IND vs ENG: అండర్సన్‌తో గొడవ.. ఆ మాటలు బయట పెట్టను: శుభ్‌మాన్ గిల్

IND vs ENG: అండర్సన్‌తో గొడవ.. ఆ మాటలు బయట పెట్టను: శుభ్‌మాన్ గిల్

ధర్మశాల టెస్ట్ రెండో రోజు ఆటలో భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ మధ్య వాడీవేడీ చర్చ జరిగిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో గిల్ ఆడిన ఓ షాట్‌కు సహనం కోల్పోయిన అండర్సన్‌ తన నోటికి పనిచెప్పాడు. గిల్ దగ్గరగా వెళ్లి ఏవో మాటలు తుల్లాడు. అందుకు సంబంధించిన వీడియోలు సొషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆట ముగిసిన అనంతరం గిల్ దానిపై మాట్లాడారు.    

తల మీదుగా స్ట్రైట్ సిక్స్

రెండో రోజు ఆటలో శుభ్‌మాన్ గిల్.. ఓవైపు నిలకడగా ఆడుతూనే, మరోవైపు వేగంగా పరుగులు చేశాడు. ముఖ్యంగా అండర్సన్ విసిరిన సవాలైన బంతులను ధీటుగా ఎదుర్కొన్నాడు.ప్రతిదాడికి దిగుతూ బౌండరీలు సాధించాడు. అతని బౌలింగ్ లోనే ఒక బంతిని ముందుకొచ్చి తల మీదుగా స్ట్రైట్ సిక్సర్‌గా మలిచాడు. ఆ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ షాట్ కొట్టడాన్ని ఇంగ్లాండ్ పేసర్ తట్టుకోలేకపోయాడు. గిల్‌తో ఏదో సంభాషించాడు.

ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై గిల్ ఆట ముగిసిన అనంతరం మాట్లాడారు. అయితే, ఆ సంభాషణను బయటకు చెప్పకపోవడమే తామిద్దరికి చాలా మంచిదని గిల్ అభిప్రాయపడ్డాడు. "అండర్సన్ వేసిన ఆ బంతి గొప్పగా అనిపించలేదు. అప్పటికే నేను ముందుకొచ్చి షాట్ ఆడాలని డిసైడ్ అయ్యాను. అతనిపై ఒత్తిడి పెంచాలనుకున్నా.. అతని బౌలింగ్‌లో నేను బౌల్డ్ అయిన బంతిని సరిగ్గా చూడలేదు. అంచనా వేయలేదు. అందువల్లే కనెక్ట్ చేయలేకపోయా.. ఇక, మా ఇద్దరి మధ్య జరిగిన ఆ చాట్ మా మధ్య ఉంచుకోవడం మంచిదని నేను అనుకుంటున్నా.." అని గిల్ మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు.