అణు‘శక్తి’ మనకే ఎక్కువ

ఇండియా, పాక్​ దేశాలు న్యూక్లియర్​ వెపన్స్​ విషయంలో పోటీ పడుతున్నాయి. కాశ్మీర్​ను చూపించి పాకిస్తాన్​​ కాలుదువ్వుతోంది.  ప్రపంచ దేశాలు కాశ్మీర్​ సమస్యని అంతర్జాతీయ కోణంలో చూడడం లేదు. మీరూ మీరూ చూసుకోండని పాక్​కి స్పష్టం చేసేశాయి. బయట పప్పులు ఉడకకపోవడంతో పాక్​ పరోక్ష బెదిరింపులకు దిగింది.

దక్షిణాసియాలోనే కాకుండా, మొత్తం ప్రపంచానికే న్యూక్లియర్​ వెపన్స్​ చాలెంజ్​ విసిరే దేశాలు ఇండియా, పాకిస్తాన్​​. రెండు దేశాల మధ్య ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా మిగతా ప్రపంచం చాలా టెన్షన్​ పడుతుంది. ఈ రెండు దేశాల దగ్గర దాదాపు 300 న్యూక్లియర్​ వెపన్స్​ ఉండడం ఒక కారణమైతే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం (ఎన్పీటీ)పై ఇండియా సంతకం చేయకపోవడం మరో కారణం. మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమన్న కారణంతో ఇండియా ఈ ఒప్పందానికి దూరంగా ఉంది. పాకిస్తాన్​​ మాత్రం గడియకో మాట మాట్లాడుతూ దానిపై సంతకానికి నిరాకరించింది. 2010 వరకు ఎన్పీటీపై పాక్​ స్టాండ్​ వేరుగా ఉండేది. ఇండియా సంతకం చేస్తేనే ఒప్పందానికి తాను ఒప్పుకుంటానని చెప్పేది. ఆ తర్వాత మాట మార్చింది. తనను అణ్వాయుధ దేశంగా గుర్తిస్తేనే ఎన్పీటీలో చేరతానని మెలిక పెట్టింది. మొత్తం మీద ఉపఖండంలోని ప్రధాన దేశాలైన ఇండియా, పాకిస్తాన్​​లు ఎన్పీటీకి దూరంగానే ఉన్నాయి.

తాజాగా పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ న్యూక్లియర్​ వెపన్స్​లో తామే ముందున్నామన్న సంకేతాల్నిచ్చారు. ‘ఇండియా దగ్గర, మా దగ్గరకూడా న్యూక్​ వెపన్స్​ ఉన్నాయి. సమ ఉజ్జీలం కానప్పుడు తెలివిగా ప్రవర్తించాలని ఇండియాకి సూచిస్తున్నా’ అన్నారు. వాజ్​పేయి ప్రధానిగా ఉండగా, 1998లో పోఖ్రాన్​ అణు పరీక్షలు జరిగాయి. ఆ వెంటనే పాక్​ కూడా న్యూక్లియర్​ టెస్టులు జరిపించింది. ఇండో పాక్​ దేశాల దగ్గరున్నవి ఫ్రాన్స్​, చైనాలతో పోలిస్తే చాలా తక్కువే కావచ్చు, కానీ ఎన్పీటీలో లేని దేశాలు అణ్వాయుధ శక్తిని సమకూర్చుకోవడమనేది ప్రపంచానికి ఎప్పుడూ భయమే. 2017లో స్టాక్​హోమ్​ ఇంటర్నేషనల్​ పీస్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ అంచనా ప్రకారం… మన దగ్గర 140 న్యూక్లియర్​ వార్​హెడ్స్​ ఉన్నాయి.  పాకిస్తాన్​ దగ్గర 160 ఉన్నాయి. పేరుకు ఎక్కువే అయినా పవర్​ చూసుకుంటే మనదే పై చేయి.  ఎన్పీటీలో లేని ఒక పెద్ద దేశంలో ఏటా  న్యూక్​ వెపన్స్​ పెరగడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. పైగా, ఇండియా ‘ట్రియాడ్​ (భూమి, ఆకాశం, సముద్రం నుంచి)’ న్యూక్లియర్​ బాంబులను ప్రయోగించగల సత్తాతో ఉంది. ఇండియా నేలపైనుంచి ప్రయోగించగల అగ్ని–3 బాలిస్టిక్​ మిస్సైల్​ రేంజ్​ 2,000 మైళ్లు. దాదాపు 3,219 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్​ని కొట్టగలదు. రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్​ క్రూయిజ్​ మిస్సైల్​ని ట్రియాడ్​గా (మూడు చోట్ల నుంచి) ప్రయోగించవచ్చు.  న్యూక్లియర్​ బాంబులను వదిలేవిధంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ యుద్ధవిమానాలను మార్చారు. వీటితోపాటుగా 6,000 టన్నుల కెపాసిటీతో అరిహంత్​ బాలిస్టిక్​ మిస్సైల్​ సబ్​మెరైన్​ని పూర్తిగా మన సైంటిస్టులే తయారు చేశారు.

గిరి దాటని ఇండియా

ప్రపంచంలో అనేక దేశాల్లో అణ్వాయుధాలున్నప్పటికీ 1967కి ముందుగా అణు ప్రయోగాలు జరిపి, అణ్వాయుధాలు కలిగిన దేశాలనే న్యూక్లియర్​ కంట్రీస్​గా పిలుస్తుంటారు. అప్పటికే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్​ దేశాలు అణు రంగంలో చాలా ముందున్నాయి. ఆ మరుసటి ఏడాదిలోనే ఎన్పీటీని తెచ్చారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలేవీ అణు పరీక్షలకు, అణ్వాయుధాలకు తమ దగ్గరున్న న్యూక్లియర్​ ఫ్యూయల్​ని వినియోగించకూడదు. కరెంటు వంటి ప్రజావసరాలకోసమే వాడాల్సి ఉంటుంది. ఎన్పీటీలో చేరకపోయినా, ఇండియా ఎక్కడా గిరి దాటివెళ్లడం లేదు. న్యూక్​ ఫ్యూయల్​తో దేశంలో కరెంట్​ ప్రొడక్షన్​కే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు ‘నో ఫస్ట్​ యూజ్​ (ముందు మేం ప్రయోగించం)’ అనే పాలసీతో ఉంది.  అయితే, ఇప్పుడీ పాలసీకి గుడ్​బై చెప్పినట్లేనని రాజ్​నాథ్​ సింగ్​ మాటలవల్ల తెలుస్తోంది. మొదట మేమే ప్రయోగించకూడదనే పట్టింపు ఏమీ ఉండదని ఆయన చెప్పారంటే అర్థం అంతే కదా!

పాక్​కు అణు సబ్​మెరైన్లు లేవు

పాక్​ దగ్గర  2016లో 130 ఉండగా, 2017లో 140, 2019 నాటికి 160 న్యూక్లియర్​ వార్​హెడ్స్​ పెరిగాయి. అయితే, వాటిని ప్రయోగించే విషయంలో ఇండియాకున్నంత సత్తా లేదని స్టాక్​హోమ్​ ఇనిస్టిట్యూట్​ తేల్చింది.  పాక్​ బాలిస్టిక్​ మిస్సైల్​ రేంజ్​ 1,200 మైళ్లు (దాదాపు 1931 కిలోమీటర్లు) మాత్రమే. ఇక అణ్వాయుధాలు ప్రయోగించగల సబ్​మెరైన్లు పాక్​ దగ్గర లేవు. కాకపోతే, ఇండియాతో పోలిస్తే పాక్​ డిఫెన్స్​ బడ్జెట్​ 9 శాతం ఎక్కువ. మొత్తం బడ్జెట్​లోనే 16 శాతాన్ని డిఫెన్స్​ రంగానికి కేటాయిస్తోంది. ప్లూటోనియం రియాక్టర్లు కూడా ఇండియాకంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటివల్ల ఏటా 20 న్యూక్లియర్​ వార్​హెడ్స్​ని తయారు చేయడానికి వీలుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.  మన దేశానికిగల సంప్రదాయిక గ్రౌండ్​ బేస్డ్​​ సైనిక శక్తిని ఢీకొట్టడానికి వీలుగా షార్ట్​ రేంజ్​ న్యూక్లియర్​ మిస్సైళ్లపై పాక్​ బాగా ఫోకస్​ పెట్టింది.

Latest Updates