కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం: నాస్కామ్

మన దేశంలో యూనికార్న్‌‌ల సంఖ్యను 2025 నాటికి 95–105 కి చేర్చాలని నాస్కామ్‌‌ టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఈ యూనికార్న్‌‌ల వ్యాల్యుయేషన్‌‌ 350–390 బిలియన్‌‌ డాలర్లుగా ఉండేలా చూడాలని లక్ష్యంగా పనిచేస్తోంది. స్టార్టప్ ఎకో సిస్టమ్‌‌ ద్వారా ఏర్పడే కొత్త ఉద్యోగాల సంఖ్యను కూడా 12,50,000 కి చేర్చాలని ధ్యేయంగా పెట్టుకుంది నాస్కామ్‌‌.   బిలియన్‌‌ డాలర్ల వ్యాల్యుయేషన్‌‌ అందుకున్న స్టార్టప్‌‌ను యూనికార్న్‌‌గా వ్యవహరిస్తున్నారు. స్టార్టప్‌‌ ఎకో సిస్టమ్‌‌లో ఇండియా మూడో ప్లేస్‌‌లో ఉందని నాస్కామ్‌‌ ఒక రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్‌‌ ఎకోసిస్టమ్‌‌ ఉన్న దేశంగా ఇండియా కొనసాగుతోంది. 2019లో ఇండియాలో కొత్తగా 1300 స్టార్టప్స్‌‌ ఏర్పడ్డాయని నాస్కామ్‌‌ రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌‌ మధ్య కాలంలో దేశంలో 8900–9300 టెక్‌‌ స్టార్టప్స్‌‌ ఉన్నాయని, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 7700–8200 మాత్రమేనని తెలిపింది.

పెట్టుబడులూ పెరిగాయ్‌‌…

స్టార్టప్స్‌‌ సంఖ్యతోపాటే వాటిలో పెట్టుబడులూ భారీగా పెరిగాయి. జనవరి–సెప్టెంబర్‌‌ 2019 మధ్య కాలంలో స్టార్టప్స్‌‌లో పెట్టుబడులు రూ.31,113 కోట్ల   (4.4 బిలియన్‌‌ డాలర్లు)కు చేరాయని నాస్కామ్‌‌ రిపోర్టు పేర్కొంది. ఈ పెట్టుబడులను 450 స్టార్టప్స్‌‌ దక్కించుకున్నాయని తెలిపింది. ఎర్లీ స్టేజ్‌‌ ఫండింగ్‌‌ కూడా పెరిగి రూ.  11,313 (1.6 బిలియన్‌‌ డాలర్లు)కు చేరుకుందని వెల్లడించింది. ఇనొవేటర్ల సామర్ధ్యాన్ని పెంపొందించడంలో స్టార్టప్‌‌ ఎకో సిస్టమ్‌‌ పాత్ర చాలా ఉందని నాస్కామ్‌‌ పేర్కొంది. వివిధ రంగాలలోని కంపెనీలు భవిష్యత్‌‌లో డిజిటల్‌‌గా మారేందుకు ప్రయత్నించనుండటంతో, సంబంధిత టెక్నాలజీలకు మరింత ఊపు రానుందని నాస్కామ్‌‌ ప్రెసిడెంట్‌‌ దేబ్‌‌జాని ఘోష్‌‌ చెప్పారు. దేశంలోని స్టార్టప్స్‌‌ ఒక్క 2019 లోనే 60 వేల కొత్త ఉద్యోగాలు కల్పించాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ ఉద్యోగాల సంఖ్య 40 వేలు.

ఇంకో 50 యూనికార్న్‌‌లను గుర్తించాం…

యూనికార్న్‌‌గా ఎదిగే సామర్ధ్యమున్న మరో 50 స్టార్టప్స్‌‌ను కూడా నాస్కామ్‌‌ రిపోర్టు గుర్తించింది. ఈ స్టార్టప్స్‌‌ ఒక్కోటీ ఇప్పటికే 50 మిలియన్‌‌ డాలర్లకు మించిన నిధులు సమీకరించగలిగాయి. గ్రేఆరంజ్‌‌, గ్రోఫర్స్‌‌, పైన్‌‌లాబ్స్‌‌ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయని నాస్కామ్‌‌ తెలిపింది. డీప్‌‌ టెక్నాలజీ స్టార్టప్స్‌‌ ఏర్పాటు 33 శాతం పెరిగిందని పేర్కొంది. మెడికల్‌‌ డయాగ్నస్టిక్స్‌‌, ప్రెసిషన్‌‌ ఎగ్రికల్చర్‌‌, ఫ్రాడ్‌‌ డిటెక్షన్‌‌ వంటి విభాగాలలో ఏర్పాటైన స్టార్టప్సూ ఇందులో ఉన్నాయని తెలిపింది. స్థానికంగా ఉండే సమస్యలకు టెక్నాలజీతో సొల్యూషన్స్‌‌ అందించే ఇన్నోవేషన్‌‌ మన దేశంలో సాధారణమైందని, కాకపోతే ఇది ఊపందుకోవడానికి ప్రభుత్వం, కార్పొరేట్లు, ఇతర స్టేక్‌‌ హోల్డర్లు మరింత చురుగ్గా భాగం పంచుకోవాలని నాస్కామ్‌‌ రిపోర్టు అభిప్రాయపడింది.  ఇండియాలో 335 ఇన్‌‌క్యుబేటర్లు, యాక్సిలరేటర్లు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

కొత్త యూనికార్న్‌‌లు….

యూనికార్న్‌‌ స్థాయికి చేరాలనే ఆకాంక్ష ఉన్న కంపెనీల సంఖ్యా పెరుగుతోందని ఈ రిపోర్టు తెలిపింది. యూనికార్న్‌‌ అంటే వ్యాల్యుయేషన్‌‌ పరంగా బిలియన్‌‌ డాలర్లు (రూ. 7 వేల కోట్లు) అందుకోవడం. 2019 లో ఇండియాలో 7 కొత్త యూనికార్న్‌‌లు అవతరించాయి. దీంతో యూనికార్న్‌‌ల సంఖ్య 24 కి పెరిగింది. ఎక్కువ యూనికార్న్‌‌లు ఉన్న దేశాలలోనూ మూడో ప్లేస్‌‌లో మన దేశం నిలుస్తోంది. బిగ్‌‌బాస్కెట్‌‌, డెల్హివరీ, రివిగో, డ్రీమ్‌‌11,ద్రువ, ఓలా ఎలక్ట్రిక్‌‌, ఐసెర్టిస్‌‌లు కొత్తగా యూనికార్న్‌‌లుగా అవతరించాయి. యూనికార్న్‌‌లలో 71 శాతం బీ2బీ పైనే ఫోకస్‌‌ పెడుతున్నాయి. యూనికార్న్స్‌‌లో 57 శాతం గేమింగ్‌‌, సప్లై చెయిన్‌‌, లాజిస్టిక్స్‌‌, ఆటోమోటివ్‌‌ రంగాల స్టార్టప్సే ఉన్నాయి.

Latest Updates