ఇండియా కుర్రాళ్లే.. ఆసియా నవాబులు

ఇండియా యువ క్రికెటర్లు ఇరగదీశారు. అండర్‌‌–19 ఆసియాకప్‌‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించారు. ఇరవై ఏళ్ల నుంచి కప్పు కోసం తపిస్తున్న ప్రత్యర్థి బంగ్లాదేశ్‌‌కు మరోసారి ఏడుపే మిగిల్చుతూ.. ఏడోసారి ట్రోఫీ కైవసం చేసుకొని శభాష్‌‌ అనిపించారు..! గ్రూప్‌‌ దశలో హ్యాట్రిక్‌‌ విజయాలతో అదరగొట్టిన ఇండియా.. తుదిపోరులోనూ అసాధారణ ఆటతో చెలరేగింది..! బ్యాటింగ్‌‌లో విఫలమైనా బౌలింగ్‌‌లో మాత్రం రెచ్చిపోయింది..! లెఫ్టామ్‌‌ స్పిన్నర్‌‌ అథర్వ అంకోలేకర్‌‌ (5/28) మాయాజాలంతో చిన్న టార్గెట్‌‌ను కాపాడుకొని బంగ్లాపై అద్భుత విక్టరీ కొట్టి టైటిల్‌‌ నిలబెట్టుకుంది..!

కొలంబో: అండర్‌‌–19 ఆసియాకప్‌‌ మరోసారి ఇండియా సొంతమైంది. స్పిన్నర్‌‌ అథర్వ అంకోలేకర్‌‌ తోపాటు పేసర్‌‌ ఆకాశ్‌‌ సింగ్‌‌ (3/12) అద్భుత బౌలింగ్‌‌తో చెలరేగడంతో 106 పరుగుల టార్గెట్‌‌ను కాపాడుకున్న టీమిండియా ఐదు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రేమదాస స్టేడియంలో శనివారం జరిగిన ఈ లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో టాస్‌‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 32.4 ఓవర్లలో 106 రన్స్‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌ ధ్రువ్‌‌ జురెల్‌‌ (33), లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కరణ్‌‌ లాల్‌‌ (37)  సత్తా చాటారు. ఓపెనర్లు సువెద్‌‌ పార్కర్‌‌ (4), అర్జున్‌‌ ఆజాద్‌‌ (0), హైదరాబాదీ తిలక్‌‌ వర్మ (2) చేతులెత్తేయడంతో ఆరంభంలోనే 8/3తో కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్‌‌ జురెల్‌‌ ఆదుకున్నాడు. సుశాంత్‌‌ రావత్‌‌ (19)తో నాలుగో వికెట్‌‌కు 45 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, రావత్‌‌ను ఔట్‌‌ చేసి ఈ జోడీని విడదీసిన స్పిన్నర్‌‌ షమీమ్‌‌ హుస్సేన్‌‌ ( 3/8) కాసేపటికే వరుణ్‌‌ లవాండే (0), జురెల్‌‌ను పెవిలియన్‌‌ చేర్చి దెబ్బకొట్టాడు. అథర్వ (2) రనౌటవడంతో 21 ఓవర్లకు ఇండియా 62/7తో  నిలిచింది. ఈ దశలో వేగంగా ఆడిన ఆల్‌‌రౌండర్‌‌ కరణ్‌‌ లాల్‌‌ టెయిలెండర్ల సాయంతో స్కోరు వంద దాటించి బంగ్లా పేసర్‌‌ మృతుంజయ్‌‌ చౌధురీ (3/18) బౌలింగ్‌‌లో చివరి వికెట్‌‌గా వెనుదిరిగాడు.

అనంతరం చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బంగ్లాదేశ్‌‌ 33 ఓవర్లలో 101 రన్స్‌‌కే కుప్పకూలి ఓడిపోయింది. పేసర్‌‌ ఆకాశ్‌‌ దెబ్బకు 4.1 ఓవర్లలో 16 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌‌ అక్బర్‌‌ అలీ (23), మృతుంజయ్‌‌(21)  ఆదుకున్నారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు బంగ్లా ఆశలు సజీవంగా ఉన్నాయి. ఏడో వికెట్‌‌కు కీలకమైన 27 రన్స్‌‌ జోడించడంతో ఓ దశలో 78/6తో ఆ జట్టు విజయం దిశగా సాగింది. కానీ, అప్పటికే రెండు వికెట్లు తీసిన అంకోలేకర్‌‌ 21వ ఓవర్లో అక్బర్‌‌ అలీని ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను మలుపుతిప్పాడు. చివర్లో టెయిలెండర్లు  హసన్‌‌ షకీబ్‌‌ (12), రకిబుల్‌‌ (11 నాటౌట్‌‌) ఇండియా శిబిరంలో గుబులు రేపారు. అయితే, 33వ ఓవర్లో షకీబ్‌‌తో పాటు ఆలమ్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన అంకోలేకర్‌‌ ఇండియాను గెలిపించాడు.  అతనికే మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

Latest Updates