T20: ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై ఇండియా విజయం

న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ గ్రౌండ్ లో జరిగిన మొదటి T20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్యజట్టు న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. 204 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 29 బంతులాడి 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 45 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ కొలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు. షమీకి ఒక్క వికెట్ కూడా పడలేదు.

రెండు జట్ల మధ్య రెండో T20 మ్యాచ్ ఇదే గ్రౌండ్ లో జనవరి 26 ఆదివారం జరగనుంది.

Latest Updates