- నేటి నుంచే సరఫరా..ఆయా దేశాలకు వ్యాక్సినేషన్ ట్రైనింగ్
- కేంద్రం ప్రకటన.. గౌరవంగా భావిస్తున్నామన్న ప్రధాని
న్యూఢిల్లీ: ఆరు దేశాలకు మన దేశం కరోనా వ్యాక్సిన్లను ఫ్రీగా సరఫరా చేయనుంది. మంగళవారం దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పొరుగు దేశాలు, భాగస్వామ్య దేశాలకు ‘మేడిన్ ఇండియా’ వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్టు పేర్కొంది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్‌లకు ఈ నెల 20 (బుధవారం) నుంచి సరఫరా ప్రారంభిస్తామని చెప్పింది. శ్రీలంక, ఆఫ్గనిస్థాన్, మారిషస్లు ఇంకా రెగ్యులేటరీ అనుమతులు ఇవ్వాల్సి ఉందని, అక్కడా అనుమతులు వచ్చాక ఆ దేశాలకూ వ్యాక్సిన్లను పంపిస్తామని పేర్కొంది. రాబోయే రోజుల్లో దశల వారీగా వ్యాక్సిన్లను ఇస్తామంది. దేశ అవసరాలకు సరిపడా స్టాక్‌లు ఉంచుకుని, మిగతా వాటిని విదేశాలకు సరఫరా చేసేలా కంపెనీలను సిద్ధం చేశామని చెప్పింది. వివిధ దేశాలకు వ్యాక్సిన్లను ఇవ్వడానికి ముందు జనవరి 19, 20న ఆయా దేశాల ప్రతినిధులకు వ్యాక్సినేషన్‌పై ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పింది. కాగా, ఇప్పటికే వివిధ దేశాలకు రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ ట్యాబ్లెట్లతో పాటు కరోనా టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, గ్లోవ్స్, మాస్కులను పంపించామని పేర్కొంది. విదేశాలకు వ్యాక్సిన్ సరఫరాపై ప్రధాని మోడీ స్పందించారు. భాగస్వామ్య దేశాలకు కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయడం దేశ గౌరవంగా భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ మైత్రి హాష్‌ట్యాగ్‌తో ఆయన ట్వీట్ చేశారు.