గ్రేటర్ లో ప్రతి 100 టెస్టులకు 10 పాజిటివ్ కేసులు

హైదరాబాద్, వెలుగు : లాక్​డౌన్ ​రిలాక్సేషన్స్​తో గ్రేటర్​లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 100 మందికి టెస్ట్​లు చేస్తే 10 మందికి పాజిటివ్‌ వస్తోంది. నెల కిందట చూస్తే 5.1 శాతంగా ఉన్న పర్సంటేజీ 10కి చేరింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైరస్ ​వ్యాపించి ఉంటుందని, టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం బల్దియా అధికారులు భావిస్తున్నారు. పాజిటివ్స్​ వచ్చిన ఏరియాల్లో హెల్త్‌ ఆఫీసర్లు, పోలీసులు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తిస్తున్నారు. హెల్త్​వర్కర్లతో డోర్​ టు డోర్​ సర్వే చేయిస్తున్నారు. సింప్టమ్స్​ఉన్నవారిని గాంధీ, నిమ్స్​కు టెస్ట్​ల కోసం షిఫ్ట్​ చేస్తున్నారు. పాజిటివ్‌ వస్తే అడ్మిట్, నెగిటివ్‌ వస్తే హోం క్వారంటెయిన్​లో ఉంచుతున్నారు.

టెస్టు​ల్లో లేని క్లారిటీ

గ్రేటర్​లో​ ప్రైమరీ కాంటాక్స్​ అందరికీ టెస్టులు  చేయడం లేదు. మస్ట్​గా చేస్తామని చెప్పిన సర్కార్​ తీరు మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తరచూ రూల్స్​ మారుస్తుండడంతో క్లారిటీ ఉండడం లేదని బల్దియా అధికారులు వాపోతున్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో పాజిటివ్‌ పర్సన్​ఫ్యామిలీలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్​లకు టెస్ట్​లు చేయగా అందరికీ కరోనా సోకినట్లు తేలింది. మరో పాజిటివ్‌  వ్యక్తి ఫ్యామిలీలో  ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్ట్​లు చేస్తే నెగిటివ్‌ వచ్చింది. వైరస్​ బారిన పడ్డ 80 శాతం మందిలో సింప్టమ్స్ కనిపించడం లేదు. టెస్ట్​ల​ సంఖ్య  పెంచడంతోనే  కరోనా కట్టడి సాధ్యమని బల్దియా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం తరచూ రూల్స్​ మారుస్తుండడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  సిటీలో వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అయ్యిందా అనే అనుమానాలూ మొదలయ్యాయి. ఈ కోణంలోనే ఎత్తేసిన 5 కంటెయిన్​మెంట్​ ఏరియాల్లో ఇటీవల ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌ టీమ్​లు రెండ్రోజుల పాటు టెస్టులు చేశాయి.

జాగ్రత్తగా ఉంటేనే కంట్రోల్​లోకి..

అలర్ట్​గా ఉండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా కట్టడి సాధ్యం. నిత్యావ‌స‌రాల కోసం ఇంట్లో ఒక‌రు మాత్రమే వెళ్లాలి. పిల్లలు, వృద్ధుల‌ను బ‌య‌ట‌కు పంపొద్దు. మాస్క్, ఫిజికల్ ​డిస్టెన్స్ ​మస్ట్. ర‌ద్దీ ఏరియాలకు అసలే వెళ్లొద్దు. ఫంక్షన్లు, పార్టీల‌కు దూరంగా ఉండాలి. ఇంటిని, ప‌రిస‌రాల‌ను క్లీన్​గా ఉంచుకోవాలి.

‑ డీఎస్​ లోకేశ్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్

సీజన్ దగ్గర పడుతున్నా విత్తనాలేవి?

Latest Updates