ఇండియాకు కాంబినేషన్ సవాల్‌!

ఐపీఎల్‌‌ హంగామా ముగిసింది. ఇండియా, ఇంటర్నేషనల్‌‌ స్టార్ల  బ్యాటింగ్‌‌ పవర్‌‌, బౌలింగ్‌‌ మెరుపులను ఆస్వాదించిన అభిమానులను మరింత అలరించేందుకు ఇండియా–ఆస్ట్రేలియా జట్లు రెడీ అయ్యాయి.  యూఏఈ గడ్డపై రెండు నెలల పాటు రాయల్‌‌ చాలెంజర్స్‌‌ టీమ్‌‌మేట్స్‌‌గా ఉన్న విరాట్‌‌ కోహ్లీ, ఆరోన్‌‌ ఫించ్‌‌ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ ఆడబోతోంది. ఆసీస్‌‌తో అన్ని ఫార్మాట్లలో అమీతుమీ తేల్చుకోబోతోంది. శుక్రవారం నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌‌తో ఈ అల్టిమేట్‌‌ వార్‌‌ మొదలవనుంది. ఈ సారి అన్ని ఫార్మాట్లలో ఆసీస్‌‌ను ఓడించాలని టార్గెట్‌‌గా  పెట్టుకున్న టీమిండియాకు  వైట్‌‌బాల్‌‌ ఫార్మాట్‌‌లో కొన్ని విషయాలు సవాల్‌‌ విసురుతున్నాయి. ఎప్పట్లాగే టీమ్‌‌ కాంబినేషన్‌‌పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కెప్టెన్‌‌ కోహ్లీ, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ వెంటనే సమాధానం వెతకాల్సిన సవాళ్లు ఇవి..

 

వెలుగు స్పోర్ట్స్డెస్క్ఈ టూర్‌‌లో ఇండియా వన్డే, టీ20 జట్లకు లోకేశ్‌‌ రాహుల్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. రెండు జట్లలో రిషభ్‌‌ పంత్‌‌ లేడు కాబట్టి అతనే ఫస్ట్‌‌ చాయిస్‌‌ వికెట్‌‌ కీపర్​ కానున్నాడు. ఆస్ట్రేలియా జనవరిలో ఇండియా టూర్‌‌కు వచ్చినప్పుడు అతనే కీపింగ్‌‌ బాధ్యతలు తీసుకున్నాడు. ముంబైలో తొలి వన్డే తర్వాత రిషబ్‌‌ కాంకషన్‌‌కు గురికావడంతో  రాజ్‌‌కోట్‌‌లో కీపర్‌‌గా వచ్చి ఐదో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు దిగిన అతను 52 బాల్స్‌‌లోనే 80 రన్స్‌‌తో అదరగొట్టాడు. అదే ఫామ్‌‌ను న్యూజిలాండ్‌‌లోనూ కొనసాగించిన లోకేశ్‌‌.. హామిల్టన్‌‌లో 88, మౌంట్‌‌ మాంగనీలో 112 స్కోర్లతో మెప్పించాడు. దాంతో, అతడినే వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా కొనసాగించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. అయితే, మరికొంత కాలం పరీక్షించిన తర్వాతే కీపర్‌‌గా అతని సామర్థ్యాన్ని జడ్జ్‌‌ చేయగలమని అప్పుడు కోహ్లీ అన్నాడు. కానీ, రాహుల్‌‌ టాపార్డర్‌‌లో బ్యాటింగ్‌‌ను ఇష్టపడతాడనంలో సందేహం లేదు. పైగా, ఆసీస్‌‌ టూర్‌‌లో రోహిత్‌‌ లేకపోవడంతో టాపార్డర్‌‌లో ఖాళీ ఏర్పడింది. దాంతో మేనేజ్‌‌మెంట్‌‌ ఆ ప్లేస్‌‌ను రాహుల్‌‌కు కేటాయించి శిఖర్‌‌ ధవన్‌‌తో ఓపెనింగ్‌‌ చేయిస్తుందా? లేదా ? తేలాల్సి ఉంది.

మయాంక్‌‌ X గిల్‌‌

ఒకవేళ రాహుల్‌‌ను ఓపెనర్‌‌గా పంపకూడదని  భావిస్తే శిఖర్​ ధవన్‌‌కు పార్ట్‌‌నర్‌‌ను వెతకాలి. న్యూజిలాండ్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన పృథ్వీ షాను వన్డే టీమ్‌‌ నుంచి తప్పించారు. దాంతో,  టెస్టు ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌, గతేడాది జనవరిలో న్యూజిలాండ్‌‌పై అరంగేట్రం చేసిన తర్వాత నుంచి చాలా టూర్స్‌‌లో రిజర్వ్‌‌ ఓపెనర్‌‌గా ఉన్న శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ మధ్య పోటీ నెలకొంది.  మయాంక్‌‌  ఈ ఏడాది న్యూజిలాండ్‌‌పై మూడు వన్డేల్లో ఆడి నిరాశ పరిచాడు. అది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది. కానీ ఈ ఐపీఎల్‌‌లో అదరగొట్టాడు. పంజాబ్‌‌ తరఫున 11 ఇన్నింగ్స్‌‌ల్లో 424 రన్స్‌‌ చేశాడు. మరోవైపు గిల్‌‌ కోల్‌‌కతా తరఫున 14 ఇన్నింగ్స్‌‌ల్లో 440 రన్స్‌‌తో ఆకట్టుకున్నాడు. మరి, చాన్నాళ్లుగా వన్డే టీమ్‌‌తోపాటు ఉంటున్న గిల్‌‌కు చాన్స్‌‌ ఇస్తుందా? లేక 2023 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాకప్‌‌ ఓపెనర్‌‌గా భావిస్తున్న మయాంక్‌‌నే ఆడిస్తుందా? అనేది చూడాలి. వీరిలో ఒకరు ఓపెనర్‌‌గా వస్తే రాహుల్‌‌ మిడిలార్డర్‌‌లో ఆడొచ్చు. అప్పుడు తుది జట్టులో చాన్స్‌‌ కోసం మనీశ్‌‌ పాండే, శాంసన్‌‌ వెయిట్‌‌ చెయ్యాలి.

పాండ్యా  పాత్ర ఏంటి?

ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా ఏ ఫార్మాట్‌‌లో అయినా జట్టుకు చాలా కీలకం. అయితే, 2018 సెప్టెంబర్‌‌లో ఆసియా కప్‌‌లో బ్యాక్‌‌ ఇంజ్యురీకి హార్దిక్‌‌ సర్జరీ చేయించుకున్న తర్వాత అతని వర్క్‌‌లోడ్‌‌పై టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ జాగ్రత్త తీసుకుంటోంది. పాండ్యా కూడా తొందర పడడం లేదు. అందుకే ఈ ఐపీఎల్‌‌లో అతను స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గానే ఆడాడు. స్లాగ్‌‌ ఓవర్లలో 178.98 స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 281 రన్స్‌‌ చేసిన అతను ముంబై   టైటిల్‌‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.  కీరన్‌‌ పొలార్డ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా తర్వాత బ్యాటింగ్‌‌కు పంపినప్పటికీ  తనదైన శైలిలో స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. అయితే, ఆసీస్‌‌లోనూ అతనే స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా ఉంటాడా? బౌలింగ్‌‌ కూడా చేస్తాడా? అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఒకవేళ  బౌలింగ్‌‌కు దూరమైతే మాత్రం పాండ్యా ఆరో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు పంపే చాన్సుంది. ఐపీఎల్‌‌ మాదిరిగా స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌ చేయమని మేనేజ్‌‌మెంట్‌‌ ప్రోత్సహించొచ్చు.

కుల్దీప్‌‌–చహల్‌‌ ఇద్దరా? ఒక్కరా?

హార్దిక్‌‌ బ్యాటింగ్‌‌కే పరిమితమైతే బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో టాప్‌‌–6లో ఒక్కరు కూడా బౌలింగ్‌‌ చేయలేరు. అప్పుడు ఆల్‌‌రౌండర్‌‌గా రవీంద్ర జడేజా అవసరం ఉంటుంది. జడ్డూ తుది జట్టులో ఉంటే.. మరో స్పిన్నర్‌‌గా కుల్దీప్‌‌ యాదవ్‌‌, యజ్వేంద్ర చహల్‌‌ మధ్య పోటీ ఉంటుంది. 2017 చాంపియన్స్‌‌ ట్రోఫీ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు కోహ్లీ వన్డే బౌలింగ్‌‌ ప్లాన్స్‌‌లో  కుల్చా (కుల్దీప్‌‌–చహల్‌‌) జోడీ కీలకంగా ఉంది. కానీ,ఇటీవల అనేక మార్పులు జరిగాయి. కుల్దీప్‌‌ ఫామ్‌‌ కోల్పోయాడు. ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా అతడిని ఐదు  మ్యాచ్‌‌ల్లోనే ఆడించింది. న్యూజిలాండ్‌‌ టూర్‌‌లోనూ మూడు వన్డేల్లో ఒక్కదానిలోనే చాన్స్‌‌ వచ్చింది. అదే టైమ్‌‌లో ఈ ఐపీఎల్‌‌లో ఆర్‌‌సీబీ తరఫున 21 వికెట్లు తీసినచహల్‌‌ స్పెషలిస్ట్‌‌ స్పిన్నర్‌‌గా బరిలోకి దిగడం ఖాయమే అనొచ్చు.  మరి, మేనేజ్‌‌మెంట్‌‌ ఎవరిపై నమ్మకం ఉంచుతుందో చూడాలి.

పేస్‌‌ కాంబినేషన్ ఎలా?

ఈ టూర్‌‌లో ఫాస్ట్‌‌ బౌలర్లను రొటేట్‌‌ చేయాలని ఇండియా భావిస్తోంది. ముఖ్యంగా టెస్టుల్లో కీలకం కానున్న బుమ్రా, షమీ వర్క్‌‌లోడ్‌‌ను మానిటర్‌‌ చేయనుంది. టీ20ల్లో ఇద్దరికీ రెస్ట్‌‌ ఇచ్చి లేదా రొటేట్‌‌ చేసి ఆ సిరీస్‌‌తో పాటే జరిగే రెడ్‌‌ బాల్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లో ఆడించాలని చూస్తోంది. అన్ని ఫార్మాట్లకు ఎంపికైన నవదీప్‌‌ సైనీ వర్క్‌‌లోడ్‌‌పై కూడా మేనేజ్‌‌మెంట్‌‌ దృష్టి పెట్టనుంది. ఈ ముగ్గురికి అదనంగా వన్డేల్లో శార్దుల్‌‌ ఠాకూర్‌‌, టీ20ల్లో దీపక్‌‌ చహర్‌‌, నటరాజన్‌‌ ఉన్నారు. హార్దిక్‌‌ పాండ్యా బౌలింగ్‌‌ చేసే చాన్సెస్‌‌ తక్కువగా ఉన్న నేపథ్యంలో బుమ్రా, షమీ, సైనీ వర్క్‌‌లోడ్‌‌ను ఎలా మేనేజ్‌‌ చేస్తారన్నది ఆసక్తికరం. అలాగే, వన్డే, టీ20ల్లో ఆసీస్‌‌ పిచ్‌‌లపై ఇండియా ఎలాంటి పేస్‌‌ కాంబినేషన్‌‌తో బరిలోకి దిగుతుందో మరి.

 

Latest Updates