
నేటి నుంచి ఇండియా, బంగ్లాదేశ్ డేనైట్ టెస్ట్
సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
గెలుపే లక్ష్యంగా మొమినుల్సేన
కోల్‌కతా: ఓవైపు ఆసక్తి.. మరోవైపు ఆతృత.. ఈ రెండింటికి మించి ఆందోళన.. మిక్స్డ్ రియాక్షన్స్ మధ్య.. ఇండియా తొలి డేనైట్ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. పింక్ టెస్ట్ జరుగుతోందని అభిమానులు, నిర్వాహకులు పండుగ చేసుకుంటుంటే.. అనుభవం లేమితో ఎలా ఆడాలని క్రికెటర్లు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో ఉన్న ఇండియా ఈడెన్లోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. ఈ మ్యాచ్ గెలిచి స్వదేశంలో వరుసగా 12 సిరీస్‌లు నెగ్గిన రికార్డును సొంతం చేసుకోవాలని విరాట్ బృందం భారీ ఆశలు పెట్టుకుంది. ఇండియాలో డేనైట్ టెస్ట్‌కు బీజం వేసినప్పట్టి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ… అన్నీ తానై వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజకీయ నాయకులు, క్రికెట్ లెజెండ్స్, ఇతర క్రీడల్లో ప్రముఖులను రప్పించి ఈ మ్యాచ్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నాడు.
దీనికి ప్రేక్షకుల మద్దతు కూడా బాగానే తోడైంది. ఇప్పటికే నాలుగు రోజుల మ్యాచ్ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈడెన్ మొత్తాన్ని పింక్ వర్ణ శోభితం చేశారు. అక్కడక్కడ పింక్ బాల్ మస్కట్లు పెట్టి కొత్త జిమ్మిక్కులు చేస్తున్నారు. డిన్నర్ టైమ్‌లో గ్రాండ్ గాలా, ‘ఫ్యాబులస్–5 (సచిన్, సౌరవ్, లక్ష్మణ్, ద్రవిడ్, కుంబ్లే)’తో కామెంట్రీ.. ఇలా ఒక్కటేంటీ క్రికెట్ ప్రపంచం ఔరా అనేలా దాదా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఓవరాల్‌గా ఇండియాలో పింక్ బాల్ టెస్ట్ అంటే గంగూలీ గుర్తొచ్చేలా ఓ కొత్త శకానికి నాంది పలుకుతున్నాడు. ఈ మ్యాచ్ హిట్ కావాలన్నా, ఫట్ కావాలన్నా.. బ్యాక్‌బోన్ ‘ఎస్జీ పింక్ బాల్’ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంది.
గులాబీ బంతికి.. డేనైట్ టెస్ట్‌కు మధ్య బంధం ఏడేళ్లు..! కానీ, టీమిండియాతో అనుబంధానికి మాత్రం ఇదే తొలి రాత్రి..! ఏళ్లుగా వద్దని వారించినా.. మొండిగా వ్యవహరించినా.. ‘మూడు సెకండ్ల’లోనే ముడిపడ్డ ‘పింక్’ బంధానికి ఇండియా క్రికెట్ సిద్ధమైంది..! ఓహో.. గులాబీ బాలా అని ఒకరిద్దరికి ఆడిన అనుభవం ఉన్నా.. చాలా మందికి మాత్రం ఆ ఫీల్ కొత్తదే..! కోల్‌కతా ప్రిన్స్ వేసిన కొత్త బాటలో పయనం మొదలుపెట్టబోతున్న విరాట్‌సేన.. ఐదు రోజుల ఫార్మాట్లో చరిత్రాత్మక సందర్భానికి, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది..! ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే ‘పింక్ వార్’ (రెండో టెస్ట్)లో బంగ్లాదేశ్‌ను వేటాడేందుకు రెడీ అయ్యింది..! అయితే ఆద్యంతం సవాలు విసిరే గులాబీ మ్యాచ్‌లో.. ముల్లు గుచ్చుకునేదెవరికో..!!
మార్పుల్లేకుండానే..
ఈ మ్యాచ్ కోసం ఫైనల్ ఎలెవన్‌లో మార్పులు చేయడం లేదు. ఇండోర్‌లో ఆడిన జట్టునే యధావిధిగా దించాలని కోహ్లీ భావిస్తున్నాడు. సన్‌సెట్, నైట్‌లో పింక్ బాల్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియకపోయినా, గ్రీన్‌టాప్ వికెట్ అయినా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తోనే ఆడనున్నాడు. ప్రస్తుతం ఉన్న టీమ్‌లో ఒకరిద్దరికి మాత్రమే పింక్ బాల్‌తో ఆడిన అనుభవం ఉంది. దీనిని అధిగమించేందుకు డేనైట్ మ్యాచ్ షెడ్యూల్ అయినప్పట్నించి ప్రాక్టీస్లతోనే పింక్‌పై అవగాహన పెంచుకుంటున్న కోహ్లీసేనకు బంగ్లా కంటే ‘మంచు’ నుంచి అతిపెద్ద చాలెంజ్ ఎదురుకానుంది. ఓపెనర్లుగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న రోహిత్, మయాంక్ చెలరేగితే బంగ్లాకు కష్టాలు తప్పవు. ఇండోర్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్.. పింక్ మ్యాచ్‌లోనూ తన ప్రత్యేకతను చాటాలని చూస్తున్నాడు.
టాప్ ఆర్డర్లో పుజారా, కోహ్లీ, రహానెలో ఏ ఒక్కరు ఆడినా భారీ స్కోరు ఖాయం. సేమ్ తొలి టెస్ట్ మాదిరిగా మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించాలని టార్గెట్ పెట్టుకున్న టీమిండియా షమీ, ఉమేశ్, ఇషాంత్పైనే ఎక్కువ భారం వేసింది. తొలి టెస్ట్‌లో ఈ ముగ్గురు కలిసి 14 వికెట్ల తీయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కండీషన్స్ బట్టి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే.. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ తుది జట్టులోకి రావొచ్చు. అప్పుడు జడేజా, అశ్విన్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితంకానున్నారు.
పోటీ ఇస్తుందా?
మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా డేనైట్ టెస్ట్ ఆడటం ఇదే తొలిసారి. బీసీసీఐ కోరిక మేరకు అతి తక్కువ సమయంలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైన బంగ్లా పులులకు ఓడినా పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రికెట్లో బంగ్లా ఇంకా అడుగులు వేసే దశలోనే ఉంది. ఒకవేళ గెలిస్తే మాత్రం అతిపెద్ద సంచలనం అవుతుంది. సరిగ్గా మొమినుల్ బృందం దీనిపైనే దృష్టిపెట్టింది. లెక్క సరి చేయడంతో పాటు సిరీస్‌ను సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే బంగ్లాకు అనుకున్నంత సులువు కాదు. బ్యాటింగ్‌లో ముష్ఫికర్ ఒక్కడే పోరాడుతున్నాడు. ఆశలు పెట్టుకున్న షాద్మన్, కైస్, మహ్మదుల్లా, లిటన్, మిథున్.. ఘోరంగా నిరాశపరుస్తున్నారు. ఇక అనుకోకుండా వచ్చిన కెప్టెన్సీతో మొమినుల్ ఒత్తిడికి లోనవుతున్నాడు. టీమ్‌ను నడిపించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో బాగా తడబడుతున్నాడు. ఇది తన వ్యక్తిగత పెర్ఫామెన్స్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మొమినుల్‌కు పేసర్ల నుంచి కాస్త మద్దతు లభించడం అనుకూలాంశం. ఇండోర్‌లో అబు జాయేద్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి తోడుగా ముస్తాఫిజుర్‌ను తీసుకోనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపును ఊహించకపోయినా, డ్రా చేసుకున్నా బంగ్లాకు పెద్ద ఊరటే.
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానె, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ.
బంగ్లాదేశ్: మొమినుల్ (కెప్టెన్), షాద్మన్, ఇమ్రూల్ కైస్, ముష్ఫికర్, మహ్మదుల్లా, మిథున్, లిటన్ దాస్, మెహిదీ హసన్, తైజుల్ ఇస్లామ్ / ముస్తాఫిజుర్, అబు జాయేద్, ఎబాదత్ హొస్సేన్ / అల్ అమిన్ హొస్సేన్.
పిచ్, వాతావరణం
గ్రీన్ టాప్ వికెట్. ఔట్‌ఫీల్డ్ క్లియర్. డేనైట్ మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం ఎక్కువ. సన్‌సెట్ సమయంలో పేసర్లు ప్రభావం చూపుతారు. కండిషన్స్ బట్టి రిస్ట్ స్పిన్నర్లకు అనుకూలం. వర్షం ముప్పులేదు.