మన బ్రాండ్ విలువ పెరిగింది

  • రూ. కోటి 82 లక్షల కోట్లు.. 19% వృద్ధి

ఒక కోటి 82 లక్షల కోట్ల రూపాయలు.. ఇదీ మన దేశం బ్రాండ్ విలువ. ఈ ఏడాది మన బ్రాండ్ విలువ ఏకంగా 19% పెరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ బ్రాండ్ విలువ ఉన్న దేశాల్లో ఇండియా7వ స్థానంలో నిలిచింది. బ్రిటన్ కు చెందిన ‘బ్రాండ్ ఫైనాన్స్’ అనే కన్సల్టెన్సీ సంస్థ ‘అత్యంత విలువైన దేశాల బ్రాండ్స్‌‌’ జాబితాలో ఆయా దేశాలకు ర్యాంకులను ప్రకటించింది. ఇందులో మన దేశం బ్రాండ్ విలువ సుమారు 2.56 లక్షల కోట్ల డాలర్లు (రూ.1.82 కోట్ల కోట్లు) ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఈ సంవత్సరం లిస్ట్ లో ఇండియా గత ఏడాది కన్నా 2 స్థానాలు పైకి ఎగబాకింది. ‘‘ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇండియన్ ఎకానమీ త్వరగా కోలుకుని వేగంగా వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల మాత్రం మాన్యుఫాక్చరింగ్, కన్ స్ట్రక్షన్ సెక్టార్లు నెమ్మదై, వృద్ధి రేటు కొంత తగ్గిపోయింది” అని ఆ సంస్థ రిపోర్ట్ లో పేర్కొంది.

టాప్ 5 దేశాలు ఇవే..

అమెరికా 27.71 లక్షల కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో  ప్రపంచంలో నెంబర్ వన్‌‌గా నిలిచింది. ఆ తర్వాత చైనా 19.48 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానం పొందింది. చైనా బ్రాండ్ విలువ గత ఏడాది కాలంలో ఏకంగా 40% పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. ఇక జర్మనీ 4.85 లక్షల కోట్ల డాలర్లతో మూడో ర్యాంకులో, జపాన్ 4.53 లక్షల కోట్ల డాలర్లతో నాలుగో ర్యాంకులో నిలిచాయి. జపాన్ బ్రాండ్ వాల్యూ 26% పెరిగింది. బ్రిటన్ 2.85 లక్షల కోట్ల డాలర్లతో ఐదో స్థానానికి పడిపోయింది. 2019లో బ్రాండ్ వాల్యూ వేగంగా పెరుగుతున్న 20 దేశాల్లో 11 దేశాలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది లిస్ట్ లో టర్కీ అత్యధికంగా 47% బ్రాండ్ విలువ కోల్పోయి56 వేల కోట్ల డాలర్లకు పడిపోయిందని బ్రాండ్‌‌ ఫైనాన్స్‌‌ తన రిపోర్టులో తెలిపింది.

Latest Updates