కరోనా విజృంభణ కొనసాగితే మార్చికి 6 కోట్ల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. టెస్టులు చేస్తున్న కొద్దీ కేసుల సంఖ్య హెచ్చుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. 2021 మార్చికి ఇండియాలో తక్కువలో తక్కువగా 37.4 లక్షలు ఉండొచ్చని, వైరస్ ప్రభావం విపరీతంగా ఉంటే ఎక్కువలో ఎక్కువగా 6.18 కోట్ల కేసులు నమోదవ్వొచ్చని అంచనా వేసింది. గత మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల డేటా, ట్రెండ్స్‌ను పరిశీలించి ఐఐఎస్‌సీ ఈ లెక్కలు వేసింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి చూస్తే ఈ లెక్కలు కాస్త మారొచ్చు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌‌లో రావొచ్చని ఐఐఎస్‌సీ హెచ్చరించింది. ఈ మోడల్ ప్రకారం కొత్త వైరస్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి వారంలో ఒకటి నుంచి రెండ్రోజులు లాక్‌డౌన్ విధించాలని పేర్కొంది. వ్యాక్సిన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటివరకు వైరస్ వ్యాప్తిని ఆపడానికి కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, సోషల్ డిస్టెన్సింగ్ చాలా కీలకమని సూచించింది. కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. మహమ్మారి బారిన పడి 24 వేల మంది చనిపోయారు. అయితే వైరస్ నుంచి 6 లక్షల మంది వరకు కోలుకోవడం శుభపరిణామంగా చెప్పొచ్చు.

Latest Updates