భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

ind-vs-newzealand-match-rain

నాటింగ్‌: వరల్డ్ కప్ -2019ని వరుణుడు వదలడంలేదు. సరిగ్గా టాస్ సమయానికి వర్షం రావడంతో అయోమయం అవుతున్నారు అభిమానులు. ఎంతో ఆసక్తిగా చూడాలనుకునే వరల్డ్ కప్ మ్యాచ్ లకు వర్షాలు రావడంతో ఈ సారి సరైన కిక్కులేదంటున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం అవ్వాల్సిన భారత్‌ – న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై కూడా వర్షప్రభావం నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావచ్చు.

గురువారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ మొత్తం జరిగే అవకాశం లేదు. ఇదిలా ఉండగా న్యూజిలాండ్‌ ఆరు పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్‌ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. ఒకవేళ నేటి మ్యాచ్‌ గనుక రద్దైతే చెరో పాయింట్‌ లభిస్తుంది.

అలా జరిగితే భారత్‌ కన్నా న్యూజిలాండ్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. న్యూజిలాండ్‌ మొత్తంగా ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఆ టీమ్ మిగతా ఐదింటిలో మూడు గెలిచినా సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటుంది. దీంతో పాకిస్థాన్‌తో జరగబోయే నెక్ట్స్ మ్యాచ్‌ భారత్‌కు కీలకం కానుంది.

Latest Updates