కోహ్లీ, గేల్ ముందు అరుదైన రికార్డులు

టీ20 సిరీస్ విజయంతో జోరు మీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇవాళ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్ తో రెండో వన్డేకి రెడీ అయింది భారత్. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో ఇవాళ జరిగే రెండో వన్డేపై రెండు జట్లు దృష్టి సారించాయి. ఇప్పటికే మూడు మ్యాచుల్లో టీ-20 సిరీస్ ను గెలుచుకుని టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉండగా… టీ20 సిరీస్ కు ప్రతీకారాన్ని తీర్చుకోవాలని విండీస్ చూస్తోంది.

టీమిండియాలో ఒకటి, రెండు మినహా పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కన్పించడం లేదు. తొలి వన్డేలో KL  రాహుల్ బెంచ్ కే పరిమితమవగా… నాలుగో స్థానంలో యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు స్థానం దక్కింది. ఈ మ్యాచ్ లో కూడా రాహుల్ ను బెంచ్ కే పరిమితం చేసే చాన్సుంది. వరల్డ్ కప్ లో విఫలమైనా టూర్ కు అనుహ్యంగా ఎంపికైన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్ లో రాణించాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు. అటు పేసర్ నవ్ దీవ్ సైనీ ఆరంగేట్రంపై ఉత్కంఠ నెలకొంది. తొలి వన్డేలో ఎంట్రీ ఇస్తాడని అంతా… ఊహించినప్పటికీ సైనీకి నిరాశ తప్పలేదు. భువనేశ్వర్ తుది జట్టులోకి రావడంతో సైనీకి అవకాశం రాలేదు. తొలి మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ పెద్దగా ఆకట్టుకోలేదు. 3 ఓవర్లలోనే 27 రన్స్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్ లో కోహ్లీ  సైనీ, ఖలీల్ ల్లో ఎవరివైపు మొగ్గు చూపుతాడనేది ఇంట్రస్టింగా మారింది.

మరో 13 పరుగులు చేస్తే విండీస్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించనున్నాడు విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్. తొలి వన్డేలో 31 బాల్స్ ఆడిన గేల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మిగిలిన రెండు వన్డేల్లో రాణించి కేరీర్ కు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్నాడు గేల్. టెస్టు సిరీస్ తో కెరీర్ ను ముగిద్దామనుకున్న గేల్ ఆశలపై సెలక్టర్లు నీళ్లు చల్లారు. దీంతో ఈ వన్డే సిరీస్ గేల్ కు చివరిదయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విండీస్… వన్డేల్లో సత్తా చాటి గేల్ కు ఘనంగా వీడ్కోలు పలకాలని పట్టుదలతో ఉంది.

ఇవాళ్టి మ్యాచ్ లో మరో 19 పరుగులు చేస్తే విండీస్ పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా  కోహ్లీ రికార్డు సాధించనున్నాడు. ఇప్పటివరకూ విండీస్ తో 33 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 1912 పరుగులు చేశాడు.  పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ను కోహ్లీ వెనక్కి నెట్టనున్నాడు. ఈ మ్యాచ్ తో విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా గేల్ రికార్డులకెక్కనున్నాడు. ఇవాల్టి వన్డేతో గేల్ 300 వన్డేలు పూర్తి చేసుకోనున్నాడు. విండీస్ తరపున ఇప్పటివరకూ అత్యధికంగా లారా 299 వన్డేలు ఆడాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఆడిన ఆరు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించింది. పేస్ కంటే స్పిన్ కే పిచ్ అనుకూలించనుంది. ఐతే ఈ మ్యాచ్ కు కూడా వరుణుడు ఆటంకం కల్గించే అవకాశం ఉంది.

Latest Updates