తొలి టీ20లో కష్టపడి నెగ్గిన ఇండియా

  • చెలరేగిన నవదీప్‌‌ సైనీ
  • రాణించిన భువీ నేడు రెండో టీ20
  • చిన్న టార్గెట్​కే చెమటోడ్చిన ఆటగాళ్లు

అచ్చొచ్చిన ఫార్మాట్‌‌లో విండీస్‌‌ వీరులు తుస్సుమనిపించారు. ముందు బ్యాట్స్‌‌మెన్‌‌ పెవిలియన్‌‌కు క్యూ కడితే.. తర్వాత బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని కాచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు.వరల్డ్‌‌కప్‌‌ తర్వాత  తొలిసారి గ్రౌండ్‌‌లోకి అడుగుపెట్టిన కోహ్లీసేన.. లోస్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో ఆపసోపాలు పడి గట్టెక్కెంది.  టీ20 చాంపియన్స్‌‌ను బౌలర్లు డబుల్‌‌ డిజిట్‌‌ స్కోరుకే కట్టడి చేస్తే.. చిన్న టార్గెట్‌‌ను చాలా కష్టపడి ఛేజ్‌‌ చేసి పరువు దక్కించుకుంది. మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ మరోసారి విఫలమవగా, అరంగేట్ర బౌలర్‌‌ నవదీస్‌‌ సైనీ సూపర్‌‌ స్పెల్‌‌ ఈ మ్యాచ్‌‌లో ఇండియాకు బోనస్‌‌.

లాడర్‌‌హిల్స్‌‌: నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు..!  ఒక ఓవర్‌‌ మెయిడిన్‌‌.. అది కూడా ఇన్నింగ్స్‌‌ చివరిది కావడం. ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌లో తొలి మ్యాచ్‌‌ ఆడుతున్న ఓ యువ పేసర్‌‌కు టీ20ల్లో ఇంతకంటే గొప్ప స్టార్ట్‌‌ దొరకదేమో.  టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల నవదీప్‌‌ సైనీ(4–1–17–3)… షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో రెచ్చిపోయే వెస్టిండీస్‌‌ ఆటగాళ్లకు తన పేస్‌‌ రుచి చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఓ రేంజ్‌‌లో ఎంట్రీ ఇచ్చాడు.  సైనీకి తోడు మిగతా బౌలర్లంతా సత్తా చాటడంతో వెస్టిండీస్‌‌తో శనివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. కీరన్‌‌ పొలార్డ్‌‌ (49 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 49) ఒంటరి పోరాటం చేశాడు. సైనీతో పాటు భువనేశ్వర్‌‌(2/19) రెండు వికెట్లతో రాణించాడు. ఛేజింగ్‌‌లో 17.2 ఓవర్లు ఆడిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. రోహిత్‌‌శర్మ (24) టాప్‌‌ స్కోరర్‌‌.  విండీస్‌‌ బౌలర్లలో కొట్రెల్‌‌, నరైన్‌‌, కీమో పాల్‌‌ తలో రెండేసి వికెట్లు తీశారు. రెండో టీ20 ఆదివారం జరగుతుంది.

 విండీస్‌‌ విలవిల

టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌కు టీమిండియా బౌలర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. విండీస్‌‌ ఓపెనర్లిద్దరినీ  డకౌట్‌‌ చేశారు. కొత్త బంతితో ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించిన స్పిన్నర్‌‌ సుందర్‌‌..  రెండో బంతికే ఓపెనర్‌‌ జాన్‌‌ క్యాంప్‌‌బెల్‌‌(0)ను ఔట్‌‌ చేయగా, మరో ఓపెనర్‌‌ ఎవిన్‌‌ లూయిస్‌‌(0)ను రెండో ఓవర్‌‌లో భువనేశ్వర్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. క్యాంప్‌‌బెల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో క్రునాల్‌‌ అందుకున్నాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన నికోలస్‌‌ పూరన్‌‌(20) ఓ ఫోర్‌‌, రెండు సిక్స్‌‌లు కొట్టి స్కోరుబోర్డును కదిలించాడు. అయితే సైనీ రాకతో విండీస్‌‌ కష్టాలు డబులయ్యాయి.  ఐదో ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన సైనీ వరుస బంతుల్లో పూరన్‌‌, హెట్‌‌మయర్‌‌(0)ను ఔట్‌‌ చేసి విండీస్‌‌ను కష్టాల్లోకి నెట్టాడు. పూరన్‌‌ కీపర్‌‌ పంత్‌‌కు దొరికి పోగా, హెట్‌‌మయర్‌‌ బౌల్డ్‌‌ అయ్యాడు. అప్పటికే క్రీజులో ఉన్న పొలార్డ్‌‌కు జత కలిసిన రోమన్‌‌ పావెల్‌‌(4) కూడా ఇలా వచ్చి అలావెళ్లిపోయాడు. అతను  ఖలీల్‌‌కు వికెట్‌‌ ఇచ్చాడు. దీంతో పవర్‌‌ప్లేలోనే  సగం జట్టు పెవిలియన్‌‌ చేరడంతో విండీస్‌‌ పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

ఈ దశలో  క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌‌ బ్రాత్‌‌వైట్‌‌(9), పొలార్డ్‌‌తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరూ నెమ్మదిగా 13వ ఓవర్‌‌లో జట్టు స్కోరును హాఫ్‌‌ సెంచరీ మార్కు దాటించారు. అయితే బౌలర్లను మారుస్తూ కోహ్లీ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. 15వ ఓవర్‌‌లో  బ్రాత్‌‌వైట్‌‌ ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ అందుకున్న క్రునాల్ ఈ జోడీని విడదీశాడు. దీంతో ఆరో వికెట్‌‌కు 34 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత సునీల్‌‌ నరైన్‌‌(2).. జడ్డూ వేసిన 16వ ఓవర్‌‌లో భారీ షాట్‌‌ కు పోయి ఖలీల్‌‌కు దొరికిపోయాడు. భువీ వేసిన 17వ ఓవర్‌‌లో ఓ ఫోర్‌‌, సైనీ వేసిన 18వ ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టిన పొలార్డ్‌‌  స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. భువీ వేసిన 19వ ఓవర్‌‌లో కిమో పాల్‌‌(3) ఔటైనా పొలార్డ్‌‌ మరో సిక్స్‌‌ కొట్టాడు.  హాఫ్‌‌ సెంచరీకి చేరువైన పొలార్డ్‌‌ను ఇన్నింగ్స్‌‌ లాస్ట్‌‌ ఓవర్‌‌లో ఔట్‌‌ చేసిన సైనీ విండీస్‌‌ స్కోరు మూడంకెలు చేరకుండా అడ్డుపడ్డాడు.

 పడుతూ లేస్తూ..

చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా తంటాలు  పడింది. విండీస్‌‌ బౌలర్ల క్రమశిక్షణకు ఏ ఒక్కరూ కుదురుగా క్రీజులో నిలవలేకపోయారు. ఛేజింగ్‌‌లో ఇండియాకు సరైన ఆరంభమే దొరకలేదు.  ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ రీఎంట్రీలో (1) తీవ్ర నిరాశపరిచాడు.  క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డిన అతను ఇన్నింగ్‌‌ రెండో ఓవర్‌‌లో కొట్రెల్‌‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మూడో ఓవర్‌‌లోనే కెప్టెన్‌‌ కోహ్లీ (19)  క్రీజులోకి వచ్చాడు. థామస్‌‌ వేసిన మూడో ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి వరల్డ్‌‌కప్‌‌ ఫామ్‌‌ కొనసాగించిన మరో ఓపెనర్‌‌ రోహిత్‌‌శర్మ, ఆ తర్వాత రెండు ఫోర్లు , మరో సిక్స్‌‌ కూడా కొట్టాడు.

అయితే ఏడో ఓవర్‌‌లో వరుస బంతుల్లో రోహిత్‌‌, రిషబ్‌‌పంత్(0)ను ఔట్‌‌ చేసిన నరైన్‌‌ ఇండియాను డిఫెన్స్‌‌లోకి నెట్టేశాడు. ఆ ఓవర్‌‌ మూడో బంతికి భారీ షాట్‌‌ ఆడిన రోహిత్‌‌ లాంగాన్‌‌లో పొలార్డ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు.  క్రీజులోకి రాగానే అనవసర షాట్‌‌కు పోయిన పంత్‌‌  డీప్‌‌లో కొట్రెల్‌‌కు దొరికిపోయాడు. దీంతో కోహ్లీకి మనీశ్‌‌ పాండే(19)  జతకలవగా పది ఓవర్లు ముగిసే సరికి ఇండియా 52/3పై నిలిచింది. అయితే మనీశ్‌‌, కోహ్లీని వెంటవెంటనే ఔట్‌‌ చేసిన విండీస్‌‌ బౌలర్లు మ్యాచ్‌‌లో తొలి సారి పైచేయి సాధించారు. కీమోపాల్‌‌ 12వ ఓవర్‌‌లో మనీశ్‌‌ను బౌల్డ్‌‌ చేయడంతో క్రునాల్‌‌ క్రీజులోకి వచ్చాడు. అయితే  కొట్రెల్‌‌ వేసిన 14వ ఓవర్‌‌లో కోహ్లీ కూడా ఔటయ్యాడు. దీంతో క్రునాల్‌‌ (12)కు జడేజా(10 నాటౌట్‌‌)  జత కలిశాడు.  16వ ఓవర్‌‌లో క్రునాల్‌‌ను కిమో పాల్‌‌ బౌల్డ్‌‌ చేయడంతో మ్యాచ్‌‌లో ఒక్కసారిగా టెన్షన్‌‌ రేగింది. అయితే జడేజా, వాషింగ్టస్‌‌ సుందర్‌‌(8 నాటౌట్‌‌) జాగ్రత్తగా ఆడి మరో 16 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌‌ను ముగించారు.

స్కోర్‌‌బోర్డ్‌‌

వెస్టిండీస్‌‌ : క్యాంప్‌‌బెల్‌‌ (సి) క్రునాల్‌‌ (బి) సుందర్‌‌ 0, లూయిస్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 0, పూరన్‌‌ (సి) పంత్‌‌ (బి)సైనీ 20, పొలార్డ్‌‌ (ఎల్బీ) సైనీ 49, హెట్‌‌మయర్‌‌(బి) సైనీ 0, పావెల్‌‌ (సి) పంత్‌‌(బి) ఖలీల్‌‌ 4, బ్రాత్‌‌వైట్‌‌(సి అండ్‌‌ బి) క్రునాల్‌‌ 9, నరైన్‌‌ (సి) ఖలీల్‌‌(బి) జడేజా 2, పాల్‌‌ (సి) కోహ్లీ (బి) భువనేశ్వర్‌‌ 3, కొట్రెల్‌‌ (నాటౌట్‌‌) 0, థామస్‌‌ (నాటౌట్‌‌) 0 ; ఎక్స్‌‌ట్రాలు : 8 ; మొత్తం : 20 ఓవర్లలో 95/9 ; వికెట్ల పతనం : 1–0, 2–8, 3–28, 4–28, 5–33, 6–67, 7–70, 8–88, 9–95; బౌలింగ్‌‌: సుందర్‌‌ 2–0–18–1, భువనేశ్వర్‌‌ 4–0–19–2, సైనీ 4–1–17–3, ఖలీల్‌‌ 2–0–8–1, క్రునాల్‌‌ 4–1–20–1,  జడేజా 4–1–13–1.

ఇండియా: రోహిత్‌‌(సి) పొలార్డ్‌‌ (బి) నరైన్‌‌ 24, ధవన్‌‌ (ఎల్బీ) కొట్రెల్‌‌ 1, కోహ్లీ (సి) పొలార్డ్‌‌ (బి) కొట్రెల్‌‌ 19, పంత్‌‌ (సి) కొట్రెల్‌‌ (బి) నరైన్‌‌ 0, మనీశ్‌‌ (బి) కీమోపాల్‌‌ 19, క్రునాల్‌‌(బి) పాల్‌‌ 12, జడేజా(నాటౌట్‌‌) 10,  సుందర్‌‌ (నాటౌట్‌‌) 8; ఎక్స్‌‌ట్రా లు: 5 ; మొత్తం: 17.2 ఓవర్లలో 98/6; వికెట్ల పతనం: 1–4, 2–32, 3–32, 4–64, 5–69, 6–88; బౌలింగ్‌‌: థామస్‌‌ 4–0–29–0, కొట్రెల్‌‌ 4–0–20–2, నరైన్‌‌ 4–0–14–2, కీమోపాల్‌‌ 3.2–0–23–2, బ్రాత్‌‌వైట్‌‌ 2–0–12–0.

Latest Updates