ఈ వేదన తీరనిది..కోలుకోవడం కష్టమే!

వెలుగు క్రీడా విభాగం : పెద్దగా కష్టపడకుండానే వరుస విజయాలు వస్తుంటే ఎంత అనందమో. టాపార్డర్‌‌లో ఒకరి మించి మరొకరు అన్నట్టు పరుగుల వరద పారిస్తుంటే  ఎంత సంతోషమో. ఇప్పుడు కాకుంటే మరెప్పుడు అన్నట్టు పేసర్లు వికెట్లను వేటాడేస్తుంటే ఎంత సంబరమో. లీగ్‌‌ దశలో ఇండియా టాపర్‌‌గా నిలిచినప్పుడు.. మన సెమీస్‌‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌‌ అని తేలినప్పుడు అవి రెట్టింపయ్యాయి. సెమీస్‌‌ తొలి రోజు వర్షం రాకముందు మన బౌలింగ్‌‌ ధాటి చూస్తుంటే ఇండియా ఫైనల్‌‌ చేరడం పక్కా.. ఇదే జోరు కొనసాగిస్తే  కప్పూ మనదే అన్న ఫీలింగ్‌‌ కలిగింది. కానీ, గంటల వ్యవధిలోనే ఆ ఆనందం కాస్త విషాదమైంది. కెప్టెన్‌‌ కోహ్లీ ‘ప్రపంచం’ జయిస్తాడని, మాజీ నాయకుడు ధోనీ  వరల్డ్‌‌కప్‌‌తో కెరీర్‌‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతాడని ఆశించిన  వంద కోట్ల అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అప్రతిహతంగా సాగుతున్న ఇండియా జోరుకు, లీగ్‌‌ దశలో చివరి మూడు మ్యాచ్‌‌ల్లో ఓడిన న్యూజిలాండ్‌‌ అడ్డుకట్ట వేస్తుందని ఎవరూ అనుకోలేదు.

ఇండియా ఓటమికి.. టాస్‌‌ కోల్పోవడం, వర్షం అడ్డురావడం కారణాలు అయినా.. బ్యాటింగ్‌‌ ఫెయిల్యూరే మెయిన్‌‌ రీజన్‌‌.  టాపార్డర్‌‌పై అతిగా ఆధారపడడం కొంపముంచింది. టార్గెట్‌‌ పెద్దది కాకున్నా..  బ్యాటింగ్‌‌కు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్‌‌, కోహ్లీ, రాహుల్‌‌ తలో పరుగు చేసి ఔటైనప్పుడే ఇండియా ఓటమి దాదాపు ఖాయమైంది. 2017 చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్లో ఓడిన తర్వాత రోహిత్‌‌, కోహ్లీ ఇద్దరూ ఒకే మ్యాచ్‌‌లో ఇలా ఆరంభంలోనే ఔటవలేదు. వాళ్లు ఫెయిలైనప్పుడు  బ్యాకప్‌‌ ప్లాన్‌‌ లేకపోవడం జట్టును దెబ్బతీసింది. క్లిష్టమైన వికెట్‌‌పై ఓపిగ్గా ఆడితే పరుగులు వస్తాయని తెలిసినా కూడా  బ్యాట్స్‌‌మన్‌‌  చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. తొలి రోజు విలియమ్సన్‌‌, రాస్‌‌ టేలర్‌‌ ఎంత ఓపిగ్గా ఆడారో చూశాక కూడా మనోళ్లు పాఠాలు నేర్చుకోలేకపోయారు. ముఖ్యంగా క్రీజులో కుదురుకున్నాక కూడా రిషబ్‌‌ పంత్‌‌, హార్దిక్‌‌ పాండ్యా షాట్ల కోసం తొందరపడ్డారు. టాలెంట్‌‌ ఉన్నా పేషెన్స్‌‌ లేని కారణంగానే పంత్‌‌ను ముందుగా వరల్డ్‌‌కప్‌‌కు సెలెక్ట్‌‌ చేయలేదు. అదృష్టం కొద్ది వచ్చిన చాన్స్‌‌ను కూడా వృథా చేసుకున్నాడు. ఒకసారి క్యాచ్‌‌ డ్రాపై లైఫ్‌‌ దొరికిన తర్వాత కూడా అతనిలో నియంత్రణ కరువైంది. దినేశ్‌‌  కార్తీక్‌‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.

ఛేజింగ్‌‌లో ఇండియా  బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ కూడా సరిగ్గా లేదనే చెప్పాలి. అనుభవం లేని ఆటగాళ్లను ధోనీ కంటే ముందు  పంపడం తప్పిదమే అనొచ్చు. ధోనీ క్రీజులోకి వచ్చేటప్పటికే  జట్టు డిఫెన్స్‌‌లో పడిపోయింది. స్లో బ్యాటింగ్‌‌ చేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న  మహీ కుర్రాళ్ల మాదిరిగా తొందరపడలేదు.  ప్రశాంతంగా ఆడుతూ అవతలి ఎండ్‌‌లో జడేజాను హిట్టింగ్‌‌ ఆడేలా  ప్రోత్సహించి సరైన సమయంలో సరైన పని చేశాడు. మాజీ కెప్టెన్‌‌ అండతో స్వేచ్ఛగా ఆడిన జడ్డూ ఇండియాను మళ్లీ రేసులోకి తెచ్చి తానెంత విలువైన ఆల్‌‌రౌండర్‌‌నో మరోసారి చాటి చాటుకున్నాడు.  స్పీడు పెంచాల్సిన టైమ్‌‌లో  మంచి బాల్‌‌కు అతను ఔటైనా.. ఫెర్గూసన్‌‌ బౌలింగ్‌‌లో పాయింట్‌‌ దిశగా సిక్సర్‌‌ కొట్టిన తర్వాత తాను మ్యాచ్‌‌ గెలిపించగలన్న కాన్ఫిడెన్స్‌‌ మహీలో కనిపించింది. కానీ, వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే అతను ఓ మెరుపు త్రోకు రనౌట్‌‌ కావడంతో అందరి గుండె పగిలింది.  తన తొలి వన్డేలో రనౌటైన ధోనీ.. వరల్డ్‌‌కప్‌‌లో తన ఆఖరి మ్యాచ్‌‌లోనూ రనౌటవడం గమనార్హం. బహుశా ఇదే అతనికి చివరి ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా భారీ అంచనాలతో బరిలోకి.. అద్భుత ఆటతో నాకౌట్‌‌కు దూసుకొచ్చి.. కప్పుపై ఆశలు రేపిన టీమిండియా ఇలా వరుసగా  రెండో పర్యాయం సెమీస్‌‌లోనే నిష్క్రమించడం విచారకరం. ఈ ఓటమి నుంచి జట్టు ,అభిమానులు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.

Latest Updates