పల్లెల్లో కొలువులు మళ్లీ మామూలే

  • 8.5 శాతానికి చేరిన నిరుద్యోగం రేటు
  •  ఏప్రిల్, మే నెలల్లో 23.5 శాతం

ఇండియాలో ఉద్యోగాలు మళ్లీ కరోనా ముందు నాటి స్థాయికి నెమ్మదిగా చేరుతున్నాయి. ప్రధానంగా పల్లెల్లో ఉపాథి హామీ పథకం, ఖరీఫ్‌‌ సీజన్‌‌ పనులు ఊపందుకోవడంతో ఉద్యోగకల్పన బాగా మెరుగయ్యింది. దీంతో నిరుద్యోగ రేటు మళ్లీ  కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకుంటోంది. ఏప్రిల్‌‌, మే నెలల్లో ఏకంగా 23.5 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు, ఈ నెల 21తో ముగిసిన వారంలో  8.5 శాతంగా రికార్డయినట్టు  సీఎంఐఈ డేటా చెబుతోంది. కాకపోతే, పట్టణ ప్రాంతాలలో మాత్రం ఉద్యోగ కల్పన ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంటోంది. లాక్‌‌డౌన్ కారణంగా ఏప్రిల్‌‌, మే నెలల్లో లక్షల మంది వర్కర్లు ఉద్యోగాలను కోల్పోయిన విషయం తెలిసిందే. రూరల్ నిరుద్యోగ రేటు మాత్రం క్రమక్రమంగా తగ్గుతోంది. ఎంజీఎన్‌‌ఆర్‌‌‌‌ఈజీఏ, ఖరీఫ్‌‌ పంటలతో రూరల్‌‌లో నిరుద్యోగం కాస్త తగ్గినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తన వీక్లీ రిపోర్ట్‌‌లో తెలిపింది.  ఇండియాలో నిరుద్యోగ రేటు మార్చిలో 8.75 శాతానికి చేరింది. ఆ తర్వాత మే 3 నాటికి ఇది 27.1 శాతానికి చేరుకుంది. జూన్ నెలలో మొదటి మూడు వారాలు నిరుద్యోగ రేటు 17.5 శాతానికి, 11.6 శాతానికి, 8.5 శాతానికి  తగ్గినట్లు సీఎంఐఈ డేటా తెలిపింది. సీఎంఐఈ రిపోర్ట్‌‌ ప్రకారం, అర్బన్ నిరుద్యోగ రేటు ప్రీ కరోనా లెవల్స్ కంటే ఇంకా ఎక్కువగానే ఉంది. లాక్‌‌డౌన్‌‌కు ముందు అర్బన్ నిరుద్యోగ రేటు యావరేజ్‌‌గా 9 శాతం ఉంటే, ఇప్పుడిది 11.2 శాతంగా ఉంది. రూరల్ ఇండియాలో నిరుద్యోగ రేటు 7.26 శాతానికి తగ్గింది. మార్చి 22తో ముగిసిన ప్రీ లాక్‌‌డౌన్‌‌ వీక్‌‌లో ఇది 8.3 శాతంగా నమోదైనట్టు సీఎంఐఈ పేర్కొంది.

Latest Updates