.. మూడేళ్ల పాటు రిఫార్మేషన్ హోమ్ లో ఉండి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులను ఈనెల 22న ఉదయం  7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను తీహార్ జైలు అధికారులు పూర్తి చేశారు.

ఆరోజే మాకు దీపావళి: నిర్భయ తాత

బల్లియా(యూపీ): క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని నిర్భయ తాత లాల్జీ సింగ్ స్వాగతించారు. కోర్టు నిర్ణయంతో తమ గ్రామం అంతా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. నలుగురు దోషులను ఉరి తీసిన రోజు మాకు దీపావళి పండుగ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ని మేడావర్ కాలా గ్రామంలో లాల్జీ సింగ్ ఉంటున్నారు.

Latest Updates