పెరగనున్న పెట్రోల్ ధరలు

నెలన్నరపాటు సాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు స్థిరంగా ఉన్న ఫ్యూయల్ ధరలు పెరిగే అవకాశం ఉందా? గత రెండు నెలల్లో ఎదుర్కొన్న నష్టాలను పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఎన్నికలయ్యే వరకు పెంచొద్దు

ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగితే తమపై ప్రభావం చూపుతుందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం కంపెనీలను కట్టడి చేసింది. పోలింగ్ కొనసాగే ఏప్రిల్, మే నెలల్లో ఫ్యూయల్ ధరలను పెంచవద్దని, స్టేబుల్​గా ఉంచాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. దీంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. ఈ క్రమంలో తాజాగా ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సంస్థలు కోరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, అనుకున్న దాని కంటే ఎక్కువగానే ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్యూయల్ రేట్లు పెంచడమే ఇందుకు ఉదాహరణ. పోలింగ్ సమయంలో ఓ వారంపాటు ధరలు పెరగకుండా ఆపిన ప్రభుత్వం, తర్వాత మాత్రం భారీగా పెంచుకుంటూపోయింది.

అప్పుడే పెరిగినయ్

లోక్​సభ ఎన్నికలు పూర్తయిన తర్వాతి రోజే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్ 8 నుంచి 10 పైసలు, డీజిల్ 15 నుంచి 16 పైసలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.71.12, డీజిల్ 66.11గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందువల్లే ఇక్కడ ఫ్యూయల్ ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ పరిమిత సరఫరాకు ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఒప్పుకున్నాయని సౌదీ
అరేబియా ఎనర్జీ మంత్రి ఖలీద్ అల్ ఫలీ ప్రకటించిన తర్వాత క్రూడ్ ఆయల్ ధరలు 1 శాతం వరకు పెరిగాయి.

Latest Updates