స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్

మన దేశానిది రెండో ప్లేస్

ఫస్ట్‌ ర్యాంక్‌ మాత్రం ఇప్పటికీ చైనాదే

మనదేశంలో నం.1 స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్‌ షావోమీ

న్యూఢిల్లీ: ఇండియా స్మార్ట్‌‌ఫోన్‌ మార్కెట్‌ రాకెట్‌లా దూసుకుపోతోంది. మిగతా రంగాల్లో అమ్మకాలు డల్‌గా ఉన్నప్పటికీ ఫోన్లకు మాత్రం డిమాండ్‌ కొంచెం కూడా తగ్గడం లేదు. వీటి మార్కెట్‌ ఎంతలా పెరుగుతున్నది అంటే, స్మార్ట్‌‌ఫోన్ల అమ్మకాల్లో ఇండియా అమెరికాను మించిపోయింది!! గత ఏడాది స్మార్ట్‌‌ఫోన్‌ మార్కెట్‌ 15.8 కోట్ల షిప్‌మెంట్లను రికార్డు చేసిందని కౌంటర్‌‌ పాయింట్‌ రీసెర్చ్‌ స్టడీ తెలిపింది. 2018తో పోలిస్తే గత ఏడాది షిప్‌మెంట్ల సంఖ్య ఏడుశాతం పెరిగింది. ఇప్పటికీ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌ కాగా, ఇండియా, అమెరికాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. చైనా కంపెనీలు ఫ్లాగ్‌ షిప్‌ గ్రేడ్‌ ఫీచర్లను మిడ్‌ రేంజ్‌ ఫోన్లలోనే ఇస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఇది విశ్లేషించింది. సాధారణ ఫోన్‌ వాడేవాళ్లు ఇలాంటి మిడ్‌ రేంజ్‌ ఫోన్లు కొంటుండంతో షిప్‌మెంట్లు ఎక్కువయ్యాయని తెలిపింది.

ఫ్లాగ్‌ షిప్‌ఫీచర్లతో తక్కువ ధరలు ఉన్న మోడల్స్ ఆన్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈసారి స్మార్ట్‌‌ఫోన్​ మార్కెట్‌ గ్రోత్‌ రేటు వార్షికంగా ఒకే అంకెకు పరిమితమయింది. ‘‘ఇతర టెలికాం మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో స్మార్ట్‌‌ఫోన్ల వాడకం కాస్త తక్కువగానే ఉంది. మొత్తం స్మార్ట్‌‌ఫోన్‌ యూజర్లలో 4జీ వాడకం దారుల వాటా 55 శాతం వరకు ఉంది’’ అని కౌంటర్ పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌‌ తరుణ్ పాఠక్‌ వివరించారు. ఇండియాలో చాలా మంది ఫీచర్‌‌ ఫోన్‌ యూజర్లు స్మార్ట్‌‌ఫోన్‌ కొంటున్నారు కాబట్టి వీటికి మరింత డిమాండ్‌ పెరుగుతుందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థలు చెబుతున్నాయి. బడ్జెట్‌ ఫోన్లలోనే అన్ని ఫీచర్లు అందుబాటులోకి రావడం, కంపెనీల మధ్య విపరీతమైన పోటీ.. అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతుందని అంటున్నాయి.

షావోమీ నంబర్‌ వన్‌‌ఇండియా స్మార్ట్‌‌ఫోన్ల మార్కెట్‌లో గత ఏడాది షావోమీ మొదటిస్థానంలో నిలిచింది. మార్కెట్‌ షేర్‌‌ను ఏకంగా 28 శాతానికి పెంచుకుంది. శామ్‌సంగ్‌కు 21 శాతం, వివోకు 16 శాతం, రియల్‌ మీకి 10 శాతం, ఒప్పోకు తొమ్మిది శాతం వాటా ఉన్నట్టు కౌంటర్‌‌ పాయింట్‌ ప్రకటించింది. అయితే గత ఏడాది చివరి క్వార్టర్‌‌లో వివో.. శామ్‌సంగ్‌ను దాటేసి రెండో స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబరు క్వార్టర్‌‌లో షావోమీ మొదటి స్థానానికి ఎగబాకింది. 2018లో ఇండియాలో చైనా స్మార్ట్‌‌ఫోన్‌ బ్రాండ్ల వాటా 60 శాతం కాగా, గత ఏడాది ఇది 72 శాతానికి చేరింది. రిటైల్, ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా ఇవి మార్కెట్‌ షేర్‌‌ను పెంచుకున్నా యి. షావోమీ, రియల్‌ మీ, వన్‌ ప్లస్‌లు ఆన్‌లైన్‌తో పాటు

ఆఫ్‌లైన్‌లోనూ అమ్మకాలను పెంచుకోగలిగాయి. జెడ్‌, యూ సిరీస్‌ ఫోన్ల ద్వారా వివో ఆన్‌లైన్‌ వాటానుపెంచుకుంది. ఎక్స్‌ ఆర్‌‌ వంటి ఫోన్లపై ధరలను తగ్గించడంతో నాలుగో క్వార్టర్‌‌లో ఆపిల్‌ ఫోన్లకూ ఆదరణ పెరిగింది. ఐఫోన్‌ 11 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు కూడా బాగున్నాయని కౌంటర్‌‌ పాయింట్‌కు చెందిన ఆషికా జైన్‌ అన్నారు. అయితే ఫీచర్‌‌ ఫోన్ మార్కెట్‌ మాత్రం గత ఏడాది 42 శాతం పడిపోయింది. రిలయన్స్‌ జియో ఫీచర్‌‌ ఫోన్‌ షిప్‌మెంట్లు కూడా చాలా తగ్గాయి. ఈ సెగ్మెంట్‌ గ్రోత్‌ తగ్గినా నోకియా, ఐటెల్‌, లావా, మైక్రోమాక్స్‌ ఫోన్లు బాగానే అమ్ముడయ్యాయి. డిసెంబరు క్వార్టర్‌‌లో ఐటెల్‌ బ్రాండ్‌ నంబర్‌‌వన్‌ ఫీచర్‌‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. శామ్‌ సంగ్‌, లావా రెండుమూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

Latest Updates